కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా వైరస్.. 23 మంది మృతి

  • 17 మే 2018
ఎబోలా Image copyright AFP/Getty

డీఆర్ కాంగో దేశంలో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ నగర శివార్లలో ఉన్న ఈ వైరస్ తాజాగా మండక నగరంలోకి ప్రవేశించింది. దీన్ని నియంత్రించటం చాలా కష్టమన్న భయాందోళనలు పెరుగుతున్నాయి.

ఈ నెల మొదట్లో ఎబోలా మొదటి కేసు నమోదైన ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలో మండక నగరం ఉంది. దీని జనాభా పది లక్షలు. ఇప్పుడు ఈ నగరంలో కూడా ఎబోలా కేసు నమోదైందని ఆరోగ్య శాఖ మంత్రి ఓలీ లుంగ కలెంగ ధృవీకరించారు.

దేశ రాజధాని నగరం కింషసతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రధాన రవాణా హబ్ మండక నగరం.

ఇప్పటి వరకు 23 మంది ఎబోలా వైరస్‌సోకి చనిపోయారని, మరో 44 మందికి ఇది సోకిందని తెలుస్తోంది.

శరీరంలోపల రక్తస్రావం జరిగి మనిషిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసే ప్రమాదకరమైన అంటు వ్యాధి ఎబోలా. శారీరక స్రావాల కారణంగా ఇది వేగంగా విస్తరిస్తుంది. ఇది సోకితే జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అన్నిసార్లూ అలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు కూడా.

Image copyright AFP/Getty

నగరంలోకి ఎలా వచ్చిందంటే..

2014-16 సంవత్సరాల్లో పశ్చిమాఫ్రికాలో ఎబోలా సోకి 11,300 మంది చనిపోయారు. అప్పట్లో ఈ వ్యాధి గునియా, లైబీరియా దేశాల రాజధాని నగరాలకు వ్యాపించింది.

ఇప్పుడు మండక నగరానికి ఈ వ్యాధి వ్యాపించటం అంటే ఇది వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) సీనియర్ అధికారి పీటర్ సలామ చెప్పారు.

ఇప్పటి వరకూ 44 కేసుల్లో ముగ్గురికి మాత్రమే ఈ వైరస్ సోకిందని, వారంతా ఇంకా జీవించే ఉన్నారని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. మరో 20 ఎబోలా కాగల కేసులు, 20 అనుమానాస్పద కేసులు ఉన్నాయి.

ఈ కేసులు మరిన్ని పెరగకుండా చూసేందుకు మండక నగరంలో ఎబోలా కేసుల నిర్వహణ సదుపాయాలను, ఏకాంతవాస ఏర్పాట్లను చేశామని సలామ తెలిపారు.

నగరానికి దక్షిణాన ఉన్న బికోరో ప్రాంతంలో ఒక ఎబోలా వ్యాధిగ్రస్తుడి అంత్యక్రియలకు హాజరైన ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ద్వారా ఇది మండకలోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు.

బుధవారం నాలుగువేల ప్రయోగాత్మక వ్యాక్సిన్‌లను డబ్ల్యుహెచ్ఓ కింషస నగరానికి పంపించింది. మరిన్ని వ్యాక్సిన్లను త్వరలో పంపించనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)