సిరియా యుద్ధం: ‘ఫిబ్రవరి దాడిలో క్లోరిన్ వాడారు’

  • 16 మే 2018
సిరియా, రసాయన దాడులు Image copyright AFP

సిరియా ఉత్తర ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న సారాఖెబ్ నగరంలో ఫిబ్రవరిలో జరిగిన ఒక దాడిలో క్లోరిన్‌ను ఉపయోగించి ఉండవచ్చునని.. రసాయన ఆయుధాలపై అంతర్జాతీయ పరిశీలన సంస్థ చెప్పింది.

‘రసాయన దాడి’గా అనుమానిస్తున్న నాటి ఘటనలో ‘‘సిలిండర్ల నుంచి యాంత్రిక పద్ధతిలో క్లోరిన్‌ను విడుదల చేసినట్లు’’ ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ (ఓపీసీడబ్ల్యూ) గుర్తించింది.

అయితే.. ఆ దాడికి కారణం ఎవరనేదానిపై ఆ సంస్థ ఏ ఆరోపణలూ చేయలేదు.

ప్రభుత్వ హెలికాప్టర్ల నుంచి క్లోరిన్ నింపిన బాంబులు వేశారని వైద్య సిబ్బంది, సామాజిక కార్యకర్తలు ఆ ఘటన సమయంలో చెప్పారు.

సిరియా ప్రభుత్వం తానెన్నడూ రసాయన ఆయుధాలు ఉపయోగించలేదని పదే పదే తిరస్కరిస్తోంది.

ప్రభుత్వ బలగాలు నరాలపై ప్రభావం చూపే సారిన్, క్లోరిన్‌లను నాలుగు దాడుల్లో ఉపయోగించాయని బలంగా చెప్పగలమని గతంలో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి - ఓపీసీడబ్ల్యూ బృందం ఇంతకుముందు పేర్కొంది.

సిరియాలోనే కొద్ది రోజుల కిందటి వరకూ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న డౌమా పట్టణంలో గత నెలలో జరిగిన అనుమానిత రసాయన దాడి ఉదంతంపై కూడా ఓపీసీడబ్ల్యూ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ఆ దాడిలో 40 మంది చనిపోయినట్లు వైద్య సిబ్బంది చెప్తున్నారు.

డౌమాలో ప్రభుత్వ బలగాలు రసాయన ఆయుధాలు ఉపయోగించారని తాము నమ్ముతున్నామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉద్ఘాటించాయి. సిరియాలో ‘రసాయన ఆయుధాల స్థావరాల’ మీద క్షిపణి దాడులు కూడా చేశాయి.

Image copyright AFP
చిత్రం శీర్షిక సిరియాలో ఫిబ్రవరిలో జరిగిన దాడి బాధితులకు శ్వాస సమస్యలు తలెత్తటంతో ఆస్పత్రికి తరలించారు

ఫిబ్రవరిలో ఏం జరిగింది?

ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని సారాఖెబ్ పట్టణంలో ఫిబ్రవరి 4వ తేదీన ఒక దాడి జరిగింది.

సమీపంలోని ప్రభుత్వ స్థావరం నుంచి గాలిలోకి ఎగసిన హెలికాప్టర్.. ఒక బారెల్ బాంబును జారవిడిచిందని ఒక డాక్టర్ చెప్పారు.

ఆ దాడి ఫలితంగా క్లోరిన్ వాసన వచ్చింది. ప్రజలకు శ్వాస ఇబ్బందులు, కళ్లలో దురద సమస్యలు తలెత్తటంతో ఆస్పత్రులకు తరలించారు.

‘వైట్ హెల్మెట్స్’ అని పిలిచే తిరుగుబాటుదారులు ‘సిరియా సివిల్ డిఫెన్స్’ కార్యకర్తలు.. ఆ దాడిలో తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్న పలువురి మీద నీరు చల్లుతున్న వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

ఆ ఘటనపై నిజనిర్ధారణ చేపట్టిన తమ బృందం.. అందులో క్లోరిన్‌ను ‘ఆయుధంగా ఉపయోగించి ఉండొచ్చు’ అని నిర్ధారించినట్లు బుధవారం వెల్లడించింది.

ఈ కింది అంశాలు ప్రాతిపదికగా తమ నిర్ధరణలు చేసినట్లు ఆ సంస్థ పేర్కింది:

  • క్లోరిన్ కలిగివున్నట్లు నిర్ధారితమైన రెండు సిలిండర్లు ఉండటం
  • సాక్షుల వాంగ్మూలం
  • ‘‘క్లోరిన్ అసాధారణంగా ఉండటా’’న్ని నిర్ధారిస్తున్న పర్యావరణ నమూనాలు
  • క్లోరిన్ ప్రభావానికి గురైన వారికి ఉండే లక్షణాలు, గుర్తులు ఎక్కువ మంది పేషెంట్లలో కనిపించటం

‘‘ఎవరైనా ఏ కారణంతోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ప్రమాదకర రసాయన ఆయుధాలను ఉపయోగించటం కొనసాగించటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని ఓపీసీడబ్ల్యూ డైరెక్టర్ జనరల్ అహ్మెట్ ఉజుమ్సు ప్రకటించారు.

రసాయన ఆయుధాల ఒప్పందం ప్రకారం రసాయన ఆయుధాల వినియోగంపై సంపూర్ణ నిషేధాన్ని ఇది ఉల్లంఘించటమేనని ఆయన చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionసిరియాలో ఏం జరుగుతోంది! 95 సెకన్లలో మొత్తం చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)