ఏ వెలుగు మంచిది? సహజమైనదా, కృత్రిమమైనదా?

ఆకలి వేయడం, సమయానికి నిద్ర రావడం శరీరం ఆరోగ్యంగా ఉందనడానికి సంకేతం. కానీ మనం ఇప్పుడు సమయానికి తినడం లేదు, పడుకోవడం లేదు.
వేగంగా మారిపోతున్న మన జీవనశైలే దానికి కారణం.
మల్టీ నేషనల్ కంపెనీల పుణ్యమా అని ఇప్పుడు పనులు 24 గంటలూ ఉంటున్నాయి. అందుకే పడుకునే సమయం, తినే సమయం కూడా మర్చిపోతున్నాం.
జీవితంలో మూడో వంతు సమయాన్నినిద్రపోతూనో, నిద్రపోవడానికి ప్రయత్నిస్తూనో గడిపెయ్యాలి.
రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలని డాక్టర్లు చెబుతున్నా, ప్రస్తుతం చాలా మంది అంతసేపు పడుకోవడం లేదు.
నిద్రకు అన్నిటికంటే పెద్ద శత్రువు ఏది?
నిద్రకు దూరం కావడానికి మన అతిపెద్ద శత్రువు గాడ్జెట్స్.
మనకు నిద్ర పట్టకపోవడానికి మొబైల్ ఫోన్, టాబ్లెట్, లాప్టాప్ లాంటివి చాలా వరకు కారణం అవుతున్నాయి.
ముఖ్యంగా మొబైల్ ఫోన్ లైట్ మన నిద్రకు చాలా అంతరాయం కలిగిస్తుంది.
కృత్రిమ లైట్లు అన్నీ ఆపేస్తే, మనం హాయిగా నిద్రపోగలమా?
దీనిపై ఎన్నో ప్రశ్నలున్నాయి. విద్యుత్ వెలుగులు లేకుండా ఈ రోజుల్లో జీవించడం సాధ్యమేనా?
రచయిత లిండా గెడెస్ ఈ ప్రశ్నలకు జవాబులు వెతుక్కుంటూ వెళ్లారు.
నిద్రపై రీసెర్చ్ చేస్తున్న పరిశోధకులు డెర్క్జెన్ డిజ్క్, నయనతార శాంతితో కలిసి ఆమె పనిచేశారు.
వారు చేసిన పరిశోధనలో షాక్ ఇచ్చే ఫలితాలు వచ్చాయి.
ఏ వెలుగు మంచిది? సహజమైనదా, కృత్రిమమైనదా?
పారిశ్రామిక విప్లవం వల్ల మనకు దొరికిన వాటిలో అత్యంత విలువైనది విద్యుత్.
అంతకు ముందు మనందరం సహజ వెలుతురులోనే జీవించేవాళ్లం.
ఇప్పటికీ విద్యుత్ లేని ప్రాంతాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి.
మన దేశంలో కొన్నిసార్లు పట్టణాల్లో కూడా అలాంటి పరిస్థితి వస్తూనే ఉంటుంది.
విద్యుత్ లేని ప్రాంతాల్లో ఉన్న వాళ్లు కూడా పొద్దువాలగానే నిద్రపోరు. రాత్రిళ్లు వెలుగు కోసం మంట వేసుకుంటారు.
తేడా ఒక్కటే, అక్కడ సమయానికి నిద్రపోతారు, ఉదయం లేచి తమ పనుల్లో మునిగిపోతుంటారు.
కానీ పట్టణాల్లో ఉన్న వాళ్లు మాత్రం మొదట నిద్రపోవడానికి తంటాలు పడతారు, ఇక నిద్రపడుతోందనగా లేవడానికి కష్టాలు పడతారు.
సహజ వెలుగులో జీవించే వాళ్లు కూడా విద్యుత్ వెలుగులో ఉండేవాళ్లలాగే అంతసేపే పడుకుంటారు.
కానీ ఈ రెండు నిద్రల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది.
- గ్వాటెమాల అడవుల్లో నిదుర లేచిన మయా నాగరికత!
