డేటింగ్ తర్వాత... మీరు ‘బ్రేకప్ ఫీజు’ చెల్లిస్తారా?

  • కెర్రీ అలెన్
  • బీబీసీ మానిటరింగ్
ప్రేమ జంట బ్రేకప్

ఫొటో సోర్స్, Getty Images

ఆ సూట్‌కేసులో రెండు కోట్ల రూపాయల పైగా నగదు ఉంది. చైనాలోని హాంగ్జో నగరంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ఆ సూట్‌కేసును పోలీసులు తెరిచి చూసి అవాక్కయ్యారు.

అందులో 20 లక్షల యువాన్లు (చైనా నగదు.. భారత కరెన్సీలో 2.13 కోట్ల రూపాయలు) ఉన్నాయి. అంత డబ్బు ఎవరిది? అక్కడికెలా వచ్చింది? అని ఆరాతీశారు.

ఒక ఇరవై ఏళ్ల యువకుడొకరు ఆ డబ్బు యజమానిగా గుర్తించారు. ఆ బార్‌లో తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవటానికి అతడు వచ్చాడు.

మరి అంత డబ్బు ఎందుకు తెచ్చాడు అంటే.. ఆ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌కి ‘బ్రేకప్ ఫీజు’గా చెల్లించటానికి తెచ్చానన్నాడు.

ఇది చైనాలో డేటింగ్‌లో పెరుగుతున్న కొత్త ట్రెండ్.

ఫొటో సోర్స్, Getty Images

నిజమైన ప్రేమ ఖరీదు ఎంత?

యువతీయువకులు, స్త్రీపురుషులు.. ప్రేమలో పడక ముందో పెళ్లి చేసుకోవటానికి ముందో ఒకరినొకరు తెలుసుకోవటం కోసం పరస్పరం కలుసుకోవటం, కలిసి తిరగటం, కాలం గడపటాన్ని డేటింగ్‌గా వ్యవహరిస్తారు. పెళ్లి చేసుకోకుండా కలిసి తిరగటాన్ని కూడా డేటింగ్‌ అనే పరిగణిస్తారు.

ఈ డేటింగ్‌లో కలిసి హోటళ్లు, బార్లు, పబ్బులకు వెళ్లటం, డ్రింక్స్, డిన్నర్లు, గిఫ్టులు, హాలిడే ట్రిప్పులు.. చాలా ఖర్చులు కూడా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే.

అయితే కొంత కాలం ఈ డేటింగ్ సాగాక కొన్ని జంటలు విడిపోతుంటాయి. అందుకు కారణమేదైనా కావచ్చు. ఇలా విడిపోయేటపుడు ఎవరి వస్తువులు వారికి తిరిగి ఇచ్చుకోవటం కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు అలా కేవలం వస్తువులు తిరిగి ఇవ్వటంతోనే సరిపుచ్చుకోవటం లేదు.

ప్రేయసీ ప్రియులు తమ దీర్ఘకాలిక సంబంధాలను తెంచుకునేటపుడు.. ఒక విధమైన పరిహారం తరహాలో బ్రేకప్ ఫీజులు చెల్లించే పద్ధతి చైనాలో ఇటీవలి కాలంలో పెరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఇది చట్టబద్ధమైనదేమీ కాదు. ఒక రకంగా తమ మాజీ భాగస్వామికి విడాకుల సెటిల్‌మెంట్ ఇవ్వటం వంటిది.

ఇద్దరిలో ఆ బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకునే వారు ఈ బ్రేకప్ ఫీజు చెల్లిస్తారు. కలిసి గడిపిన కాలం, ఆ బంధం కోసం వెచ్చించిన సమయం, డబ్బు, కృషిని బట్టి.. తమ మాజీ భాగస్వామికి ఎంత డబ్బు చెల్లించాలన్నది నిర్ణయించుకుంటారు.

కొందరు తమ భాగస్వామి ఎంత డబ్బు ఖర్చు పెట్టారనేది వాస్తవికంగా లెక్కగడతారు. ఇంకొందరు.. ఈ బ్రేకప్ వల్ల మానసికంగా ఎంత దెబ్బతింటారనేది అంచనా వేసి ఇంకొంత అదనంగా నిర్ణయిస్తరారు.

ఎక్కువగా పురుషులే ఈ బ్రేకప్ ఫీజులు చెల్లిస్తారు. తప్పు చేశామన్న భావనతో లేదా తమ భాగస్వామి మనసును శాంతింపచేయటానికో పురుషులు ఈ ఫీజులు చెల్లించటం పరిపాటి. అయితే.. చైనాలో స్త్రీపురుషుల సంబంధాల్లో సంప్రదాయబద్ధంగా పురుషులే ఎక్కువ ఖర్చు చేయటం, కానుకలు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి.. తాము ఈ బ్రేకప్ ఫీజు చెల్లించటం సముచితంగా ఉంటుందని మహిళలు ఆలోచించటం కూడా పెరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

వయసులో ఉన్నపుడు తమ భాగస్వామిని కలవటం గురించి కాకుండా తమ కెరీర్‌ గురించి పట్టించుకుని ఉంటే మంచి అవకాశాలు వచ్చి ఉండేవని భావించే మహిళలకు ఈ బ్రేకప్ ఫీజులు ప్రత్యేకంగా ఎంతో సాయం చేస్తున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి.

