నేటి ముఖ్యాంశాలు: ఇరాక్‌ ఎన్నికల్లో జాతీయవాద కూటమికి అత్యధిక స్థానాలు

  • 20 మే 2018
Image copyright Getty Images
చిత్రం శీర్షిక మోఖ్తాదా సదర్

ఇరాక్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఒక షియా మిలీషియా మాజీ అధినేత అయిన మొఖ్తాదా సదర్ నేతృత్వంలోని జాతీయవాద 'సేరౌన్' కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపొందింది.

ఇరాక్‌పై అమెరికా దాడికి వ్యతిరేకంగా ఇరాక్‌లో రెండు తిరుగుబాట్లకు మొఖ్తాదా సదర్ లోగడ నాయకత్వం వహించారు.

ఇరాక్ వ్యవహారాల్లో ఇరాన్ ప్రమేయాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎన్నికల్లో మొఖ్తాదా సదర్ పోటీచేయలేదు. కాబట్టి ఆయన ప్రధానమంత్రి కాలేరు. అయితే ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ఇరాన్ మద్దతున్న ఆయన ప్రత్యర్థుల కారణంగా ఆయన పలు సంవత్సరాలుగా ఇరాక్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించలేకపోయారు.

Image copyright Getty Images

కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామా

కర్ణాటకలో బీఎస్ యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు.

కర్ణాటక అసెంబ్లీలో శనివారం సాయంత్రం 4 గంటలలోపు బల పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు సూచించింది. దీంతో ఉదయం నుంచీ పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రొటెం స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్, జేడీఎస్‌లు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ప్రొటెం స్పీకర్‌కి ఇప్పుడు నోటీసులు ఇస్తే బల పరీక్షకు మరింత సమయం పడుతుందని కోర్టు చెప్పడంతో కాంగ్రెస్ , జేడీఎస్‌లు వెనక్కి తగ్గాయి.

చివరకు యడ్యూరప్ప అసెంబ్లీలో ప్రసంగం అనంతరం బలపరీక్షకు వెళ్లకుండానే తన పదవికి రాజీనామా ప్రకటించారు.

Image copyright eng.chinamil.com.cn
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ చైనా సముద్రం: వివాదాస్పద ప్రాంతంలో బాంబర్లను దించిన చైనా

దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద భూభాగంలో చైనా వైమానికదళం తొలిసారిగా బాంబు దాడులకు ఉపయోగించే యుద్ధవిమానాలను దించింది.

వివాదాస్పద ప్రాంతంలోని దీవులు, రీఫ్‌లలో చైనా ఈ యుద్ధవిమానాలతో విన్యాసాలు నిర్వహించింది. వీటిలో ఎక్కువ దూరంలోని లక్ష్యాలపై దాడులకు ఉపయోగించే హెచ్-6కే బాంబర్ కూడా ఉంది.

దక్షిణ చైనా సముద్రంలో దాదాపు ఎవరూ నివసించని దీవుల సముదాయాలు పరాసెల్స్, స్ప్రాట్లిస్‌లపై సార్వభౌమాధికారం ఎవరిదనే విషయంలో చైనా, ఇతర దేశాల మధ్య సుదీర్ఘకాలంగా వివాదం నెలకొంది.

ఈ రెండు సముదాయాల్లోని అత్యధిక భూభాగం తమదేనని చైనా వాదిస్తోంది. దీనిపై తమకు వందల ఏళ్లుగా హక్కులు ఉన్నాయని చెబుతోంది.

హ్యారీ, మేఘన్ మార్కెల్
చిత్రం శీర్షిక హ్యారీ, మేఘన్ మార్కెల్

ఘనంగా బ్రిటన్ రాకుమారుడు హ్యారీ వివాహం

బ్రిటన్ రాకుమారుడు హ్యారీ, మేఘన్ మార్కెల్‌ల వివాహం బ్రిటన్ వేసవి కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం (భారత్‌లో సాయంత్రం) ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది.

బెర్క్‌షైర్ కౌంటీలోని విన్సర్ పట్టణంలోని రాజ భవనం విన్సర్ క్యాజిల్‌ ఈ వివాహ వేడుకకు వేదిక.

విన్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్స్ ఛాపెల్‌లో ఎలిజబెత్ రాణి, 600 మంది అతిథుల సమక్షంలో వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు.

ఇప్పటివరకున్న రాజకుటుంబ సంప్రదాయానికి భిన్నంగా హ్యారీ పెళ్లి ఉంగరం ధరించారు. వధూవరులు ప్రమాణాలు చేసే సమయంలో ''విధేయురాలై ఉంటాను'' అనే మాటను మేఘన్ మార్కెల్ ఉచ్చరించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)