నేపాల్‌లో కొందరు 'మోదీ నాట్ వెల్‌కమ్' ఎందుకు అంటున్నారు?

  • 12 మే 2018
మోదీ - కేపీశర్మ Image copyright Getty Images

భారత ప్రధాని మోదీ నేపాల్ పర్యటనలో ఉన్నారు. అయితే అక్కడి ప్రజలు కొందరు ఆయన పర్యటనను వ్యతిరేకిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన నేపాల్ వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఇప్పటిదాకా ఒక్క మోదీ తప్ప మరే భారత ప్రధానీ తన పదవీ కాలంలో మూడు సార్లు నేపాల్ వెళ్లలేదు. పైగా నేపాల్ ప్రధాని భారత్‌కు వచ్చిన 33రోజుల్లోనే మోదీ అక్కడికి వెళ్లారు.

ఈ నేపథ్యంలో మోదీ పర్యటనను అక్కడివాళ్లు వ్యతిరేకించడానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైంది 2015 'నాకాబందీ'.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionనేపాల్ ప్రజలు: భారత్ తమ హామీలు నెరవేర్చలేదు

2015 సెప్టెంబర్‌లో నేపాల్‌లో 'నాకాబందీ' (దిగ్బంధం) చోటు చేసుకుంది. అదే ఏడాది ఏప్రిల్‌లో అక్కడ సంభవించిన భారీ భూకంపం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోకముందే ఈ 'నాకాబందీ' అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా భారత్ నుంచి ఆ దేశానికి అనేక నిత్యావసరాలు, ఉత్పత్తుల ఎగుమతి ఆగిపోయింది.

పెట్రోల్‌తో సహా అనేక ఉత్పత్తుల కోసం భారత్‌పైనే నేపాల్ ఆధారపడుతుంది. 'నాకాబందీ' సమయంలో పెట్రోల్, డీజిల్‌ లాంటివి లభించక ఆ దేశంలో వాటి ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. ఆహార పదార్థాలు, ఔషధాలకు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. దాంతో ప్రజలంతా వీధుల్లోకి వచ్చి 'నాకాబందీ'కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భారత్ దానిపై స్పందించింది. నేపాల్‌లోని అంతర్గత పరిస్థితులవల్లే అక్కడికి ఉత్పత్తుల్ని రవాణా చేయడం సాధ్యం కావడం లేదని తెలిపింది. కానీ ఆ దేశ ప్రభుత్వం మాత్రం తప్పు భారత్‌దే అని విమర్శించింది.

ఇప్పుడు అక్కడి ప్రజలు మోదీ పర్యటనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 'నాకాబందీ నేరం', 'మోదీని నేపాల్‌లోకి స్వాగతించట్లేదు', 'నాకాబందీ విషయంలో మోదీ క్షమాపణలు చెప్పాలి' అంటూ ట్విటర్ వేదికగా ప్రజలు తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

'నూనె, ఆహార పదార్థాలు, ఔషధాలకు ఆర్నెల్లపాటు కొరత ఏర్పడింది. ఆ బాధను ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాం మోదీజీ' అని భీమా ఆత్రేయ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

'మోదీ పట్లనే అసంతృప్తి... భారత్ పట్ల వ్యతిరేకత కాదు'

'మేం మిమ్మల్ని స్వాగతించడంలేదు. దీనర్థం మేము భారత్‌కు వ్యతిరేకం అని కాదు' అని శైలేష్ పోఖ్రేల్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

'భూకంపం తరవాత నాశనమైన భవనాల పునర్నిర్మాణం చైనా, అమెరికాల సాయంతో కొనసాగుతోంది. పరిస్థితి దిగజారడానికి నేపాల్‌తో పాటు భారత ప్రభుత్వం కూడా కారణమే. భూకంపం తరవాత మోదీ 100 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కానీ అందులో 25శాతం మాత్రమే ఇచ్చారు' అంటూ కాఠ్మండూలో ఉండే హరిశంకర్ వైద్య అనే వ్యక్తి బీబీసీతో చెప్పారు.

'మోదీ ఈసారైనా బాధ్యతగా వ్యవహరించాలి. గతంలో తలెత్తిన సమస్య మళ్లీ రాకూడదు' అని రోసిత శ్రేష్ఠ అన్నారు.

నేపాల్ కొత్త రాజ్యాంగ నిర్మాణంలో తమ హక్కులు, ఆశయాలను పరిగణనలోకి తీసుకోలేదని 2015లో అక్కడి మధేశీ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. దాంతో అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని నేపాల్‌కు భారత్ సూచించింది. ఈ నేపథ్యంలో మధేశీ సంఘాలకు మద్దతు తెలుపుతూ, నేపాల్‌ను శిక్షించేందుకే భారత్ నాకాబందీ విధించిందని అక్కడి వారు ఆరోపిస్తారు. కానీ భారత్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది.

