అంగారకుడిపైకి హెలికాప్టర్ పంపనున్న నాసా

  • 13 మే 2018
కంప్యూటర్ సాయంతో నాసా రూపొందించిన హెలికాప్టర్ డిజైన్‌ Image copyright NASA/JPL
చిత్రం శీర్షిక కంప్యూటర్ సాయంతో నాసా రూపొందించిన హెలికాప్టర్ డిజైన్‌

అంగారకుడిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' ఒక బుల్లి హెలికాప్టర్‌ను పంపనుంది. దీని బరువు కేవలం 1.8 కేజీలు.

2020 జులైలో అంగారకుడిపైకి ప్రయోగించే రోవర్‌ వెంట ఈ హెలికాప్టర్‌ను నాసా పంపించనుంది. రోవర్ 2021 ఫిబ్రవరిలో అరుణ గ్రహానికి చేరనుంది.

ఈ హెలికాప్టర్ పరిమాణాన్ని ఒక సాఫ్ట్‌బాల్ పరిమాణానికి తగ్గించేందుకు, బరువును 1.8 కేజీలకు తీసుకొచ్చేందుకు నిపుణులు నాలుగేళ్లకు పైగా కృషి చేశారు.

అరుణ గ్రహ వాతావరణం భూమితో పోలిస్తే వంద రెట్లు పలుచగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అంగారకుడి వాతావరణంలో ఎగిరేందుకు అనువుగా ఈ హెలికాప్టర్‌ను డిజైన్ చేశారు.

ఈ హెలికాప్టర్‌కు రెండు బ్లేడ్లు ఉంటాయి. ఇవి నిమిషానికి దాదాపు మూడు వేల సార్లు తిరుగుతాయి. భూమిపై వాడే సాధారణ హెలికాప్టర్ బ్లేడ్లు తిరిగే వేగంతో పోలిస్తే ఇది సుమారు వంద రెట్లు ఎక్కువని నాసా తెలిపింది.

''మరో గ్రహం గగనతలంలో ఒక హెలికాప్టర్ ఎగరడమనే ఆలోచనే చాలా ఉద్విగ్నంగా అనిపిస్తోంది. భవిష్యత్తులో అంగారకుడికి సంబంధించిన శాస్త్ర పరిశోధనలు, అన్వేషణ యాత్రలకు ఈ ప్రయోగం ఎంతగానో దోహదం చేస్తుంది'' అని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టీన్ తెలిపారు.

Image copyright NASA

ఈ హెలికాప్టర్ ఎగిరే ప్రాంతం భూమికి దాదాపు మూడున్నర కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

''ఇది భూమికి కొన్ని కాంతి నిమిషాల దూరంలో ఉంటుంది. రియల్ టైమ్‌లో అక్కడికి రిమోట్ కంట్రోల్‌తో సంకేతాలు పంపడం సాధ్యం కాదు. ఈ హెలికాప్టర్ దానంతటదే పనిచేస్తుంది'' అని నాసాలోని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ప్రాజెక్టు మేనేజర్ మిమీ ఆంగ్ తెలిపారు.

ఈ హెలికాప్టర్ డ్రోన్ కాదు. ఇందులో లీథియం-అయాన్ బ్యాటరీలు ఉంటాయి. సోలార్ సెల్స్‌తో ఇవి ఛార్జ్ అవుతాయి.

ప్రయోజనం ఏమిటి?

ఈ హెలికాప్టర్ అనుకున్నట్లు పనిచేయకపోయినా, మార్స్ 2020 ప్రయోగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ ఉండదని నాసా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆశిస్తున్నట్లు పనిచేస్తే మాత్రం భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది.

గ్రహం ఉపరితలంపై తిరిగే ఇతర వాహనాలు చేరుకోలేని ప్రదేశాలకు కూడా ఈ హెలికాప్టర్లు చేరుకోగలవని నాసా చెప్పింది. ఉపరితలానికి దగ్గరగా వెళ్లే వాహనాలుగా, ఏరోవెహికల్స్‌గా ఇవి అక్కరకొస్తాయని వివరించింది.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న అంగారక వాహనాలు చక్రాల ఆధారంగా నడిచేవి. అక్కడ దారిలో అడ్డంకులను అధిగమించుకుంటూ ఇవి ముందుకు సాగాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పెద్ద అవరోధాలు ఎదురైతే ముందుకు వెళ్లడం కష్టమవుతుంటుంది. ఇవి సాధారణంగా అడ్డంకులు ఎక్కువగా లేని విశాల ప్రదేశాల్లో సంచరిస్తుంటాయి.

2009లో 'స్పిరిట్' అనే ఒక రోవర్ ఇసుకలో ఇరుక్కుపోయింది. తర్వాత ఇంధనం అయిపోయి, షట్‌డౌన్ అయ్యింది. హెలికాప్టర్ ప్రయోగం విజయవంతమైతే, ఇలాంటి పరిస్థితులను అధిగమించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)