ఇరాన్ డీల్: అమెరికా రద్దు చేయాలంటున్నా యూరప్‌కు ఎందుకింత పట్టుదల?

  • 12 మే 2018
ఇరాన్‌లో ప్రదర్శన Image copyright AFP
చిత్రం శీర్షిక అమెరికా నిర్ణయానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో ప్రదర్శన

ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత యూరప్‌లో దౌత్య కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి.

ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధిస్తానని అమెరికా అంటుండగా, ఈ ఒప్పందాన్ని ఎలాగైనా సరే రద్దు కాకుండా కాపాడాలని యూరప్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇందులో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఎంగెలా మేర్కెల్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరపగా, బ్రిటన్ ప్రధాని టెరీజా మే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో మాట్లాడారు.

అమెరికా ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధిస్తే యూరోప్‌లోని ప్రధాన వ్యాపార సంస్థలు భారీగా నష్టపోతాయంటూ ఫ్రెంచ్ మంత్రులు ధ్వజమెత్తారు.

ట్రంప్ ఈ ఒప్పందాన్ని "భయంకరమైంది" అని అభివర్ణించారన్న విషయం తెలిసిందే.

ఈ ఒప్పందం ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని గానీ, మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని గానీ ఏమీ కుదించలేకపోయిందన్నది ట్రంప్ ఆక్షేపణల్లో ముఖ్యమైంది.

2015 నాటి ఒప్పందంలోంచి ఉపసంహరణ అమెరికా ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఇచ్చిన హామీల్లో ఒకటి. ట్రంప్ తాజా నిర్ణయం ఫలితంగా, ఇరాన్‌పై వచ్చే ఆగస్ట్, నవంబర్ నెలల్లో రెండు విడతలుగా ఆంక్షల్ని మళ్లీ విధిస్తారు.

Image copyright Reuters/AFP

ఒప్పందాన్ని కాపాడాలని యూరోపియన్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?

ఈ ఒప్పందానికి లోబడి, తనపై ఆంక్షల్ని ఎత్తివేసినందుకు బదులుగా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కుదించే చర్యలు చేపట్టింది.

అమెరికా, మూడు యూరోపియన్ యూనియన్ దేశాలు (బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ), రష్యా, చైనాలు నిర్వహించిన చర్చల ఫలితంగా 2015లో ఇరాన్ అణు ఒప్పందం కుదిరింది.

ఇరాన్‌ను అణ్వాయుధాలు తయారు చేయకుండా కట్టడి చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం. అయితే తాము అణ్వాయుధాలేమీ తయారు చేయడం లేదని ఇరాన్ తొలి నుంచీ వాదిస్తోంది.

ఈ ఒప్పందం పూర్తిగా సమగ్రమైందేమీ కానప్పటికీ ఇరాన్‌ను అణ్వాయుధ సంపన్న దేశంగా ఎదగకుండా నిరోధించడానికి ఇదే సరైన మార్గమని అమెరికాయేతర భాగస్వాములంతా భావిస్తున్నారు.

అమెరికా ఆంక్షలు మళ్లీ అమలులోకి వస్తే యూరోపియన్ దేశాలు వందల కోట్ల డాలర్ల వ్యాపారం నష్టపోవాల్సి వస్తుంది.

ఎయిర్‌బస్ అనే యూరోపియన్ విమానాల తయారీ కంపెనీ ఇరాన్‌కు 100 విమానాలు అమ్మేందుకు చేసుకున్న ఒప్పందం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ విమానాల్లో కొన్ని విడి భాగాలు అమెరికాలో తయారవుతాయి.

ఇంధన రంగంలో బడా కంపెనీ అయిన టోటల్, కార్ల తయారీ కంపెనీలైన రెనాల్ట్స్, పాజో వంటి ఫ్రెంచ్ కంపెనీలు ఇరాన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాయి.

మొత్తంగా 2016లో ఇరాన్‌పై ఆంక్షల్ని ఎత్తేసిన తర్వాత ఇరాన్‌కు ఫ్రాన్స్, జర్మనీల ఎగుమతులు విపరీతంగా పెరిగాయి.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మెయిర్

యూరోపియన్లు చేస్తున్న ప్రయత్నాలేంటి?

ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించడం "ఆమోదయోగ్యం కాదు" అని ఫ్రాన్స్ ఖండించింది. యూరప్‌ తన "ఆర్థిక సార్వభౌమత్వాన్ని" కాపాడుకోవాలని ఆర్థిక మంత్రి బ్రూనో లీ మెయిర్ పిలుపునిచ్చారు.

"అమెరికా తీసుకునే నిర్ణయాలకు తలూపే గంగిరెద్దులమా మనం?" అని ఆయన ప్రశ్నించారు.

అమెరికా నిర్ణయానికి ప్రతి చర్యలు చేపట్టే అవకాశాలు కనుగొనాలని లీ మెయిర్ యూరోపియన్ కమిషన్‌ను కోరారు.

జర్మనీ ఆర్థిక మంత్రి కూడా ఫ్రాన్స్‌తో పాటు గొంతు కలుపుతూ, ఆంక్షల నుంచి యూరోపియన్ కంపెనీలకు మినహాయింపునివ్వాలని అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ నుచిన్‌ను కోరారు.

బ్రిటిష్ ప్రధాని టెరీజా మే టెలిఫోన్ ద్వారా ట్రంప్‌తో సంభాషించారు. ఈ ఒప్పందం పట్ల యూరప్ దేశాలన్నీ దృఢంగా ఉన్నాయని ఆమె ఆయనకు స్పష్టం చేసినట్టుగా ప్రధాని కార్యాలయం తెలిపింది.

ఆంక్షల మూలంగా ఇరాన్‌తో వ్యాపారం నెరపుతున్న విదేశీ కంపెనీలపై పడే ప్రభావాల గురించి చర్చించడం అవసరమని ఉభయ నేతలు అంగీకారానికి వచ్చారు.

Image copyright Reuters

దౌత్యరంగంలో ఇంకా ఏం జరుగుతోంది?

జర్మనీ ఛాన్సలర్ మేర్కెల్, టర్కీ అధ్యక్షుడు రెచెప్ తైయప్ ఎర్దొవాన్‌లతో రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్ పుతిన్ చర్చలు జరిపినట్టు క్రెమ్లిన్ తెలిపింది.

ఈ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఇరాన్‌తో చర్చలు జరపాలనీ, దీనిని ఏకపక్షంగా రద్దు చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని మేర్కెల్ ఆయనతో అన్నారు.

ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావేద్ జారిఫ్ ఈ వారంతంలో చైనా, రష్యా, బెల్జియం దేశాల పర్యటనకు బయలుదేరుతున్నారు.

మంగళవారం నాడు జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం