పోర్న్ స్టార్‌కు దాదాపు రూ.1.35 కోట్లు చెల్లించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అధికారిక పత్రాల్లో వెల్లడి

  • 17 మే 2018
ట్రంప్, స్టార్మీ డేనియల్స్ Image copyright Getty Images

తన లాయర్‌కు చెల్లించిన నగదు వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా వెల్లడించారు. ట్రంప్‌తో అఫైర్ ఉందని ఆరోపించిన పోర్న్‌ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కి ఆ నగదును లాయర్ మైకేల్ కోహెన్ ముట్టజెప్పారు.

ఆ చెల్లింపుల వివరాలను ట్రంప్ గతంలో వెల్లడించిన తన ఆర్థిక పత్రాల్లో పేర్కొన్నారని ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్ బుధవారం గుర్తించింది. అందుకు సంబంధించిన పత్రాలను బయటపెట్టింది.

ఆ పత్రాల ప్రకారం.. 2016లో చేసిన ఖర్చుల కోసం మైకేల్ కోహెన్‌కు లక్ష నుంచి రెండున్నర లక్షల డాలర్ల దాకా (సుమారు రూ.67 లక్షల నుంచి రూ. కోటీ 35 లక్షల వరకు) ట్రంప్ చెల్లించారని తెలుస్తోంది.

స్టార్మీ డేనియల్స్‌కు లక్షా 30 వేల డాలర్లు చెల్లించానన్న వార్తలను ట్రంప్ గతంలో తోసిపుచ్చారు.

Image copyright others

తాజా పత్రాల్లోని చెల్లింపుల వివరాలను పారదర్శకత కోసమే పేర్కొన్నట్టు వైట్ హౌస్ తెలిపింది. వాటిని బహిర్గతం చేయడానికి వీల్లేదని పేర్కొంది.

కానీ బాధ్యతల విభాగంలో పనిచేస్తున్న కోహెన్‌ జరిపిన చెల్లింపులను వెల్లడించాల్సి ఉంటుందని ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్ (ఓజీఈ) స్పష్టం చేసింది.

స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లించడం అధ్యక్షుడు ట్రంప్‌నకు న్యాయపరమైన చిక్కులు తీసుకొచ్చింది.

కోహెన్ దగ్గర ఉన్న ఈ చెల్లింపులకు సంబంధించిన పత్రాలను గత నెలలో ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుని సీజ్ చేసింది. వాటిపై క్రిమినల్ విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Image copyright STORMY DANIELS

కాలిఫోర్నియాలో 2006 జులైలో సెలిబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ జరుగుతున్నపుడు ఓ హోటల్ రూంలో తాను, ట్రంప్ సెక్స్ చేశామని స్టార్మీ రెండు నెలల క్రితం తెలిపారు.

"2016 ఎన్నికలకు ముందు ట్రంప్ లాయర్ నాకు 1.30 లక్షల డాలర్లు ఇచ్చారు. ఆ సెక్స్ విషయాన్ని బయటకు చెప్పవద్దన్నారు" అని ఆమె ఆరోపించారు.

అయితే ఆ ఆరోపణలను ట్రంప్ ఖండించారని ఆయన లాయర్ చెప్పారు.

స్మార్టీ చెప్పిన వివరాలు నిజమే అయితే, మెలానియా ట్రంప్ తన కొడుకు బర్రాన్‌కు జన్మ నిచ్చిన కొన్ని నెలల తర్వాత ఇది జరిగి ఉంటుంది.

2016 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు స్టార్మీకి కోహెన్ డబ్బు చెల్లించిన విషయం తనకు తెలియదని ట్రంప్ ఏప్రిల్‌లో చెప్పారు.

ట్రంప్ కోహెన్‌కు డబ్బు ఇచ్చిన విషయాన్ని 15 రోజుల క్రితం మొదట అధ్యక్షుడి మరో అటార్నీ(లాయర్) అయిన రూడీ గిలియానీ ఒక టీవీ ఇంటర్వ్యూలో ధ్రువీకరించారు.

ట్రంప్ తనతో సెక్స్ చేశాడని ఆరోపణలు చేసిన డేనియల్స్ నోరు మూయించేందుకు లక్షా 30 వేల డాలర్లు ఇచ్చారని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)