జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి

  • 15 మే 2018
జెరూసలెం Image copyright EPA

జెరూసలెంలో అమెరికా దౌత్య కార్యాలయం ప్రారంభం సందర్భంగా గాజాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇజ్రాయెల్ సైనికులు జరిపిన కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. మరో 2,700 మందికి పైగా గాయపడ్డారు.

2014 గాజా యుద్ధం తర్వాత అత్యంత హింసాత్మక రోజు ఇదని పాలస్తీనా అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దీనిపై స్పందిస్తూ ‘ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని చూస్తున్న హమాస్ నుంచి ఆత్మరక్షణ కోసమే మా సైన్యం దాడులు చేస్తోంది’ అన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: అమెరికా ఎంబసీ సంబురాలు.. గాజాలో కాల్పుల్లో మరణాలు

జెరూసలెంలో సోమవారం అమెరికా దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పాలస్తీనీయులు నిరసన ప్రదర్శనకు దిగటంతో తాజా ఘర్షణలు జరిగాయి.

ఇది జెరూసలెం నగరం మొత్తంపై ఇజ్రాయెల్ పాలనకు అమెరికా మద్దతు ఇవ్వడమేనని పాలస్తీనీయులు భావిస్తున్నారు. జెరూసలెం తూర్పు భాగం తమదని పాలస్తీనీయులు వాదిస్తున్నారు.

అయితే.. జెరూసలెంలో రాయబార కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. ’’ఇజ్రాయెల్ తన రాజధానిని నిర్ణయించుకునే హక్కున్న ఒక సార్వభౌమ దేశం. కానీ దీనిని గుర్తించటంలో మనం చాలా ఏళ్లు విఫలమయ్యాం’’ అని వ్యాఖ్యానించారు.

‘‘శాశ్వత శాంతి ఒప్పందానికి సహకరించటానికి అమెరికా కట్టుబడి ఉందని’’ కూడా ఆయన పేర్కొన్నారు.

జెరూసలెంలో అమెరికా దౌత్యకార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త సహా ఉన్నత స్థాయి అమెరికన్ అధికారులు పాల్గొన్నారు.

Image copyright Reuters

సరిహద్దు వద్ద ఏం జరిగింది?

గాజాలో అధికారంలో ఉన్న హమాస్ ఆధ్వర్యంలో గత ఆరు వారాలుగా 'గ్రేట్ మార్చ్ ఆఫ్ రిటర్న్' నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

పాలస్తీనియన్లు రాళ్లు రువ్వగా ఇజ్రాయెల్ సైన్యం స్నైపర్లను ఉపయోగించి కాల్పులు జరిపింది. టైర్లు దహనం చేయటంతో నల్లటి పొగ ఆవరించింది.

సోమవారం జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన వారిలో చిన్నారులు కూడా ఉన్నాడని గాజా ఇస్లామిక్ పాలక సంస్థ హమాస్ నిర్వహణలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

అయితే నిరసనకారులు ఇజ్రాయెల్ సరిహద్దుగా ఉన్న కంచెను దాటడానికి ప్రయత్నిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

పాలస్తీనియన్లు 40,000 మంది.. గాజా స్ట్రిప్ భద్రతా కంచె వద్ద 13 చోట్ల ‘హింసాత్మక అల్లర్ల’లో పాల్గొన్నారని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది.

రఫాలో కంచె వద్ద బాంబులు అమర్చటానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను తాము చంపినట్లు పేర్కొంది.

తమ బలగాలపై కాల్పులు జరిగిన తర్వాత జబాలియా ప్రాంతంలోని హమాస్ సైనిక పోస్టులు లక్ష్యంగా వైమానిక, యుద్ధ ట్యాంకులతో దాడులు జరిపినట్లు తెలిపింది.

కొత్త రాయబార కార్యాలయం వెలుపల పాలస్తీనియన్లు పాలస్తీనా పతాకాలు నిరసనకు దిగటంతో.. వారికి పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. పలువురు ఆందోళనకారులను నిర్బంధించారు.

ఈయూ విదేశాంగ విధానం చీఫ్ ఫెడెరికా మొఘెరిని ‘‘పూర్తి సంయమనం’’ పాటించాలని పిలుపునిచ్చారు.

Image copyright AFP

గాజా నిరసనలకు కారణం ఏమిటి?

