జెరూసలెం.. ఎందుకంత పవిత్రం? ఎందుకంత వివాదాస్పదం?

  • 15 మే 2018
జెరూసలెం Image copyright Getty Images

జెరూసలెంలో అమెరికా తన కొత్త ఎంబసీని సోమవారంనాడు ప్రారంభించింది. ఆ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జరెడ్ కుష్నర్ హాజరయ్యారు.

టెల్ అవీవ్ నుంచి దౌత్య కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమర్థించారు. అన్ని దేశాలూ అమెరికా దారిలోనే నడవాలని కోరారు.

పాలస్తీనాకు మాత్రం ఈ చర్య రుచించలేదు. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు ట్రంప్ గతంలో ప్రకటించినప్పటి నుంచి ఈ వివాదం ముదురుతూ వస్తోంది.

ప్రస్తుతం జెరూసలెంలోని యూఎస్ కాన్సులేట్ భవనంలోనే అమెరికా తన కొత్త దౌత్యకార్యాలయాన్ని ప్రారంభించింది. భవిష్యత్తులో అక్కడే మరో పెద్ద భవనాన్ని నిర్మించి అందులోకి ఎంబసీని మారుస్తుంది.

ఈ నేపథ్యంలో అమెరికా కొత్త దౌత్య కార్యాలయ ప్రారంభోత్సవం ఆందోళనలకు దారితీసింది. పాలస్తీనీయులు అమెరికా చర్యపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో ఇజ్రాయెల్ సైనికుల చేతిలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవాంకా Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇవాంకా ట్రంప్ జెరూసలెంలో అమెరికా కొత్త దౌత్యకార్యాలయాన్ని ప్రారంభించారు

ఎందుకంత వివాదాస్పదం?

ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణలకు జెరూసలెం కేంద్ర బింధువు.

జెరూసలెం తూర్పు భాగం తమ అధీనంలో ఉందని పాలస్తీనా చెబుతోంది. కానీ మొత్తం నగరంపై పట్టుకోసం ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తం జెరూసలెంపై ఇజ్రాయెల్ పాలనకు అమెరికా మద్దతిచ్చినట్లేనని పాలస్తీనా అంటోంది.

ఈ నిర్ణయాన్ని శతాబ్దానికే మాయని మచ్చగా పాలస్తీనా అధ్యక్షుడు మహ్మౌద్ అబ్బాస్ అభివర్ణించారు. ఇకపై ఇజ్రాయెల్-పాలస్తీనా శాంతి చర్చల్లో అమెరికా ఎలాంటి పాత్రా పోషించబోదనీ, ఆ దేశాన్ని తటస్థ మధ్యవర్తిగా భావించలేమనీ ఆయన పేర్కొన్నారు.

యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా ఎంబసీ తరలింపును వ్యతిరేకించింది.

మరోపక్క ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెలీ యూదులు కొనియాడుతున్నారు.

1967 మిడిల్ ఈస్ట్ యుద్ధం జరిగినప్పటి నుంచి తూర్పు జెరూసలెంను ఇజ్రాయెల్ ఆక్రమించింది. 2017 వరకూ మరే దేశం కూడా జెరూసలెంపై ఇజ్రాయెల్ పూర్తి సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేదు. గత డిసెంబరులో జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాకే పరిస్థితి మారింది.

గాజాలో ఇప్పటికీ అమెరికా ఎంబసీ తరలింపుపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

జెరూసలెం Image copyright Getty Images

జెరూసలెం.. ఎందుకంత పవిత్రం?

మత పరంగానూ జెరూసలెంకు చాలా ప్రాధాన్యముంది. క్రైస్తవులు, ముస్లింలు, యూదులు.. మూడు మతాలవారూ జెరూసలెంను పవిత్రంగా భావిస్తారు. ఈ మూడు మతాలకూ జెరూసలెంతో వందల ఏళ్ల చరిత్రతో పాటు వివాదాలు పెనవేసుకొని ఉన్నాయి.

ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నగరాల్లో జెరూసలెం ఒకటి. ఎన్నోసార్లు ఆ నగరాన్ని చాలామంది చేజిక్కించుకున్నారు. నాశనం చేశారు. మళ్లీ పునాదుల నుంచి నిర్మించారు.

జెరూసలెంలో ముస్లింలు, క్రైస్తవులు, యూదులతో పాటు అర్మేనియన్లకు సైతం అత్యంత పవిత్రమైన ప్రార్థనా మందిరాలున్నాయి.

