అణు కేంద్రాన్ని ఈ నెలలోనే మూసేయనున్న ఉత్తర కొరియా!

  • 12 మే 2018
అణు పరీక్షల కేంద్రం Image copyright Reuters

అణు పరీక్షల కేంద్రం మూసివేత ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభిస్తామని ఉత్తర కొరియా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌ల భేటీకి ముందే ఈ ప్రక్రియ మొదలుపెడతామని వెల్లడించింది.

మే 23-25 మధ్యలో ఈ ప్రక్రియ ప్రారంభించడానికి సాంకేతికపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఉత్తర కొరియా న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ ప్రకటించింది.

సెప్టెంబర్‌లో ఈ అణు కేంద్రాన్ని పాక్షికంగా మూసేస్తామని గతంలో శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ట్రంప్, కిమ్ భేటీకి మూడు వారాల ముందు ఈ ప్రక్రియ మొదలుకానుంది.

ఏప్రిల్‌లో అణు పరీక్షల కేంద్రాన్ని మూసేస్తామని కిమ్ చెప్పినట్లు దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు.

అమెరికా, దక్షిణ కొరియా అణు శాస్త్రవేత్తల సమక్షంలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు కిమ్ అంగీకరించినట్లు కూడా వారు తెలిపారు.

ఉభయ కొరియాల అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్, మూన్‌ల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

తమ ప్రాంతంలో అణు ఆయుధాలకు స్వస్తి పలికేందుకు వీలుగా వీరిద్దరూ ఒప్పందంపై సంతకం చేశారు.

Image copyright RODONG SINMUN

అణు పరీక్షల కేంద్రం ఎక్కడుంది?

ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలో పర్వతాల మధ్య 'ఫంగీ రీ' అణు పరీక్షల కేంద్రం ఉంది.

ఉత్తర కొరియా అణు పరిశోధనలకు అత్యంత ముఖ్యమైన కేంద్రం ఇదే.

'ఫంగీ రీ' అణు కేంద్రం సమీపంలోని మాంటాప్‌ పర్వతం కింద తవ్విన సొరంగాల్లో అణు పరీక్షలు నిర్వహించేవారు.

2006 నుంచి ఇక్కడ ఆరు అణు పరీక్షలు జరిగాయి.

2017 సెప్టెంబర్‌లో చివరి అణు పరీక్ష నిర్వహించినప్పుడు, భూప్రకంపనలు వచ్చాయి.

ఈ ప్రభావంతో మాంటాప్‌ పర్వతం లోపలి భాగం కొద్దిగా కూలిపోయినట్లు భూకంప శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఈ ప్రదేశంలో పరికరాల తరలింపు ఆధారంగా ఈ విషయాలను అంచనా వేస్తున్నారు.


మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionచూడండి.. కిమ్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన చరిత్రాత్మక ఘట్టం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)