'నేపాల్ ప్రజల సమస్యల గురించి నరేంద్ర మోదీ ఒక్కసారి కూడా సోషల్ మీడియాలో పంచుకోరు. భారత ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా క్షేత్ర స్థాయిలో మాత్రం ఎలాంటి ఫలితమూ లేదు.

నా కళ్ల ముందే సుష్మాజీ (సుష్మా స్వరాజ్) చాలా సార్లు అధికారులను ఆదేశించారు. (అజిత్‌) దోవల్ సాబ్ కూడా తరచూ అధికారుల్ని ఆదేశించేవారు. కానీ సాయం అందడానికి చాలా సమయం పట్టేది' అని దీప్ కుమార్ ఉపాధ్యాయ బీబీసీతో చెప్పారు. 2015 నాకాబందీ సమయంలో దీప్‌కుమార్ భారత్‌‌లో నేపాల్ రాయబారిగా ఉండేవారు.

Image copyright Getty Images

'మా ఇంటి ముందు మూడు నాలుగు చెట్లున్నాయి. వాటిని నరికి రెండు మూడు నెలలపాటు వంట చెరకుగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాం. మందులు, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. నాకాబందీవల్ల పేద ప్రజలు చాలా ఇబ్బందిపడ్డారు. కానీ ఏం జరిగినా మంచికేననీ, ఎలాంటి పరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదనీ నిర్ణయించుకున్నాం' అంటారు నేపాల్ మాజీ ఆర్థిక మంత్రి ప్రకాష్ చంద్ర లోహాని.

అప్పట్నుంచీ నేపాల్ ఆలోచన మారిందని, భారత్‌పైన కోపంతో చైనావైపు మొగ్గడం మొదలుపెట్టిందని ప్రకాష్ చంద్ర చెప్పారు. కేవలం భారత్‌పైనే ఆధారపడకూడదనే సెంటిమెంటు బలపడిందని ఆయన అన్నారు.

Image copyright DIPTENDU DUTTA
చిత్రం శీర్షిక 2015 నాకాబందీ సమయంలో భారత్ నుంచి నేపాల్‌కు సరకు రవాణా ఆగిపోయింది

'భారత్ వల్లనే నేపాల్ చైనాకు దగ్గరైంది'

'10-15రోజుల్లో భారత్ ముందు నేపాల్ మోకరిల్లుతుందని భావించారు. కానీ అలా జరగలేదు. ఆ పరిస్థితుల్లో మేం చైనావైపు మొగ్గాల్సి వచ్చింది. మాతో రవాణా ఒప్పందం కోసం చైనా పదేళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ మేం ఒప్పుకోలేదు. చివరికి భారతే మాకు దాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది' అంటారు ప్రకాష్ చంద్ర.

రవాణా ఒప్పందం సాయంతో చైనా మీదుగా ఇతర దేశాలతో వాణిజ్యం నిర్వహించే అవకాశం నేపాల్‌కు దక్కుతుంది. 'నేపాల్ ఇప్పటిదాకా కోల్‌కతా పోర్ట్ నుంచి అందే దిగుమతలపైనే ప్రధాన ఆధారపడుతూ వచ్చింది. కోల్‌కతా పోర్టులో ఏదైనా అనిశ్చితి నెలకొంటే దాని ప్రభావం నేపాల్‌పై నేరుగా పడుతుంది. ఆ పరిస్థితిని భారత్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది' అని ప్రకాష్ చెప్పారు.

చిత్రం శీర్షిక ప్రకాష్ చంద్ర లోహాని

నేపాల్‌లో 70శాతం వాణిజ్య కార్యకలాపాలు భారత్ పైనే ఆధారపడ్డాయి.

అందుకే ఆ నాకాబందీ తరవాత భారత్‌పై నేపాల్ ప్రజల దృక్పథం మారిందని చెబుతారు. మరోపక్క 'అధికారులు మోదీని తప్పుదోవ పట్టిస్తారు. ఆయన సరైన సమాచారం ఇవ్వరు' అని చంద్ర ప్రకాశ్‌తో సహా మరి కొందరు సీనియర్ నేతలు చెబుతారు.

నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ చైనాకు దగ్గరవుతున్నారని భారత మీడియా చాలాసార్లు పేర్కొంటుంది. ఈ విషయం గురించి సీనియర్ పాత్రికేయులు యువరాజ్ ఘిమిరే మాట్లాడుతూ.. ఒకప్పుడు కేపీ శర్మ భారత్‌కు చాలా అనుకూలమనే భావన అతడి సొంత పార్టీలోనే ఉండేదని చెప్పారు.

