డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ భేటీ సింగపూర్‌లోనే ఎందుకు?

  • 11 మే 2018
ట్రంప్.. కిమ్ Image copyright Getty Images

కొన్ని రోజుల ముందు వరకూ ఇద్దరు దేశాధినేతలు ప్రపంచంలోనే అతిపెద్ద శత్రువుల్లా కనిపించారు. యుద్ధం వాకిట్లో నిలిచారు. ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు, విద్వేషాలను చల్లార్చేందుకు చేతులు కలపబోతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ జూన్ 12న సింగపూర్‌లో కలవబోతున్నారు. ఇద్దరూ సమావేశం అవుతారని ప్రకటన రాగానే.. ఇద్దరూ ఎక్కడ కలుస్తారోననే అంతా ఊహాగానాలు మొదలయ్యాయి.

ఆ ఊహలకు తెరదించిన ట్రంప్ స్వయంగా ట్వీట్ చేశారు. "కిమ్ జోంగ్ ఉన్‌తో నేను సమావేశం అయ్యే రోజు కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అది జూన్ 12న సింగపూర్‌లో జరుగుతుంది. ఈ భేటీ విశ్వశాంతికి చాలా ప్రత్యేకమైన క్షణం అయ్యేలా మేమిద్దరం ప్రయత్నిస్తాం" అని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద హై-ప్రొఫైల్ సమావేశం ఎక్కడ జరగబోతోందో తెలిసినప్పటి నుంచీ.. అసలు ఈ సమావేశం కోసం సింగపూర్‌ను ఎందుకు వేదికగా ఎంచుకున్నారనే ప్రశ్నలు తలెత్తాయి.

Image copyright Reuters

సింగపూర్‌కు ప్రత్యామ్నాయం ఏది

ట్రంప్, కిమ్ సమావేశం సింగపూర్‌లో జరగవచ్చని అంతా అనుకుంటున్నప్పుడు, దానితోపాటూ డీఎంజడ్ ( డీమిలిట్రైజ్డ్ జోన్ ) పేరు కూడా వినిపించింది.

దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య సరిహద్దు ప్రాంతమే డీఎంజడ్. అంటే కిమ్ దక్షిణ కొరియా అధ్యక్షుడిని కలవడానికి వచ్చినపుడు ఈ ప్రాంతం నుంచే బోర్డర్ దాటి వెళ్లారు.

మొదట్లో ట్రంప్ కూడా దానికి సిద్ధమన్నట్టు వార్తలొచ్చాయి. కానీ కొంతమంది ట్రంప్ డీఎంజడ్‌ వద్దకు వెళ్లడం అంటే.. అది దాదాపు ఉత్తర కొరియా వెళ్లినట్టే అని భావించారు.

ఈ సమావేశం కోసం ట్రంప్ ఉత్తర కొరియాకు, కిమ్ జాంగ్ ఉన్ అమెరికాకు వెళ్లే ప్రసక్తే ఉండదని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది.

ఆ ప్రాంతం ఏదైనా మూడోదే కావాలి. ఎందుకంటే కిమ్ ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ దేశాలు, లేదా యూరప్ వెళ్లడానికి సిద్ధం కారు. అవే కాదు, కిమ్ జోంగ్ ఉన్ జపాన్, దక్షిణ కొరియా వెళ్లడానికి కూడా ఒప్పుకునేవారు కాదు.

ఈ సమావేశానికి చైనా ఆతిథ్యం ఇచ్చుండచ్చు. కానీ దానికి అమెరికా ఒప్పుకోదు. ఆసియాలోని వేరే దేశాలు, ఆఫ్రికా భద్రత దృష్ట్యా అంత సురక్షితం కాదు.

ఈ ప్రత్యామ్నాయాలే కాకుండా ఈ సమావేశానికి మంగోలియా పేరు కూడా తెరపైకి రావడం ఆసక్తి కలిగించింది. కానీ అది చైనాకు దగ్గరవడంతో దానిపై అమెరికా అంత ఆసక్తి చూపించకపోయుండచ్చు.

Image copyright Getty Images

కిమ్‌కు నచ్చిన చోటు?

అన్నిటికంటే ముఖ్యంగా సింగపూర్ తటస్థంగా ఉంటుంది. ఆ దేశానికి కొరియా ద్వీపకల్పంపై ఎలాంటి ఆసక్తి లేదు. ఉత్తర కొరియా-సింగపూర్ మధ్య వాణిజ్య సంబంధాలు కూడా గత సంవత్సరమే ముగిశాయి. అది మినహా రెండు దేశల సంబంధాలు కాస్తోకూస్తో బాగానే ఉన్నాయి.

చెప్పాలంటే చాలా రోజుల వరకూ ఉత్తర కొరియా ప్రజలకు సింగపూర్ వెళ్లడానికి వీసా అవసరం కూడా రాలేదు.

ప్రపంచంలో ఉత్తర కొరియా రాయబార కార్యాలయాలున్న40 దేశాల్లో ఇది కూడా ఉంది. సింగపూర్‌లో సమావేశానికి కిమ్ జోంగ్ ఉన్‌ కూడా సుముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు.

ఇది కాకుండా సింగపూర్, ఉత్తర కొరియా మధ్య ఎక్కువ దూరం లేదు. కిమ్ కూడా తక్కువ సమయంలో అక్కడికి చేరుకోగలరు. ఇది చాలా పెద్ద విషయమే, ఎందుకంటే.. విమాన ప్రయాణం గురించి ఆయన ఎక్కువ ఆందోళన పడుతుంటారు.

Image copyright Getty Images

సింగపూర్, అమెరికా స్నేహం

ఉత్తర కొరియా నాయకుడి టెన్షన్ దూరం చేసిన సింగపూర్ అటు అమెరికాకు కూడా ఎప్పటి నుంచో మిత్రదేశంగా ఉంది. ఇక్కడ తమ నౌకలను ఉంచడం అమెరికాకు చాలా ఇష్టం. అమెరికా నౌకాదళానికి సింగపూర్ వ్యూహాత్మక స్థావరం.

అంతే కాదు, సింగపూర్ పట్ల అమెరికా చాలా సానుకూలంగా ఉంది. ఉత్తర కొరియా నాయకుడితో జరిగే సమావేశంలో అది ఈ దేశానికి భద్రత గురించి కూడా భరోసా ఇవ్వవచ్చు.

దీనికి తోడు సింగపూర్ ఇలాంటి సమావేశాలను ఇంతకు ముందే విజయవంతంగా నిర్వహించింది. 2015లో చైనా, తైవాన్ కూడా 60 ఏళ్ల తర్వాత ఇక్కడే కలిశాయి.

సింగపూర్‌కు చెందిన ప్రముఖ వార్తా పత్రిక స్ట్రెయిట్ టైమ్స్ "సింగపూర్‌లో సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుంది. ఏ అమెరికా అధ్యక్షుడికైనా అది చాలా ముఖ్యం. దీనితోపాటూ చాలా తక్కువ సమయంలో వారు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి చేయగలరు" అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)