ఈ బ్రేకప్ ఫీజుల వ్యవహారం కొన్నిసార్లు హద్దులు దాటటం, కేసుల వరకూ వెళ్లటం, నేరాలుగా మారి మీడియాలో వార్తలుగా కూడా వస్తుంటాయి.

ఫొటో సోర్స్, AFP

కొన్ని ఉదంతాలు నవ్వు తెప్పిస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక మహిళ.. తన మాజీ భాగస్వామితో కలిసి తిరిగిన అన్ని రెస్టారెంట్ల బిల్లులను పంపించింది. అతడు తన కోసం ఎంత ఖర్చు పెట్టాడనేది ఎంతో శ్రమకోర్చి పరిశోధించింది. ఆయనకు తను ‘బాకీపడ్డ’ ప్రతి పైసా తిరిగి ఇవ్వాలన్నది ఆమె ఆలోచన.

నింగ్బో నగరానికి చెందిన ఒక యువకుడు.. తనకు బట్టతల వచ్చిందని తన ప్రియురాలు తనను వదిలివేసిందని, అందుకు గాను ఆమె తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కేసు వేశాడు.

ఇంకొన్ని తీవ్రమైన కేసులూ ఉన్నాయి. 2014 నవంబరులో సిచువాన్ ప్రావిన్స్‌లో ఒక వ్యక్తి.. తన గర్ల్‌ఫ్రెండ్‌కు వేరే భాగస్వాములు కూడా ఉన్నారని తెలుసుకుని.. ఆమె తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆ వ్యక్తి, అతడి గర్ల్‌ఫ్రెండ్ ఇద్దరూ వివాహితులే. వారిద్దరూ ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఆమెకు అతడు కానుకలు, దుస్తులు కొనిపించేవాడు. అతడు తనకు ‘బ్రేకప్ ఫీజు’ చెల్లించాలని పలుమార్లు డిమాండ్ చేయగా ఆమె తిరస్కరించింది. దీంతో అతడు ఆమె ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యుల మీద యాసిడ్ పోశాడు.

అతడిని అరెస్ట్ చేశారు. అయితే.. ఆ జంట సరిసమానులుగా విడిపోయినట్లయితే అతడు అలా ప్రవర్తించి ఉండేవాడు కాదన్న వాదన వినిపిస్తోంది.

ఫొటో సోర్స్, JIANGSU TV

మగాడికి ఆటవస్తువా?

ఇక హాంగ్జో బార్‌లో వదిలివెళ్లిన డబ్బు దగ్గరికి వద్దాం. ఆ యువకుడు తనకు చెల్లించటం కోసం తెచ్చిన ఆ డబ్బులు ‘‘చాలా తక్కువ’’గా ఉన్నాయని సదరు యువతి అభిప్రాయపడినట్లు గ్లోబల్ టైమ్స్ కథనం చెప్తోంది.

‘‘నేను ఆ సూట్‌కేస్ తీసుకోలేదు. అతడ్నే తీసుకెళ్లమని చెప్పాను. అంతే జరిగింది’’ అని ఆమె తెలిపినట్లు ఆ వార్త పేర్కొంది.

అయితే.. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పటికే బార్ నుంచి వెళ్లిపోయాడని ఆమె గమనించలేదు. దీంతో ఆ సూట్‌కేసు అనుమానాస్పదంగా మారి పోలీసులకు చేరింది.

ఆ తర్వాత ఆ యువతీయువకులు ఇద్దరూ ఆ డబ్బు తీసుకోవటం కోసం పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. పోలీసులు ఆ డబ్బును యువకుడికి తిరిగి ఇచ్చారు. మరోసారి డబ్బుతో అలా అజాగ్రత్తగా ఉండొద్దని హితవుపలికారు.

ఫొటో సోర్స్, Getty Images

అయితే.. తన మాజీ గర్ల్‌ప్రెండ్‌కు తాను ఇచ్చిన డబ్బు సరిపోతుందా అనేది తనకు ఇంకా తెలియట్లేదని అతడు చెప్తున్నాడు. ‘‘ఇరవై లక్షల యువాన్లంటే ఎక్కువా?’’ అని అతడు ప్రశ్నిస్తున్నాడు.

ఈ ఉదంతం మీద సీనా వీబో మ్రైక్రోబ్లాగ్ యూజర్లు మాత్రం.. అనేక విధంగా స్పందిస్తున్నారు.

‘‘ఇరవై లక్షల యువాన్లతో హాంగ్జూలో మంచి ఇల్లు కొనుక్కోవచ్చు’’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించాడు. మరొక యూజర్.. ‘‘విడిపోవటానికి డబ్బు ఎందుకు?’’ అని ప్రశ్నించాడు.

‘‘ఆ యువతి తనను తాను ఎలా పరిగణిస్తోంది? ఒక వస్తువుగా.. మగాళ్ల ఆటవస్తువుగానా?’’ అని ఇంకో యూజర్ వ్యాఖ్యానించారు. ‘‘ఆడవాళ్లకు డబ్బులు, వస్తువులు మగాళ్లే ఎప్పుడూ ఎందుకివ్వాలి? ఆడాళ్లు, మగాళ్లు సమానం కాదా?’’ అని ఇంకొకరు ప్రశ్నించారు.

డబ్బుకు ప్రేమకు సంబంధాన్ని ప్రశ్నించాలని కొందరు వ్యాఖ్యానిస్తే.. ఇటువంటి పద్ధతుల వల్ల చైనాలోని పేద వాళ్లు భాగస్వామిని వెదుక్కునే విషయంలో ఒత్తిడి పెరుగుతుందేమోనని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)