రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి.. కేంద్ర మంత్రి ఉత్తర కొరియా వెళ్లడం వెనుక రహస్యం ఏంటి?

  • 17 మే 2018
వీకే సింగ్ Image copyright AFP
చిత్రం శీర్షిక వీకే సింగ్ ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి. గతంలో భారత ఆర్మీ ఛీఫ్‌గా కూడా పనిచేశారు

రెండు దశాబ్దాల తర్వాత మొదటి సారి ఒక కేంద్ర మంత్రిని ఉత్తర కొరియా పంపించినట్టు భారత్ గురువారం వెల్లడించింది.

భారతదేశం నుంచి ఒక మంత్రి చివరిసారిగా ఉత్తర కొరియా వెళ్లింది 1998 సెప్టంబరులో. అప్పటి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఒక ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి ప్యాంగ్‌యాంగ్ వెళ్లారు.

ఈసారి పర్యటనకు మరింత ప్రాధాన్యం ఉంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ ఉత్తర కొరియాలో ఎంతోమంది సీనియర్ మంత్రులు, అధికారులను కలిశారు. వారం క్రితం రెండు దేశాల మధ్య రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చలు కూడా జరిగాయి.

ఆసక్తికరంగా, దశాబ్దం తర్వాత ఉభయ కొరియాల మధ్య తొలి సదస్సు జరిగిన కొన్ని వారాల తర్వాత, అమెరికా, ఉత్తర కొరియా అధినేతలు వచ్చే నెలలో చారిత్రాత్మక సమావేశానికి సన్నద్ధమైన తరుణంలో ఈ అరుదైన దౌత్య పర్యటన కుదిరింది. ఏకపక్షంగా అణ్వాయుధాలు వదులుకోవాలని అమెరికా పట్టుబడితే, చర్చల నుంచి తప్పుకుంటామని ఉత్తర కొరియా చెబుతుండడంతో జూన్ 12న డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరిగే చర్చలపై అనిశ్చితి నెలకొంది.

అంటే దౌత్యపరమైన సుడిగాలిలో వెనకబడిపోకుండా ఉత్తర కొరియాకు తిరిగి దగ్గర కావడానికే భారత్ ఈ సమయాన్ని ఎంచుకుందా? లేక మిత్రదేశం అమెరికాకు అనుకూలంగా ఇలా చేసిందా?

Image copyright EPA
చిత్రం శీర్షిక కిమ్, ట్రంప్ ఇద్దరూ జూన్ 12వ తేదీన సింగపూర్‌లో భేటీ కావాల్సి ఉంది

ఇరుదేశాల మధ్యా కొనసాగుతున్న సంబంధాలు

గత 45 ఏళ్లుగా భారత్, ఉత్తర కొరియాల మధ్య పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఉన్నాయనేది చాలా మంది మర్చిపోయారు. ఇరు దేశాలకు ఢిల్లీ, ప్యాంగ్‌యాంగ్‌లో చిన్న రాయబార కార్యాలయాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సహకార ఒప్పందాలు ఉన్నాయి. ఉత్తర కొరియా దౌత్యవేత్తలు ఢిల్లీలో విదేశీ రాయబారుల కోర్సులకు హాజరవుతుంటారు. ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో భాగంగా భారత్ ప్యాంగ్‌యాంగ్‌కు ఆహార సామగ్రి కూడా పంపించింది. 2004లో భారత్‌లో సునామీ వచ్చినపుడు ఉత్తర కొరియా తమ వంతుగా 30 వేల డాలర్ల సాయం అందించింది.

భారత్ తన మంత్రిని 20 ఏళ్ల క్రితం ఉత్తర కొరియా పంపించినా, ప్యాంగ్‌యాంగ్ నుంచి ఎన్నో ఏళ్లుగా సీనియర్ అధికారులు భారత్‌ రావడం కొనసాగుతూనే ఉంది.

Image copyright KCNA
చిత్రం శీర్షిక ఉత్తర కొరియాలో వీకే సింగ్, ఇతర అధికారులు

వాణిజ్య సంబంధాలు

2015 ఏప్రిల్‌లో ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి ఢిల్లీ వచ్చారు. మానవతా సాయం కోరేందుకు భారత విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. తర్వాత ఏడాది సెప్టంబర్‌లో ఉత్తర కొరియా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారత సహాయ మంత్రి ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయానికి వెళ్లారు. దేశంలో ఒక కేంద్ర మంత్రి ఉత్తర కొరియా అధికారిక కార్యక్రమానికి హాజరు కావడం బహుశా అదే మొదటిసారి. రెండు దేశాల వ్యాపార, వాణిజ్య సంబంధాలు ముందు ముందు ఎలా బలోపేతం కానున్నాయి అనే విషయంపై అప్పుడు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు.