1948 మే 14న ఇజ్రాయెల్ రాజ్య స్థాపన జరిగినపుడు వేలాది మంది పాలస్తీనియన్లు ఇళ్లు వదిలి పారిపోవటమో నిర్వాసితులు కావటమో జరిగింది. ఆ పరిణామాన్ని పాలస్తీనియన్లు ‘నక్బా’గా వ్యవహరిస్తూ ఏటా స్మారక నిరసనలు చేపడుతుంటారు. ఈ ఏడాది కూడా వారం రోజులుగా ఆందోళనలు చేపట్టారు.

ఈ నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు.

అధికారిక నక్బా స్మారక కార్యక్రమం మంగళవారం జరుగనుండటంతో ఈ ఆందోళనలను ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్‌తో ఘర్షణ పడుతున్న హమాస్ ప్రకటించింది.

ఇజ్రాయెల్‌గా మారిన ప్రాంతంలోని తమ పూర్వపు నివాసాలకు తిరిగి వెళ్లే హక్కు తమకు ఉందని పాలస్తీనియన్లు ఉద్ఘాటిస్తున్న అంశంపైకి ప్రపంచ దృష్టిని ఆకర్షించాలన్నది తమ లక్ష్యమని ఆ సంస్థ చెప్తోంది.

‘‘ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. మేం ఆ కంచెను దాటి ఇజ్రాయెల్‌కు, ప్రపంచానికి చాటిచెప్తాం.. ఎల్లకాలం మమ్మల్ని ఆక్రమించుకోవటాన్ని మేం అంగీకరించబోమని’’ అని గాజా నివాసి అలీ అనే సైన్స్ టీచర్ రాయిటర్స్ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

సరిహద్దును ఉల్లంఘించి, సమీపంలో నివసిస్తున్న ఇజ్రాయెల్ వాసులపై దాడులు చేయటం ఆ ఆందోళనల లక్ష్యమని ఇజ్రాయెల్ అంటోంది.

Image copyright Getty Images

రాయబార కార్యాలయం తరలింపు మీద ఎందుకంత వివాదం?

జెరూసలెం హోదా అంశం ఇజ్రాయెల్ - పాలస్తీనాల మధ్య ఘర్షణకు కేంద్ర బిందువుగా ఉంది.

జెరూసలెం మీద ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని అంతర్జాతీయంగా గుర్తించలేదు. 1993 లో జరిగిన ఇజ్రాయెల్ - పాలస్తీనా శాంతి ఒప్పందాల ప్రకారం.. జెరూసలెం హోదా అంశాన్ని తర్వాతి దశ శాంతి చర్చల్లో చర్చించాల్సి ఉంటుంది.

ఇజ్రాయెల్ 1967 మధ్య ప్రాచ్య యుద్ధం నాటి నుంచి తూర్పు జెరూసలెంను ఆక్రించుకుని ఉంది. నిజానికి ఆ ప్రాంతాన్ని తన భూభాగంలో కలిపివేసుకుంది. కానీ.. అయితే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2017 డిసెంబర్‌లో ఒక ప్రకటన చేసే వరకూ ఆ భూభాగాన్ని ఇజ్రాయెల్ అంతర్భాగంగా ఏ దేశమూ గుర్తించలేదు.

1967 నుంచి తూర్పు జెరూసలెంలో ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ కాలనీలను నిర్మించింది. వాటిలో దాదాపు 2,00,000 మంది యూదులు నివసిస్తున్నారు. ఈ నిర్మాణాలు, నివాసాలను అంతర్జాతీయ చట్టం కింద అక్రమంగా పరిగణిస్తున్నారు. కానీ ఆ వాదనతో ఇజ్రాయెల్ విభేదిస్తోంది.

జెరూసలెంలో రాయబార కార్యాలయాలున్న వివిధ దేశాలు.. ఇజ్రాయెల్ 1980లో జెరూసలెం తన రాజధానిగా లాంఛనంగా నిర్ణయిస్తూ చట్టం చేసిన తర్వాత.. అక్కడి నుంచి తమ రాయబార కార్యలయాలను తరలించాయి.

ఈ అంశంపై అమెరికా దశాబ్దాలుగా తటస్థ వైఖరిని కొనసాగించింది. కానీ.. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను గుర్తిస్తూ ట్రంప్ గత డిసెంబర్‌లో నిర్ణయం తీసుకోవటంతో వివాదం చెలరేగింది.

అమెరికా రాయబార కార్యాలయాన్ని ఇజ్రాయెల్‌కు తరలించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీనిని ఇజ్రాయెల్, అమెరికాల ప్రధాన మిత్ర దేశాలు వ్యతిరేకించాయి.