- అధ్యయనం: ‘గర్భిణులు ఈ మాత్రలు వాడితే.. పుట్టబోయే పిల్లలకు పిల్లలు పుట్టరు..!’
హడ్జా తెగ ప్రజల్లో నిద్రలేమి సమస్యే ఉండదు!
టాంజానియాకు చెందిన హడ్జా తెగ ప్రజలు ఇప్పుడు కూడా విద్యుత్ లేకుండానే జీవిస్తున్నారని కెనడాలోని టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు డేవిడ్ సైమన్ చెప్పారు.
అక్కడ నిద్రలేమి లాంటి జబ్బులు అసలు కనిపించవని ఆయన తెలిపారు. అయితే పశ్చిమ దేశాల్లో గణాంకాలు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.
వెలుతురులో మనకు చాలా బాగా కనిపిస్తుంది. కానీ, అదే వెలుగు మన శరీరం పనిచేసే విధానంపై కూడా ప్రభావం చూపిస్తోంది.
ఉదయం వెలుతురు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రి వెలుతురు మాత్రం శరీరం పనిచేసే వేగాన్ని తగ్గిస్తుంది.
వెలుతురు మనకు నిద్రపట్టేలా చేసే మెలాటొనిన్ హార్మోన్‌ను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దాని ప్రభావం గుండె, మెదడు పనితీరుపై కూడా ఉంటుంది.
"వెలుగు మన అప్రమత్తతను పెంచుతుంది, అందుకే పనిచేయడానికి అనువుగా ఉంటుంది" అని ప్రొఫెసర్ నయనతారా శాంతి పేర్కొన్నారు.
"కానీ, నిద్రపోవడానికి ఇది పనికిరాదు. అంతే కాదు, వెలుతురు వల్ల మన మూడ్‌పై కూడా చాలా ప్రభావం పడుతుంది" అన్నారు.
మన శరీరం పనితీరుపై వెలుగు, చీకటి ఎంత ప్రభావం చూపిస్తాయో తెలుసుకోడానికి లిండా గెడెస్ ఒక అనుభవాన్ని పొందారు.
విద్యుత్ వెలుగు లేకుండా జీవించే ఒక కుటుంబంతో ఆమె కొన్ని వారాలపాటు గడిపారు.
మొదటి వారంలో ఆమె కాసేపు విద్యుత్ వెలుగులో ఉండేవారు.
సాయంత్రం 6 గంటల తర్వాత లిండా తన లాప్టాప్ వెలుతురు అంటే బ్రైట్నెస్ కూడా తగ్గించేసేవారు.
తర్వాత ఆమె కొవ్వొత్తి వెలుతురులో ఇంట్లో అన్ని పనులూ చేసుకునేవారు
పరిశోధకులు ఆ సమయంలో ఆమె మెలాటొనిన్ హార్మోన్‌పై దృష్టి పెట్టారు.
అది శరీరంలో బయాలాజికల్ నైట్ ఏర్పడేందుకు పనిచేస్తుంది.
మొదటి వారంలో ఆమె సగటున నాలుగున్నర గంటలు సూర్యుడి వెలుగులో గడిపేవారు. రెండో వారంలో ఆ సమయం గంట కంటే తక్కువ అయ్యింది.
ఈ అనుభవంతో మొదట్లో ఆమె ఉదయం గదిలోకి వీలైనంత ఎక్కువగా సహజ వెలుతురు వచ్చేలా పరదాలు కూడా తొలగించేవారు.
కానీ రాత్రి వేళ మాత్రం వీధిలో వెలిగే దీపం వల్ల ఆమె ఇబ్బంది పడేవారు.
2016లో చేసిన పరిశోధన నివేదిక ప్రకారం ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా పెద్ద పట్టణాల్లో ఉన్నవారికి ఎదురవుతుంటాయి.
నిజానికి రాత్రి వేళ పెద్ద పట్టణాల్లో లైట్ల వెలుగు చిన్న పట్టణాల్లో లైట్లతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువ వెలుగులో ఉండేవాళ్లకు నిద్రపట్టని సమస్య ఎక్కువగా ఉంటుంది.
