రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?

  • 18 మే 2018
మాస్కోలోని ఆండ్రీ సఖరోవ్ మ్యూజియంలో 2013 డిసెంబర్ 17వ తేదీన సెక్స్ వర్కర్లు ప్రారంభించిన చిత్రకళా ప్రదర్శనను తిలకిస్తున్న ఒక మహిళ Image copyright Getty Images

తాజాగా అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ రూపొందించిన ఓ బుక్‌లెట్‌లోని అంశాలు వివాదాస్పదమయ్యాయి. ఫుట్ బాల్ వరల్డ్ కప్ కోసం రష్యా వెళ్లేవారు అక్కడి అమ్మాయిల మనసు ఎలా దోచుకోవాలో వివరిస్తూ ఆ బుక్‌లెట్‌లో ఓ చాప్టర్‌ను పొందుపరిచారు.

రష్యా వెళ్లే పాత్రికేయులకు, అధికారులకు రష్యా భాషపై ఇటీవల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న సమయంలో ఆ బుక్‌లెట్ ప్రతులను అందించారు.

"రష్యా అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. చాలా మంది పురుషులు వారితో గడపాలని కోరుకుంటారు. ఆ అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు మీరు చాలా శుభ్రంగా, సువాసనతో, మంచి దుస్తుల్లో.. ప్రత్యేకంగా కనిపించాలి. సెక్స్ గురించి పనికిమాలిన ప్రశ్నలు అడగొద్దు. ఎందుకంటే, రష్యన్లకు సెక్స్ అనేది ప్రైవేట్ విషయం. అందరి ముందు దాని గురించి మాట్లాడేందుకు ఇష్టపడరు. అక్కడి మహిళలను విలువైన వారిగా పరిగణించాలి" అంటూ అందులో 8 సూచనలు చేశారు.

ఈ విషయాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాంతో క్షమాపణలు చెప్పిన అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ బుక్‌లెట్‌లో ఆ చాప్టర్‌ను తొలగించింది. ఆ విషయాలను పొరపాటున ముదించామని తెలిపింది.

ఆ శిక్షణ తరగుతులకు హాజరైన పాత్రికేయుడు నాచో కటుల్లో ఆ చాప్టర్ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

Image copyright Reuters

‘మీరే చొరవ తీసుకోండి’

ఆ చాప్టర్‌లో ఇంకా ఏమన్నారంటే..

"మీరే ముందు చొరవ తీసుకోవాలి. అలా చొరవ తీసుకునే పురుషులను రష్యా అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. ఒకవేళ మీకు ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటే, మహిళలతో ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి."

"గుర్తుంచుకోండి చాలామంది రష్యా మహిళలకు మీ దేశం గురించి పెద్దగా తెలియదు. మీరు వాళ్లకు కొత్త, భిన్నంగా ఉంటారు. రష్యా పురుషులతో పోల్చితే ఇది బాగా కలిసొచ్చే విషయం."

రష్యా మహిళలు ఎవరిని ఇష్టపడే అవకాశం ఉందో గమనిస్తూ అందుకు తగ్గట్టుగా ప్రత్యేకంగా వ్యవహరించాలని కూడా అందులో సూచించారు.

"సాధారణంగా రష్యా మహిళలు ముఖ్యమైన విషయాలను చూస్తారు. అలాగే మీ వద్ద ఉండే ముఖ్యమైన వస్తువులు, డబ్బు, నీవు అందగాడివా? లేదా పేరున్న వ్యక్తివా అని చూసేవాళ్లు కూడా ఉంటారు. అయినా సరే మీరు కంగారు పడాల్సిన అక్కర్లేదు. రష్యాలో చాలా మంది అందగత్తెలు ఉంటారు. కానీ వాళ్లంతా నీకోసమే కాదు. ప్రత్యేకంగా నడుచుకో!" అని అందులో వివరించారు.

అయితే, ఆన్‌లైన్ బ్లాగ్ నుంచి ఈ వివాదాస్పద చాప్టర్‌ను తొలగించినట్టు అర్జెంటీన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించినట్టు స్థానిక మీడియా తెలిపింది.

బుక్‌లెట్‌లో ఆ సూచనలను పొందుపరచాలని ఎవరు నిర్ణయించారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)