టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత

  • 11 మే 2018
బురఖా ధరించిన యువతి

మెర్వ్ తన తలకు కట్టుకున్న ఎర్రటి స్కార్ఫ్‌ను నాకు చూపిస్తూ "ముస్లిం అనిపించే వస్తువుల్లో ఇదొక్కటే మిగిలింది" అని చెప్పారు.

టర్కీలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మతం గురించి మెర్వ్ బోధిస్తారు. ఆమె ఒకప్పుడు ఇస్లాంను బలంగా నమ్మేవారు..

"మొన్నటివరకూ, నేను పురుషులకు కనీసం షేక్ హాండ్ కూడా ఇవ్వలేదు" అని ఆమె ఇస్తాంబుల్ కేఫ్‌లో నాకు చెప్పింది. "కానీ ఇప్పుడు నాకు దేవుడున్నాడా లేదా అనేది తెలీదు, దాని గురించి అసలు పట్టించుకోను" అంది.

అధ్యక్షుడు ఎర్డోగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన 16 ఏళ్లలో టర్కీలో ఉన్న మతపరమైన ఉన్నత పాఠశాలలు పదింతలకు పైగా పెరిగాయి.

భక్తి ఉన్న తరాన్ని తీసుకురావడం గురించి ఆయన పదే పదే మాట్లాడారు.

కానీ మత బోధన వల్ల పిల్లలు మతానికి దూరమైపోతున్నారా అనే అంశం గురించి గత కొన్ని వారాలుగా రాజకీయ నేతలు, మత పెద్దలు చర్చించుకుంటున్నారు.

ఒక రోజు మెర్వ్ కుంగుబాటు నుంచి బయటపడి, కొన్ని గంటల వరకూ ఏడ్చింది. తను ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె జీవితంలో మార్పు వచ్చింది.

ప్రార్థిస్తుండగా, దేవుడి ఉనికిపైనే సందేహాలు తలెత్తడంతో ఆమె షాక్ అయ్యింది.

"నాకు పిచ్చైనా పడుతుంది లేదంటే ఆత్మహత్యైనా చేసుకుంటానని అనిపించింది" అని చెప్పింది. "తర్వాత రోజు నా నమ్మకం కోల్పోయినట్టు నాకు తెలిసింది" అని చెప్పింది.

తనొక్కతే కాదు. తలకు స్కార్ఫ్స్ కట్టుకున్న పది మందికి పైగా విద్యార్థినులు తన దగ్గరికి వచ్చి తాము గత ఏడాది నుంచీ నాస్తికులుగా ఉన్నామని చెప్పారని ఒక ప్రొఫెసర్ కూడా అన్నారు.


బెకిర్, థియాలజీ విద్యార్థి

"ఈ మధ్య వరకూ నేను ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా లాంటి విప్లవ బృందాల సానుభూతిపరుడుగా ఉన్నా. ఈరోజు నేను నాస్తికుడ్ని అయ్యా. మొదట్లో నేను ఇస్లాంలో లాజిక్ గుర్తించాలని అనుకునేవాడ్ని. కానీ గుర్తించలేకపోయా. తర్వాత నేను దేవుడ్ని కూడా ప్రశ్నించడం మొదలుపెట్టా. నేను ఇక్కడ ఇస్లాం ప్రభుత్వాన్ని సమర్థించేవాడ్ని. కానీ అణచివేతతో విప్లవం పుడుతుంది. వాళ్లు మమ్మల్ని అణచేయాలనుకున్నారు. మేం స్పందించడం మొదలెట్టాం" అని థియాలజీ విద్యార్థి బెకిర్ చెప్పారు.


కానీ ఇక్కడ నాస్తికత్వం మాత్రమే విద్యార్థులకు ఇబ్బంది కలిగించడం లేదు.

టర్కీలో అత్యంత సంప్రదాయ నగరాల్లో ఒకటైన కోన్యాలోని ఒక వర్క్‌షాప్‌లో మతపరమైన ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులను దైవికవాదం వైపు నడిపిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. విపక్షాలకు చెందిన వార్తాపత్రికల రిపోర్ట్ ప్రకారం వాటిని "ఇస్లాంలో అసమానతలు"గా పేర్కొన్నారు.

దైవికవాదం మూలాలు గ్రీక్ సంస్కృతిలో ఉన్నాయి. దీన్ని అనుసరించేవారు దేవుడు ఉన్నాడని నమ్మారు. కానీ వారు అన్ని మతాలను తిరస్కరించారు.

విద్యా మంత్రి ఇస్మెత్ యిల్మాజ్ ఈ వర్క్‌షాప్‌కు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవన్నారు. టర్కీలో పిల్లలు వేరే కోర్సులకు మారుతున్నారని చెబుతున్న నివేదికలను ఖండించారు.

అయితే, ఇది ఎంతగా వ్యాపించింది అనేది సూచించడానికి ఎలాంటి గణాంకాలు, పోల్స్ లేవు. ఈ వార్తలు మాత్రం టర్కీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి.


