ఐఎస్ ఓటమి తర్వాత ఇరాక్‌లో తొలిసారి ఎన్నికలు

  • 12 మే 2018
ఇరాక్ ఎన్నికలు Image copyright EPA

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) పతనం తర్వాత ఇరాక్‌లో తొలిసారిగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశవాసులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)పై విజయం సాధించామని ఇరాక్ ప్రభుత్వం నిరుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తొలిసారి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ఇవే.

దేశంలోని మొత్తం 329 స్థానాలకుగాను దాదాపు 7 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఇస్లామిక్ స్టేట్‌ సేనలతో నాలుగేళ్లపాటు సాగిన పోరు కారణంగా ఇరాక్ తీవ్రంగా దెబ్బతింది. పునర్ నిర్మాణం కోసం ఇరాక్ ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతోందని బీబీబీ ప్రతినిధి తెలిపారు.

'ఎన్నికల్లో ఎవరు గెలిచినా మతతత్వం, వేర్పాటువాద ఉద్రిక్తతలు, ఐక్యతను దెబ్బతీసే చర్యల నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది' అని ఆయన చెప్పారు.

అంతర్జాతీయ కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలకే దేశ వ్యాప్తంగా ఓటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.

ఎక్కువగా షియా, సున్నీ అభ్యర్థులుండే అభ్యర్థుల జాబితాలోంచి ఇరాకీలు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. కుర్ద్ జాతీయులకు సొంతంగా అభ్యర్థుల జాబితాలున్నాయి.

ఐఎస్ సేనలపై విజయం సాధించిన ఘనత షియా నేతృత్వంలోని ప్రభుత్వానికి దక్కింది. వీరి పాలనలో దేశవ్యాప్తంగా భద్రత పరిస్థితి బాగా మెరుగుపడింది.

అయితే, అవినీతి పెరగడం, చితికిపోయిన ఆర్థికవ్యవస్థల మూలంగా చాలా మంది ఇరాకీలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని బీబీసీ ప్రతినిధి మార్టిన్ పాటియన్స్ పేర్కొన్నారు.

ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ఎన్నికలు జరుగుతుండడం గమనార్హం.

అమెరికా, ఇరాన్ మధ్య పోరులో మరోసారి తమ దేశం చితికిపోతుందేమోనని కొంతమంది ఇరాకీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని బీబీసీ ప్రతినిధి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)