ఫేస్‌బుక్‌లో పెరిగిన 'ద్వేషం'

  • 17 మే 2018
ఫేస్‌బుక్ Image copyright GETTY IMAGES/REUTERS
చిత్రం శీర్షిక 'ప్రస్తుతం వినియోగంలో ఉన్న మొత్తం ఫేస్‌బుక్ ఖాతాల్లో 3 నుంచి 4 శాతం నకిలీవే'

ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దాదాపు 2.9 కోట్ల పోస్టులను గుర్తించినట్టు ఫేస్‌బుక్ తెలిపింది. అందులో ద్వేషపూరితమైన వ్యాఖ్యలు, హింసాత్మక దృశ్యాలు, ఉగ్రవాదం, లైంగిక పరమైన అంశాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయని పేర్కొంది.

అలా గుర్తించిన పోస్టుల్లో కొన్నింటిని తొలగించగా, కొన్నింటిపై హెచ్చరిక గుర్తులు పెట్టినట్టు తెలిపింది.

అందుకు సంబంధించి తాజాగా ఫేస్‌బుక్ తొలిసారిగా ఓ నివేదికను విడుదల చేసింది.

నిషేధిత పోస్టులను ఫేస్‌బుక్ ఈ విధంగా వర్గీకరించింది:

  • హింసాత్మక గ్రాఫిక్స్
  • నగ్న దృశ్యాలు, లైంగిక పరమైనవి
  • స్పామ్
  • ద్వేషపూరితమైనవి
  • నకిలీ ఖాతాలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఫేస్‌బుక్ మోడరేటర్: చూడలేని ఎన్నో దారుణాలను అక్కడ చూడాల్సి ఉంటుంది!
ఫేస్‌బుక్ నిబంధనలకు విరుద్ధమైన పోస్టుల సంఖ్యలో పెరుగుదల ఇలా ఉంది
2017 అక్టోబర్- డిసెంబర్ 2018 జనవరి- మార్చి
హింసాత్మక గ్రాఫిక్స్ 12 లక్షలు 34 లక్షలు
ద్వేషపూరిత వ్యాఖ్యలతో కూడిన పోస్టులు 16 లక్షలు 25 లక్షలు
స్పామ్(మోసపూరిత) పోస్టులు 72.7 కోట్లు 83.7 కోట్లు
తీవ్రవాద సంబంధిత పోస్టులు 11 లక్షలు 19 లక్షలు

58.3 కోట్ల ఖాతాలు నకిలీవే

ప్రస్తుతం వినియోగంలో ఉన్న మొత్తం ఖాతాల్లో 3 నుంచి 4 శాతం నకిలీవే అని ఫేస్‌బుక్ అంచనా వేసింది.

ఈ ఏడాది జనవరి, మార్చి మధ్యలో 58.3 కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్టు వెల్లడించింది.

2017 అక్టోబర్- డిసెంబర్‌తో పోల్చితే 2018 జనవరి- మార్చి త్రైమాసికంలో గుర్తించిన హింసాత్మకమైన గ్రాఫిక్స్ పోస్టుల సంఖ్య 183 శాతం పెరిగింది.

అభ్యంతరకర పోస్టులను గుర్తించే మెరుగైన సాంకేతికత అందుబాటులోకి రావడం, సిరియా యుద్ధం తీవ్రమవ్వడం కూడా ఆ సంఖ్య పెరగడానికి ఓ కారణమని ఫేస్‌బుక్ అభిప్రాయపడింది.

గతంతో పోల్చితే తీవ్రవాద సంబంధ పోస్టుల సంఖ్య 73 శాతం పెరిగింది. ఆ మూడు నెలల వ్యవధిలో 19 లక్షల తీవ్రవాద పోస్టులను ఫేస్‌బుక్ తొలగించింది.

Image copyright Getty Images

సాఫ్ట్‌వేర్‌కు చిక్కని 'ద్వేషం'

ఫేస్‌బుక్‌లో పోస్టులను పరిశీలించేందుకు 15,000 మంది సిబ్బంది(మోడరేటర్స్) పనిచేస్తున్నారు.

వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులతో పాటు, కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) సాఫ్ట్‌వేర్‌ సాయంతో వారు అభ్యంతరకర పోస్టులను గుర్తిస్తారు.

అయితే, ద్వేషపూరితమైన వ్యాఖ్యలతో కూడిన పోస్టులను గుర్తించడంలో ఆ సాఫ్ట్‌వేర్ ఇబ్బంది పడుతోందట.

ఏ పోస్టులో అభ్యంతరకర వ్యాఖ్యలున్నాయో, ఎందులో లేవో ఆటోమేషన్ గుర్తించడం చాలా కష్టమవుతోందట.

అలాంటి పోస్టులను పట్టేయడంలో తమ సాఫ్ట్‌వేర్ 38 శాతం మాత్రమే సఫలమవుతోందని ఫేస్‌బుక్ తన నివేదికలో తెలిపింది.