లైలా, కాలేజీ విద్యార్థిని

"ఒక రోజు నేను మార్కెట్‌కు రోడ్డుమీద వెళ్తున్నా. నా తల స్కార్ఫ్ తీసేశా, దాన్ని మళ్లీ వేసుకోలేదు. మా నాన్నకు నేను నాస్తికురాలినని తెలీదు. తనకు తెలిస్తే, ఆయన మా చెల్లిని డిగ్రీ చేయకుండా ఆపేస్తాడేమోనని భయపడ్డా. నీ చెల్లి యూనివర్సిటీకి వెళ్తే, తను కూడా ఇలాగే అవుతుందా అనచ్చు. నన్ను సృష్టించమని నేను దేవుడ్ని అడగలేదు. అందుకే బదులుగా దేవుడు కూడా నా నుంచి ఏదీ అడగలేడు. నాకు పక్షిలా స్వేచ్ఛగా జీవించే హక్కుంది" అని కాలేజీ విద్యార్థిని లైలా చెప్పారు.


టర్కీలోని ఒక మత పెద్ద, మత వ్యవహారాల డైరెక్టరేట్ అధిపతి అయిన అలీ అర్బాస్ కూడా దేశంలోని సంప్రదాయ యువతలో ఆస్తికత్వం, నాస్తికత్వం వ్యాప్తి చేస్తున్నామనే విషయాన్ని ఖండించారు. "మా దేశంలోని ఏ పౌరుడూ అలాంటి వాటిని అనుసరించరు" అని అన్నారు.

థియాలజీ ప్రొఫెసర్ హిదయత్ అయబర్ కూడా దైవికవాదం వైపు మళ్లించడం లాంటిదేదీ లేదని చెప్పారు.

"దేవుడున్నాడు అనేది ఇస్లాం విలువలను తిరస్కరిస్తుంది. అది ఖురాన్‌, అల్లాను తిరస్కరిస్తుంది. అది స్వర్గం, నరకం, దేవతలు, పునర్జన్మను తిరస్కరిస్తుంది. ఇవన్నీ ఇస్లాం మతానికి మూలస్తంభాలు. దైవికవాదం దేవుడు ఉన్నాడని మాత్రమే అంగీకరిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

దేవుడు లేడని చెప్పేవారి సిద్ధాంతం ప్రకారం, దేవుడు విశ్వాన్ని, దానిలోని ప్రాణులన్నింటినీ సృష్టించాడు. కానీ ఆ సృష్టించిన దానిలో జోక్యం చేసుకోకూడదు. నియమాలు లేదా సూత్రాలు విధించకూడదు.

"మా సంప్రదాయ యువతకు దైవికవాదంపైన అంత ఆసక్తి లేదని నేను కచ్చితంగా చెప్పగలను" అని ఆయన గట్టిగా చెప్పారు.


ఒమర్, తొలగించబడ్డ ప్రభుత్వోద్యోగి, నిరుద్యోగి

‘‘నేను ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండేవాడ్ని. 2016లో తిరుగుబాటుకు ప్రయత్నించడంతో నన్ను తీసేశారు. నేను ప్రభుత్వంలో ఉన్న పార్టీని, దాని విధానాలను గట్టిగా సమర్థించిన మతపరమైన, సంప్రదాయ యువకుడిని. నన్ను తీసేసినపుడు నేను దేవుడ్ని ప్రశ్నించడం మొదలుపెట్టా. నేను విరోధినైపోయా. నన్ను నేను ఒక దైవికవాదిగా అనుకోవడం లేదు. ఇస్లాంతో నా బంధం పెంచుకోవాలనుకుంటున్నా. కానీ అది సాధ్యమవుతుందో లేదో నాకు తెలీడం లేదు’’ అని ఒమర్ చెప్పారు.


ప్రస్తుతం అక్కడి పరిస్థితి గురించి ప్రొఫెసర్ ఐబర్ చెప్పింది తప్పని టర్కీలోని ఒకే ఒక నాస్తికుల సంఘం వాదిస్తోంది. ఇమాంలలో కూడా నాస్తికులు ఉన్నారని అంటోంది.

"ఇక్కడ నాస్తికులను ఏం చేయాలనే అంశంపై టీవీల్లో చర్చలు నడుస్తుంటాయి, కొందరు వాళ్లను చంపాలంటారు, వాళ్లను ముక్కలుగా నరికేయాలని చెబుతారు" అని ఆ చర్చల్లో మాట్లాడే సనేర్ అటిక్ పేర్కొన్నారు.

"అలాంటి పరిస్థితుల్లో మనల్ని ఒక నాస్తికుడని చెప్పుకోడానికి చాలా ధైర్యం కావాలి. బురఖా(నిఖాబ్‌)లలో ఉండే కొంతమంది మహిళలు తాము నాస్తికులమని రహస్యంగా అంగీకరిస్తారు. కానీ వారు వాటిని తీసేయలేరు. ఎందుకంటే వాళ్లు తమ కుటుంబానికి, తాము ఉన్న ప్రాంతానికి భయపడతారు" అన్నారు.

నేను మెర్వ్‌ను ఇంట్లో రెండోసారి కలిశాను. ఆమె తన తలకు స్కార్ఫ్ లేకుండానే నన్ను పలకరించారు. తను ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ పురుషులున్నా, తన జుట్టును అలా వదిలేయాలని నిర్ణయించారు.

"తలకు స్కార్ఫ్ లేకుండా నేను మొదటిసారి ఒక పురుషుడిని కలిసినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది, కానీ ఇప్పుడు ఇది చాలా సహజంగా ఉంది, ఇప్పుడు నేను నాలా ఉన్నాను" అని ఆమె నాకు చెప్పారు.

(ఈ కథనంలో ప్రస్తావించిన నాస్తికులు, ఆస్తికుల పేర్లు మార్చాం.)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

ముఖ్యమైన కథనాలు