ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?

ఇంధనం

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియాలో పెట్రోలు, డీజిల్, వైమానిక ఇంధనం నిల్వలు అయిపోతున్నాయా? దేశం ఇంధన అభద్రత ముప్పును ఎదుర్కొంటోందా?

దేశంలోని ఇంధన నిల్వలు కొన్ని వారాల వరకే వస్తాయని ఇటీవల నిపుణులు హెచ్చరించారు. ఇంధన భద్రతపై సమీక్ష జరపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

దేశాలు 90 రోజులకు అవసరమైన ఇంధన నిల్వలు కలిగి ఉండాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ సూచిస్తోంది.

ఆస్ట్రేలియాలో 2012 నుంచి ఎన్నడూ 90 రోజులకు సరిపడా స్థాయిలో నిల్వలు లేవు.

అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరిలో 50 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఆస్ట్రేలియా వద్ద ఉన్నాయి.

ప్రస్తుత నిల్వల ప్రకారం పెట్రోలు 23 రోజులకు, డీజిల్ 17 రోజులకు, వైమానిక(ఏవియేషన్) ఇంధనం 20 రోజులకు మాత్రమే సరిపోతాయని ఆస్ట్రేలియా పెట్రోలియం గణాంకాలు చెబుతున్నాయి.

ఆస్ట్రేలియా తనకు అవసరమైన ఇంధనంలో 90 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.

మధ్యప్రాచ్యంలో ముడిచమురును కొని, దక్షిణ కొరియా, చైనా, సింగపూర్‌లలో ఉన్న చమురుశుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి, పెట్రోలు, డీజిల్, వైమానిక ఇంధనం రూపాల్లో ఆస్ట్రేలియాకు తరలిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఆస్ట్రేలియాలో చమురు ఉత్పత్తి పడిపోయింది.

ఇంధన భద్రతపై సమీక్ష వివేకవంతమైన పని అని, ఈ చర్యను బట్టి దేశానికి ఇంధన భద్రత లేదని భావించకూడదని ఇంధనశాఖ మంత్రి జోస్ ఫ్రిడెన్‌బర్గ్ వ్యాఖ్యానించారు.

ఇంధన దిగుమతులపై దేశం ఆధారపడటం గత పదేళ్లలో పెరిగిందని ఆయన చెప్పారు. మూడు స్వదేశీ చమురు శుద్ధి కర్మాగారాలు మూతపడటం, దేశంలో చమురు ఉత్పత్తి మూడింట ఒక వంతు తగ్గిపోవడం దీనికి ముఖ్య కారణాలని తెలిపారు.

అంతర్జాతీయ సరఫరాల్లో హెచ్చుతగ్గులు వస్తే...?

అంతర్జాతీయంగా చమురు సరఫరాల్లో ఒడిదొడుకులు ఏర్పడితే రానున్న రోజుల్లో దేశానికి ఇబ్బందులు తప్పవని ఆస్ట్రేలియా వ్యూహకర్త, వైమానికదళ మాజీ ఉన్నతాధికారి జాన్ బ్లాక్‌బర్న్ 'ద ఆస్ట్రేలియన్' పత్రికతో చెప్పారు. వీటిని అధిగమించేందుకు ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ లేదన్నారు.

సిరియా సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చడం లాంటి పరిణామాలు సంభవిస్తే చమురు సరఫరా మందగిస్తుంది. అదే జరిగితే ఆస్ట్రేలియాకు ఇబ్బందులు పెరుగుతాయి.

నిల్వలు మరీ తగ్గిపోతే ఆస్ట్రేలియా ఇతర దేశాల నుంచి ఇంధనం తీసుకొంటుందని సిడ్నీలోని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లో 'రిస్క్ అండ్ రెజిలియన్స్' విభాగం అధినేత పాల్ బార్స్ చెప్పారు.

ఇంధన భద్రత గురించి పట్టించుకోని దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటని ఇదే సంస్థలో రక్షణ వ్యూహాలు, సామర్థ్యాల సీనియర్ విశ్లేషకుడైన మాల్కమ్ డేవిస్ న్యూస్.కామ్.ఏయూ వెబ్‌సైట్‌తో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఆందోళన వద్దన్న ప్రభుత్వం

ఇంధన నిల్వలు తగినన్ని లేకపోవడంపై ప్రభుత్వం స్పందిస్తూ- దీని గురించి ప్రజలు ఆందోళన చెందక్కర్లేదని చెప్పింది.

ఇంధన సరఫరాకు చాలా వనరులు ఉన్నాయని, అత్యవసర పరిస్థితులు ఏర్పడబోవని కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీలోని ఎనర్జీ ఛేంజ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన జేమ్స్ ప్రెస్ట్ అభిప్రాయపడ్డారు.

ఇంధన భద్రతపై సమీక్ష అవసరమేనని, అయితే పరిస్థితిని చక్కదిద్దడానికి ఇదొక్క చర్యే సరిపోదని, ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

సిరియా సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చకపోతే ఆస్ట్రేలియాలో ఇంధన నిల్వలు ఖాళీ అయ్యే పరిస్థితులు ఏర్పడకపోచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంధన కొరత ఏర్పడితే మాత్రం దేశంలో ప్రజల జేబుకు చిల్లు పడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)