అందుకే అలాంటి పోస్టులను ఫేస్‌బుక్ సిబ్బందే ఎక్కువగా పరిశీలిస్తారు. అయినా ఆ వ్యాఖ్యల్లోని భావాన్ని విశ్లేషించి వేటిని తొలగించాలి? వేటిని ఉంచాలి? అన్నది నిర్ణయించడంలో వారు కూడా ఇబ్బంది పడుతుంటారు.

జనవరి నుంచి మార్చి వరకు 25 లక్షల ద్వేషపూరిత పోస్టులను ఫేస్‌బుక్ గుర్తించింది. అందులో కొన్నింటిని బ్లాక్ చేసింది. కొన్నింటిపై హెచ్చరిక గుర్తులు పెట్టింది.

తీవ్రవాద చర్యలను ప్రేరేపించే పోస్టులను మాత్రం తమ సాఫ్ట్‌వేర్ సులువుగా పసిగడుతోందని ఫేస్‌బుక్ తెలిపింది.

గత మూడు నెలల్లో ఇస్లామిక్ స్టేట్, అల్- ఖైదా తదితర సంస్థలకు అనుకూలంగా ఉన్న 99.5 శాతం పోస్టులను గుర్తించిందని అది వెల్లడించింది.

Image copyright Getty Images

10 వేల పోస్టుల్లో 7 నుంచి 9 నగ్న, లైంగిక దృశ్యాలు

గతంలో కంటే జనవరి- మార్చి త్రైమాసికంలో హింసాత్మకమైన గ్రాఫిక్స్ చిత్రాలు, నగ్న దృశ్యాల పోస్టులు ఎక్కువయ్యాయని తెలిపింది.

150 కోట్ల మంది రోజువారీ యాక్టివ్ వినియోగదారులు చేసే పోస్టుల్లో కొన్ని లక్షల సంఖ్యలో హింసాత్మకమైన దృశ్యాలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ అవుతుంటాయి.

అలాగే, ప్రతి 10 వేల పోస్టుల్లో 7 నుంచి 9 నగ్న, లైంగిక దృశ్యాలు ఉంటున్నాయి.

ద్వేషపూరిత పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఫేస్‌బుక్ దగ్గర లేవని ఆ సంస్థ డేటా అనలిటిక్స్ విభాగం హెడ్ అలెక్స్ తెలిపారు.

"ఫేస్‌బుక్‌లో ఎన్ని ద్వేషపూరిత పోస్టులు ఉంటున్నాయన్నది చెప్పలేం. ఏది రెచ్చగొట్టే వ్యాఖ్యో.. ఏది కాదో కచ్చితంగా చెప్పడం కష్టం. ఈ విషయంలో మరింత మెరుగ్గా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం" అని ఆయన వివరించారు.

చిత్రం శీర్షిక ద్వేషపూరిత పోస్టులను తొలగించడంలో ఫేస్‌బుక్ తీరు సంతృప్తికరంగా లేదు: డోట్టీ లక్స్

'ఫేస్‌బుక్ సాకులు చెబుతోంది'

అయితే, ద్వేషపూరిత వ్యాఖ్యలను గుర్తించడం కష్టమని చెప్పడం ఓ సాకు మాత్రమే అని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డోట్టీ లక్స్ వ్యాఖ్యానించారు. ఆమె మైనారిటీ వర్గాలు లక్ష్యంగా చేసే ద్వేషపూరిత పోస్టులను కట్టడి చేయాలంటూ ఫేస్‌బుక్ విఫలమవుతోందంటూ ఆమె ఓ ఉద్యమాన్ని నడుపుతున్నారు.

"వాళ్లకు డేటింగ్ యాప్‌లను విడుదల చేసేందుకు సమయం ఉంటుంది. నా బ్యాంకు ఖాతాను అనుసంధాని చేయడానికి సమయం దొరుకుతుంది. కానీ, వారి వినియోగదారులు ఎవరు అన్నది గుర్తించడానికి మాత్రం వాళ్లకు టైం దొరకదు" అని ఆమె విమర్శించారు.

"మీ ఉదాసీన వైఖరి కారణంగానే ద్వేషపూరిత పోస్టుల ద్వారా కొందరు ఎదుటివారి గొంతు నొక్కేందుకు, భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు" అని డోట్టీ లక్స్ ఆరోపించారు.

Image copyright Getty Images

ఆయా ప్రాంతాలకు అనుగుణంగా స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు తెలిసిన వారిని పరిశీలకులుగా ఫేస్‌బుక్ నియమించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి.

"ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన సామాజిక పరిస్థితులు, సంస్కృతులు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా ఆయా ప్రాంతాలకు చెందిన పరిశీలకులను నియమించుకుంటేనే ఏ పోస్టు ద్వేషపూరితమైందో, ఏది కాదో గుర్తించడం సులువవుతుంది" అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)