'‘కేపీ శర్మ పార్టీ మహాకాళీ ప్రాజెక్టు ఒప్పందానికి వ్యతిరేకంగా ఉండేది. కానీ శర్మ మాత్రం భారత్‌కు మద్దతు తెలిపారు. పార్టీలో అతడిని భారత అనుకూలదారుడిగా భావిస్తారు. కానీ నాకాబందీ సమయంలో ప్రజల సెంటిమెంట్లకు మద్దతు తెలిపిన కారణంగా, అప్పట్నుంచీ శర్మపై భారత్‌లో 'భారత వ్యతిరేకి' అన్న ముద్రవేశారు'‘ అంటారు యువరాజ్.

చిత్రం శీర్షిక 'కేపీ శర్మ పార్టీ మహాకాళీ ప్రాజెక్టు ఒప్పందానికి వ్యతిరేకంగా ఉండేది. కానీ శర్మ మాత్రం భారత్‌కు మద్దతు తెలిపారు’- యువరాజ్

1996లో జరిగిన మహాకాళీ ఒప్పందంలో భాగంగా పంచేశ్వర్ ప్రాజెక్టును నిర్మించి దాని ద్వారా ఉత్పత్తయ్యే 6400 మెగావాట్ల విద్యుత్తును రెండు దేశాలూ ఉపయోగించుకోవాలని అంగీకరించాయి. కానీ రెండు దశాబ్దాల తరవాత కూడా అది కార్యరూపం దాల్చలేదు.

'మహాకాళీ ఒప్పందంపై భారత్‌కు ఆసక్తి లేనప్పుడు దానిపైన ఎందుకు సంతకం చేశారు' అని ఆ ఒప్పందంలో భాగం పంచుకున్న నేపాల్ మాజీ ఆర్థిక మంత్రి ప్రకాష్ చంద్ర ప్రశ్నిస్తారు.

చిత్రం శీర్షిక నేపాల్‌లో భారత ప్రాజెక్టులు వేగవంతమయ్యాయంటారు మంజీవ్ సింగ్

'హామీలు ఎన్నడూ నెరవేరవు'

2015లో నేపాల్ రాజధాని కాఠ్మండూలో నేషనల్ ఆర్మ్‌డ్ పొలీస్ ఫోర్స్ అకాడమీ నిర్మించే పనులను చైనా మొదలుపెట్టింది. 2017లో దాన్ని పూర్తి చేసి నేపాల్‌కు అప్పగించింది. భారత్‌ కూడా అలాంటి అకాడమీని నిర్మించి ఇస్తామని గతంలో మాటిచ్చినా, రెండు దశాబ్దాల తరవాత కూడా అది నెరవేరలేదు. స్థానిక పరిస్థితులు కూడా అకాడమీని నిర్మించకపోవడానికి కారణంగా భావిస్తారు.

శ్రీలంక, ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా భారత్ తన మాటను నిలబెట్టుకోవడంలో ఆలస్యం చేస్తుందనే ఫిర్యాదులు అందుతాయి.

ఏప్రిల్‌లో నేపాల్ ప్రధాని కేపీ శర్మ భారత్ వచ్చినప్పుడు ఇక్కడి నేతలకు గతంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.

ఆ వాగ్దానాల గురించి నేపాల్‌లో భారత అంబాసిడర్ మంజీవ్ సింగ్ పూరి మాట్లాడుతూ.. 'నేపాల్ పోలీస్ అకాడమీ కోసం కన్సల్టెంట్లను నియమించాం. త్వరలోనే నేపాల్‌కు డిజైన్లను అందిస్తాం. మిగతా ప్రాజెక్టులు కూడా ముందుకెళ్తున్నాయి. కొన్ని నెలల్లో జయనగర్‌ నుంచి జనక్‌పుర్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ పూర్తవుతుంది. ప్రాజెక్ట్ అరుణ్ 3(900 మెగావాట్ల విద్యత్ ప్రాజెక్టు) ద్వారా ప్రాజెక్టులపై మాటివ్వడమే కాదు అవి పూర్తవుతున్నాయనే సందేశం కూడా అందరికీ చేరాలి' అన్నారు.

నేపాల్‌లో వేల గృహాల నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయనీ, త్వరలోనే అవి లబ్ధిదారులకు అందుతాయని మంజీవ్ తెలిపారు.

'నేపాల్‌లో అన్నీ భారత్ వల్లే జరుగుతున్నాయనే భావన నెలకొంది. కానీ దిల్లీలో కూర్చొని నేపాల్ గురించి ఆలోచించే తీరిక ఎవరికుంది? మోదీ స్వయంగా నేపాల్‌పైన దృష్టి పెట్టడం ఓ మంచి పరిణామం' అని భారత్‌లో నేపాల్ మాజీ రాయబారి దీప్ కుమార్ ఉపాధ్యాయ్ తన అభిప్రాయాన్ని వివరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)