ఇండోనేసియాలో మళ్లీ ఆత్మాహుతి దాడులు

  • 14 మే 2018
పోలీసుల కార్యలాయం వద్ద బాంబు పేలుడు Image copyright Reuters

ఇండోనేసియాలో రెండో అతి పెద్ద నగరం సురబాయాలో మళ్లీ ఆత్మాహుతి దాడులు జరిగాయి. రెండు మోటారు సైకిళ్లపై వచ్చినవారు పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడులు చేశారని స్థానికులు తెలిపారు.

ఈ దాడుల్లో పోలీసులు గాయపడ్డారని వివరించారు.

ఆదివారం ఇక్కడ మూడు చర్చిలలో జరిగిన పేలుళ్లలో 13 మంది మరణించారు.

ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లకు తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ వెల్లడించింది.

‘ఈ బాంబు దాడులకు పాల్పడిన ఆరుగురి కుటుంబం ఇటీవలే సిరియా నుంచి ఇక్కడకు వచ్చారు..’ అని స్థానిక పోలీసులు తెలిపారు.

తాజా దాడులకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ‘‘పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన దాడులకు సంబంధించి బాధితుల వివరాలు ఇంకా తెలియలేదు. వారి వివరాలను సేకరిస్తున్నాం..’’ అని వివరించారు.

అయితే ఆదివారం జరిగిన దాడులకు తాజా దాడులకు సంబంధం ఉందా? అనేదీ తెలియాల్సి ఉంది.

ఆదివారం నిమిషాల వ్యవధిలో మూడో చోట్ల ఒకదాని వెంట మరొక పేలుడు జరిగింది. ఈ ఆత్మాహుతి దాడుల్లో చాలా మంది గాయపడ్డారు.

ఒక చర్చి ప్రవేశద్వారం వద్ద విధ్వంసం దృశ్యాలు టీవీలో కనిపించాయి.

ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే ఇండోనేసియాలో గత కొన్ని నెలల్లో ఇస్లామిస్ట్ మిలిటెన్సీ మళ్లీ తీవ్రరూపం దాల్చింది.

ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్న జెమాహ్ అన్షరుత్ దౌలాహ్ అనే మిలిటెంట్ గ్రూపు ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చని ఇండోనేసియా ఇంటలిజెన్స్ ఏజెన్సీ అంతకు ముందు భావించింది.

కొద్ది రోజుల క్రితం, దేశ రాజధాని జకార్తా శివార్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ఓ జైలు వద్ద మిలిటెంట్ ఇస్లామిస్ట్ ఖైదీలతో జరిగిన సాయుధ ఘర్షణలో ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక ఈ దాడులు నిమిషాల వ్యవధిలో జరిగాయి.

‘ఒక కుటుంబమే చేసింది’ - పోలీసులు

మూడు చర్చిల్లో దాడుల వెనుక ఉన్నది ఒక కుటుంబ సభ్యులేనని పోలీసులు అంటున్నారు.

ఒక చర్చిలో ఒక తల్లి, తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మాహుతి దాడికి పాల్పడగా, మిగతా రెండు చర్చిల్లో తండ్రి, ఇద్దరు కుమారులు దాడులకు దిగారని పోలీసు చీఫ్ టిటో కర్ణవీయన్ తెలిపారు.

ఇండోనేసియాలో 2005 తర్వాత జరిగిన దారుణమైన బాంబుదాడులు ఇవే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)