2013లో చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత దేశం, ఉత్తర కొరియాకు మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉండేది. భారత్ నుంచి ప్రధానంగా పరిశ్రమల రసాయనాలు, ముడి చమురు, వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ఎండు ఫలాలు, సహజ జిగురు, ఇంగువ లాంటివి దిగుమతి అయ్యేది. 2014లో ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 130 మిలియన్ల డాలర్ల నుంచి 200 మిలియన్ డాలర్ల వరకూ క్షీణించింది. 2017లో క్షిపణి పరీక్షల తర్వాత ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి తాజా ఆంక్షలతో భారత్ దాదాపు అన్ని వ్యాపారాలపై నిషేధం విధించింది.

Image copyright KCNA

‘ఉత్తర కొరియాకు భారత దేశం ఒక కిటికీ’

"ఉత్తర కొరియా దౌత్య సంబంధాలు కొనసాగించిన కొన్ని దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ప్రపంచాన్ని చూడడానికి ఉత్తర కొరియాకు భారత దేశం ఒక కిటికీ లాంటిది. రెండు దేశాల మధ్యా సుదీర్ఘ, సున్నిత సంబంధాలున్నాయి" అని ఢిల్లీలో ఉన్న డిఫెన్స్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్, అనాలసిస్ సభ్యులు, భారత తూర్పు ఆసియా ఒప్పందాల్లో నిపుణులు అయిన ప్రశాంత్ కుమార్ సింగ్ నాకు చెప్పారు.

గత ఏడాది.. ప్యాంగ్‌యాంగ్‌లో తమ దౌత్య ఉనికిని తగ్గించుకోవాలన్న అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్‌సన్ సూచనలను భారత్ తోసిపుచ్చింది. నేరుగా టిల్లర్‌సన్‌ను ఉద్దేశించి మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ "మీకు సమాచారం అందించే ఛానెళ్లు తెరిచి ఉండడానికి, మీ మిత్ర దేశాల రాయబార కార్యాలయాలు మాత్రం అక్కడ ఉండచ్చా" అని ప్రశ్నించారు.

Image copyright KCNA

ట్రంప్, కిమ్ భేటీ విషయంలో భారత్ వైఖరి ఏంటి?

కొరియా ద్వీపకల్పంలో తాజా పరిణామాలను పరిశీలించడానికి మంత్రి వీకే సింగ్‌ను ప్యాంగ్‌యాంగ్ పంపినట్టు కేంద్రం తెలిపింది. శాంతిస్థాపన దిశగా చొరవ చూపుతున్న కొరియాకు భారత్ మద్దతు తెలియజేయడానికే మంత్రి అక్కడకు వెళ్లారంది. అయితే రాబోవు పరిణామాలతో, అనిశ్చితిలో పడిన కిమ్, ట్రంప్ సమావేశంతో సింగ్ పర్యటనకు ఏదైనా సంబంధం ఉందా?

'"ట్రంప్ తన శిఖరాగ్ర సమావేశాన్ని ప్రమాదంలో పడేయడనే మనం అనుకోవాలి. బహుశా ఆ సమావేశం జరగాలని అనుకుంటున్న అమెరికన్లు భారత్ సహకారం కోరుకుంటూ ఉండచ్చు" అంటారు డాక్టర్ సింగ్.

"భారత్ ఇక్కడ కాస్త కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ఈ ప్రాంతంలో సమస్యాత్మకం కానిది, ఉత్తర కొరియాతో మంచి సంబంధాలు ఉన్న ఒకే ఒక ప్రధాన దేశం కూడా భారత దేశమే. ఒంటరి అయిపోయిన వారసత్వ పాలకుడితో చర్చలు జరిపే విషయానికి వస్తే, ఇది అరుదైన విషయమే. ఇక్కడ చిన్న మిత్రుడు కూడా పెద్ద సాయం చేయగలడనేది సుస్పష్టం"

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఉత్తర కొరియా ఒకప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడెందుకు ఇలా ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)