జెరూసలెంలోని పాత నగరాన్ని(ఓల్డ్ సిటీ) నాలుగు భాగాలుగా విభజించారు. వాటిలో ఈ నాలుగు వర్గాలకు చెందిన ప్రజలు ఎవరి భాగంలో వారు నివశిస్తారు.

అర్మేనియన్లు కూడా క్రైస్తవుల్లో భాగమే. అందుకే క్రైస్తవులు రెండు, ముస్లింలు, యూదులు చెరో భాగం పంచుకున్నారు. భారీ గోడ ఈ భాగాలను వేరు చేస్తోంది.

చర్చి Image copyright Getty Images

చర్చి

జెరూసలెంలోని క్రైస్తవుల భాగంలో ‘చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్’ నెలకొని ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా దీనికి చాలా ప్రాధాన్యమిస్తారు. క్రీస్తు కథలో ఎంతో ప్రాధాన్యమున్న శిలువ, మరణం, పునరుత్థానం తదితర ఘట్టాలు చోటుచేసుకునట్లు భావించే స్థలంలోనే ఈ చర్చిని నిర్మించారు.

ఈ చర్చిలోనే క్రీస్తు సమాధి కూడా ఉందని చాలామంది క్రైస్తవులు నమ్ముతారు. గ్రీక్ ఆర్థడాక్స్ పాట్రియార్కెట్, రోమన్ కాథొలిక్ చర్చి, సిరియన్ ఆర్థడాక్స్ చర్చి మొదలైన కొన్ని ప్రధాన చర్చిలకు చెందిన ప్రతినిధులు సంయుక్తంగా ఈ చర్చిని నిర్వహిస్తున్నారు.

డోమ్ ఆఫ్ ది రాక్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేశారని ముస్లింలు విశ్వసిస్తారు

మసీదు

పాత నగరంలోని నాలుగు భాగాల్లో పెద్దది ముస్లిం భాగం. ఇందులో అల్-అక్సా మసీదుతో పాటు ముస్లింలకు ఎంతో పవిత్రమైన డోమ్ ఆఫ్ ది రాక్ కూడా ఉంది.

మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేశారని ముస్లింలు విశ్వసిస్తారు. ఆ మసీదుకు కొద్ది దూరంలోనే ‘డోమ్ ఆఫ్ ది రాక్’ కూడా కనిపిస్తుంది. అక్కడి నుంచే మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి పయనమయ్యారని భావిస్తారు.

సాధారణంగా ఏడాది పొడవునా ముస్లింలు ఈ మసీదును సందర్శిస్తారు. రంజాన్ మాసంలో శుక్రవారాలు వేలాదిమంది ముస్లింలు ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తారు.

వెయిలింగ్ వాల్

యూదులు అత్యంత పవిత్రంగా భావించే క్షేత్రం కూడా ఈ పాత నగరంలో ఓ భాగంగా ఉంది. అక్కడున్న వెయిలింగ్ వాల్ (వెస్టన్ వాల్) దగ్గరే యూదులు ప్రార్థనలు నిర్వహిస్తారు.

నిజానికి ఆ గోడకు అవతలి వైపున యూదులకు అత్యంత పవిత్ర స్థలం ఉంది. కానీ అక్కడికి వెళ్లేందుకు ఉన్న ఆంక్షల కారణంగా యూదులు ఈ గోడ దగ్గరే ప్రార్థనలు చేస్తారు.

దేవుడు ప్రపంచ సృష్టి కోసం మొట్టమొదటి పునాది రాయిని ఇక్కడే వేశాడని యూదులు విశ్వసిస్తారు. ‘డోమ్ ఆఫ్ ది రాక్’నే వాళ్లు తమ అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ గోడకు కొద్ది దూరంలోనే ఆ కట్టడం ఉన్నా, ఇప్పుడది యూదుల అధీనంలో లేదు.

ఏటా ప్రపంచ నలుమూలల నుంచీ వచ్చే లక్షలాది యూదులు ఈ గోడ దగ్గరే ప్రార్థనలు నిర్వహించి తమ వారసత్వ మూలాలను గుర్తు చేసుకుంటారు.

వెయిల్డ్ వాల్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక వెయిలింగ్ వాల్.. యూదులకు అత్యంత పవిత్రం

ఇలా మత పరంగా, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న జెరూసలెం పవిత్రతతో పాటు వివాదాలకూ కేంద్రంగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)