దక్షిణ చైనా సముద్రం: వివాదాస్పద ప్రాంతంలో బాంబర్లను దించిన చైనా

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, eng.chinamil.com.cn

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద భూభాగంలో చైనా వైమానికదళం తొలిసారిగా బాంబు దాడులకు ఉపయోగించే యుద్ధవిమానాలను దించింది.

వివాదాస్పద ప్రాంతంలోని దీవులు, రీఫ్‌లలో చైనా ఈ యుద్ధవిమానాలతో విన్యాసాలు నిర్వహించింది. వీటిలో ఎక్కువ దూరంలోని లక్ష్యాలపై దాడులకు ఉపయోగించే హెచ్-6కే బాంబర్ కూడా ఉంది.

దక్షిణ చైనా సముద్రంలో దాదాపు ఎవరూ నివసించని దీవుల సముదాయాలు పరాసెల్స్, స్ప్రాట్లిస్‌లపై సార్వభౌమాధికారం ఎవరిదనే విషయంలో చైనా, ఇతర దేశాల మధ్య సుదీర్ఘకాలంగా వివాదం నెలకొంది.

ఈ రెండు సముదాయాల్లోని అత్యధిక భూభాగం తమదేనని చైనా వాదిస్తోంది. దీనిపై తమకు వందల ఏళ్లుగా హక్కులు ఉన్నాయని చెబుతోంది.

ఫొటో సోర్స్, GOOGLE/DIGITAL GLOBE

ఫొటో క్యాప్షన్,

వూడీ ఐలాండ్‌పై చైనా హెచ్-6కే బాంబర్ దిగినట్లు ఏఎంటీఐ తెలిపింది.

ఈ వివాదాస్పద ప్రాంతం నౌకల రవాణాకు కీలకమైనది. ఇక్కడ అపార మత్స్య సంపద ఉంది.

పెద్ద మొత్తంలో చమురు, సహజయవాయువు నిక్షేపాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. ఈ ప్రాంతం మీద సార్వభౌమాధికారంపై చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, మలేషియా, బ్రూనై దేశాల మధ్య వివాదం ఉంది.

తన వాదనకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ప్రాబల్యం పెంచుకొనేందుకు చైనా ఇక్కడ సైనికపరమైన చర్యలు చేపడుతోందని ఇతర దేశాలు ఆరోపిస్తున్నాయి.

ఇప్పుడు చైనా బాంబర్లను మోహరించడం ఉద్రిక్తతలకు దారితీసే ఆస్కారముంది.

పరాసెల్ దీవుల సముదాయంలో అతి పెద్ద దీవి అయిన వూడీ ఐలాండ్‌లోని ఒక స్థావరంలో హెచ్-6కే దిగడం, అక్కడి నుంచి టేకాఫ్ కావడం ఒక వీడియోలో కనిపించిందని 'ఆసియా మారిటైమ్ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ (ఏఎంటీఐ)' నిపుణులు తెలిపారు. చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రికైన 'పీపుల్స్ డైలీ'కి చెందిన ఒక వీడియోను ఉటంకిస్తూ ఈ విషయం చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దీవుల సముదాయాలైన పరాసెల్స్, స్ప్రాట్లిస్‌లపై సార్వభౌమాధికారం ఎవరిదనే విషయంలో చైనా, ఇతర దేశాల మధ్య సుదీర్ఘకాలంగా వివాదం ఉంది.

వూడీ ఐలాండ్‌పై చైనా గతంలోనూ యుద్ధవిమానాలను మోహరించిందని, అయితే బాంబర్లను దించడం మాత్రం ఇదే తొలిసారని ఏఎంటీఐ తెలిపింది. వూడీ ఐలాండ్‌ నుంచి ఆగ్నేయాసియాలోని అన్ని ప్రాంతాలనూ హెచ్-6కే బాంబర్ చేరుకోగలదని వివరించింది.

బాంబర్లను ఎక్కడ దించిందీ చైనా రక్షణశాఖ నిర్దిష్టంగా చెప్పలేదు. విన్యాసాల్లో భాగంగా సముద్ర జలాల్లోని లక్ష్యాలపై దాడులు జరపడంపై సైనికులు శిక్షణ పొందుతున్నట్లు తెలిపింది.

నిజమైన యుద్ధంలో మరింత సమర్థవంతంగా పోరాడేందుకు అవసరమైన నైపుణ్యాలను ఈ విన్యాసాలు ఇస్తాయని ఒక హెచ్-6కే యుద్ధవిమానం పైలట్ అయిన జీ డాక్వింగ్ వ్యాఖ్యానించినట్లు ఒక ప్రకటన పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

వూడీ ఐలాండ్‌ను చైనా 'యాంగ్జింగ్' అని వ్యవహరిస్తుంది. ఈ దీవి తమదని వియత్నాం, తైవాన్ కూడా వాదిస్తున్నాయి.

స్ప్రాట్లిస్‌ దీవుల సముదాయంపైనా చైనా త్వరలో హెచ్-6కే బాంబర్లను మోహరించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ రీఫ్‌లపై చైనా ఇప్పటికే రన్‌వేలు, హ్యాంగర్లు నిర్మించింది.

స్ప్రాట్లిస్‌ నుంచైతే హెచ్-6కే బాంబర్లు ఉత్తర ఆస్ట్రేలియాను, లేదా పసిఫిక్ తీరంలోని అమెరికా భూభాగం గ్వామ్‌పై ఉన్న అమెరికా సైనిక స్థావరాలను చేరుకోగలవని ఏఎంటీఐ నిపుణులు తెలిపారు.

దక్షిణ చైనా సముద్రంలో చైనా 'నిర్మించిన దీవుల' సమీపంలోకి అమెరికా తన యుద్ధవిమానాలను తరలించింది.

అమెరికా ఆగ్రహం

వివాదాస్పద ప్రాంతంలో చైనా బాంబర్ల మోహరింపుపై అమెరికా ఆగ్రహం వ్యక్తంచేసింది. చైనా తన చర్యలతో దక్షిణ చైనా సముద్రంతో ముడిపడిన ప్రాంతాన్ని అస్థిరపరుస్తోందని ఆరోపించింది.

చైనా చర్యలతో ఉద్రిక్తతలు తలెత్తుతాయని అమెరికా రక్షణశాఖ ప్రతినిధి రాయిటర్స్ వార్తాసంస్థతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)