పాలస్తీనియన్లు గాజాలో నిరసనలు, ఆందోళనలకు దిగుతున్నారు.

Image copyright Reuters

ఏం ప్రారంభించారు? ఎవరు హాజరయ్యారు?

జెరూసలెంలో ఇప్పటికే ఉన్న అమెరికా కాన్సులేట్ భవనంలో ఒక చిన్న తాత్కాలిక రాయబార కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు.

టెల్ అవీవ్ నుంచి మొత్తం రాయబార కార్యాలయాన్ని ఇక్కడకు మార్చటానికి అవసరమైన పెద్ద స్థలాన్ని తర్వాత నిర్ణయిస్తారు.

ఇజ్రాయెల్ 70వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగానే ఈ రాయబార కార్యాలయాన్ని కూడా తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీడియో కాల్ ద్వారా ప్రసంగించారు. ఇది ఇజ్రాయెల్‌కి ‘గొప్ప దిన’మని ఆయన అంతకుముందు ఒక ట్వీట్‌లో అభివర్ణించారు.

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో సీనియర్ సలహాదారులైన ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్, విత్త మంత్రి స్టీవెన్ మున్‌చిన్, విదేశాంగ ఉప మంత్రి జాన్ సల్లివన్‌లు ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాయబార కార్యాలయం అధికారిక ముద్రను ఇవాంకా ఆవిష్కరించారు. కుష్నర్ ప్రసంగిస్తూ.. ‘‘అధ్యక్షుడు ట్రంప్ ఒక హామీ ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు... అమెరికాను విశ్వసించవచ్చునని మేం ప్రపంచానికి చూపాం. మేం మా మిత్రులు, మిత్రపక్షాలకు మద్దతుగా ఉంటాం’’ అని చెప్పారు.

‘‘ప్రమాదకరమైన, లోపభూయిష్టమైన, ఏకపక్షమైన ఇరాన్ ఒప్పందం’’ నుంచి ట్రంప్ వైదొలగటం గురించి కూడా కుష్నర్ ప్రస్తావించారు.

అమెరికా రాయబార కార్యాలయం తరలింపు మీద యూరోపియన్ యూనియన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. ’’ఇది ఎంత గొప్ప దినం. ఈ క్షణాన్ని గుర్తుంచుకోవాలి. ఇది చరిత్ర. ట్రంప్.. మీరు చరిత్రను గుర్తించటం ద్వారా చరిత్ర సృష్టించారు. మేమంతా ఎంతో రుణపడి ఉన్నాం’’ అని పేర్కొన్నారు.

జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించాలన్న ట్రంప్ నిర్ణయానికి ఇజ్రాయెల్ యూదులు రాజకీయ విభేదాలకతీతంగా బలంగా మద్దతు పలికారు.

అయితే.. పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్.. ట్రంప్ నిర్ణయాన్ని ‘ఈ శతాబ్దపు చెంప దెబ్బ’గా అభివర్ణించారు. అమెరికాను ఇక ఎంత మాత్రం తటస్థ మధ్యవర్తిగా పరిగణించజాలమని.. ఎత్తు పల్లాల మధ్య నడుస్తున్న ఇజ్రాయెల్ - పాలస్తీనా శాంతి చర్చల్లో భవిష్యత్తులో అమెరికాకు చోటు ఉండరాదని ఆయన పేర్కొన్నారు.

అమెరికా ఈ చర్యతో.. శాంతి ప్రక్రియలో తన పాత్రను రద్దు చేసుకుందని.. ప్రపంచాన్ని, పాలస్తీనా ప్రజలను, అరబ్ దేశాలను, ఇస్లామిక్ జాతిని అవమానించారని.. విద్వేషాన్ని, అస్థిరతను సృష్టించారని అబ్బాస్ అధికార ప్రతినిధి ఒకరు సోమవారం వ్యాఖ్యానించారు.

అమెరికా, ఇజ్రాయెల్‌లతో కలిసి ఈ రాయబార కార్యాలయాన్ని ఆక్రమిత జెరూసలెంకు తరలించటం అంతర్జాతీయ చట్టాన్ని దారుణంగా ఉల్లంఘించటమేనని.. దీనిని వేడుకగా నిర్వహించటం, అందులో వివిధ దేశాలు పాల్గొనటం సిగ్గుచేటని.. అరబ్ లీగ్ చీఫ్ అబుల్ ఘేట్ విమర్శించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionదశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ వెళ్లిన భారతీయ యూదుల పరిస్థితి ఏంటి ?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)