ఫ్రాన్స్ : 'ఉగ్రవాది' కత్తితో చేసిన దాడిలో ఒకరి మృతి

  • 13 మే 2018
ఘటనా స్థలంలో ఫ్రెంచ్ పోలీస్ Image copyright EPA

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఒపెరా జిల్లాలో బాగా రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక వ్యక్తి కత్తితో చెలరేగిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

మృతుడి వయసు 29 ఏళ్లు. కాగా, గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసులు జరిపిన ప్రతిచర్యలో దాడికి పాల్పడ్డ వ్యక్తి మరణించాడు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి రష్యాలోని చెచన్యా రిపబ్లిక్‌కు చెందిన వాడనీ, అతడు 1997లో జన్మించాడని పారిస్‌లోని న్యాయశాఖ వర్గాలు తెలిపాయి.

దాడి చేసిన వ్యక్తి 'అల్లా హో అక్బర్' అని అరవడం తాము విన్నామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ వ్యక్తిపై పోలీసులు రెండు సార్లు కాల్చి హతమార్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని 'ఫ్రాన్స్ 24' తెలిపింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ ఘటనను ఖండించారు. "ఫ్రాన్స్‌లో ఈరోజు మళ్లీ రక్తం చిందింది. మన స్వాతంత్ర్యాన్ని హరించాలనుకుంటున్న శత్రువులకు ఒక్క అంగుళం జాగాను కూడా ఇవ్వబోం" అంటూ ఆయన ట్వీట్ చేశారు.

దాడి ఎలా జరిగింది?

చేతిలో కత్తి పట్టుకున్న వ్యక్తి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి ఒంటిగంటకు) రోడ్డుపై ఉన్న జనాన్ని విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు.

అక్కడున్న కొన్ని రెస్టారెంట్లలోకి, బార్లలోకి చొరబడడానికి కూడా అతడు ప్రయత్నించాడు. అయితే అందులో ఉన్న వారు తలుపులు మూసేసి అతడిని అడ్డుకున్నారు.

ఆ వ్యక్తిని అడ్డుకోవడం కోసం పోలీసులు మొదట స్టన్-గన్‌ను ప్రయోగించి చూశారు. అయినా ఫలితం లేకపోవడంతో తుపాకీతో కాల్చివేశారు. ఆ వ్యక్తిని ఇంకా గుర్తించాల్సి ఉంది.

ఈ ఘటన మధ్య పారిస్‌లోని ఒపెరా జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడి నైట్ లైఫ్‌కు చాలా పేరుంది.

ఘటన తర్వాత అక్కడ గందరగోళం నెలకొందని స్థానికులు చెప్పారు. రోడ్లపై ఉన్న జనాలు రక్షణ కోసం రెస్టారెంట్లలోకి, కెఫేలలోకి దూరిపోయారు.

Image copyright AFP

దర్యాప్తు

ఈ ఘటనపై పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి చెందిన ఉగ్రవాద-వ్యతిరేక విభాగం దర్యాప్తు ప్రారంభించింది.

ఈ దాడి జరగగానే పోలీసులు స్పందించిన తీరును ఫ్రాన్స్ హోంశాఖ మంత్రి జేరా కోలోన్ ప్రశంసించారు. బాధితుల పట్ల ఆయన సానుభూతి ప్రకటించారు.

మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి పుకార్లూ వ్యాపింపజేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. "విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోండి" అని పారిస్ పోలీసు విభాగం ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)