సరిగా నిద్రలేకపోవడం వల్ల రోజంతా అలసటగా అనిపిస్తుంది.
పడుకునే ముందు ఈ-రీడర్లో చదివే వారికి కూడా నిద్రపట్టడంలో సమస్యలు ఎదురవుతాయి.
అంతేకాదు, రాత్రి నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్లో వీడియో గేమ్ ఆడేవారు కూడా ఆ సమయంలో చాలా యాక్టివ్ అవుతారు.
కానీ, ఆ ప్రభావం తర్వాతి రోజు ఉదయం ఉంటుంది.
ఆర్టిఫిషియల్ లైట్ కంటే సహజ వెలుతురులో ఎక్కువగా ఉండేవారిలో మెలాటొనిన్ హార్మోన్ ఉత్తేజంగా ఉంటుంది.
అందుకే సరిగ్గా సమయానికి నిద్రపోవాలని బాడీ క్లాక్ సిగ్నల్ ఇస్తుంది.
నిద్ర, మూడ్‌పై వెలుతురు రంగుల ప్రభావం
వెలుతురులోని రంగులు కూడా మన నిద్ర, మూడ్‌పై ప్రభావం చూపిస్తాయి.
వెలుగులోని రంగులూ ప్రభావం చూపుతాయి.
2007లో ఒక పరిశోధన కోసం ఒక అంతస్తులో ఒక వ్యక్తిని నీలం రంగు లైట్లో, మరో అంతస్తులో ఇంకో వ్యక్తిని తెల్లటి వెలుగులో నాలుగు వారాలు పనిచేయించారు.
నాలుగు వారాల తర్వాత ఇద్దరూ ఉన్న అంతస్తుల్లో లైట్లు మార్చారు.
పగలు తెల్లటి వెలుగులో పనిచేసిన వారి పనితీరు చాలా మెరుగుపడినట్టు గుర్తించారు. అతడు చాలా అప్రమత్తంగా కూడా ఉన్నాడు.
రాత్రి భోజనం కూడా బాగా తినేవాడు. తను ఎక్కువ గంటలు నిద్రపోయాడు కూడా.
సాయంత్రం సమయంలో మనం ఎలాంటి వెలుగులో ఉంటామనేది పగలంతా మనం ఎలాంటి వెలుగులో ఉన్నాం అనే దానిపైన ఆధారపడుతుంది.
పగలు సహజ వెలుగులో గడపడం, రాత్రి ఆర్టిఫీషియల్ లైట్ తక్కువగా ఉయోగించడం చాలా మంచిది.
సహజ వెలుతురు నిద్రకు మంచిది!
ప్రకాశవంతంగా ఉన్న లైట్ ఉన్న చోట తక్కువగా వెలిగే లైట్ పెడితే, నిద్ర చాలా బాగా పట్టొచ్చు.
శతాబ్దాల నుంచీ పగటి పూట మనుషులు సూర్యుడి వెలుగులోనే పనులు చేసుకుంటున్నారు.
రాత్రి చీకటిగా ఉన్నప్పుడు నెగడు వెలుగులో కాసేపు గడిపి, తర్వాత వెన్నెల రాత్రుల్లో జీవిస్తూ వచ్చారు.
రాత్రి బాగా నిద్రపట్టాలంటే పగలు వీలైనంత వరకూ సహజ వెలుతురులో ఉండడం చాలా మంచిది.
నిద్ర చాలా పెద్ద వరం. కానీ మనం చేజేతులా చేస్తున్న చిన్న చిన్న తప్పుల వల్ల ఈ అమూల్యమైన వరం క్రమంగా చేజారిపోతోంది.
ఇవి కూడా చదవండి:
- మనకు వెలుగిచ్చే సూర్యుడికే మరణం వస్తే? ప్రపంచం అంతమైపోతుందా?
- గూగుల్ డుప్లెక్స్: మీ పని గూగుల్ చేసి పెడుతుంది!
- అంతరిక్షంలోనూ సైనిక వ్యవస్థ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వినూత్న ఆలోచన సాధ్యమయ్యే పనేనా?
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!

(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)