వెనెజువెలా: ఒకప్పటి బస్‌డ్రైవరే మరోసారి అధ్యక్షుడవుతారా?

  • 20 మే 2018
నికోలస్ మడూరో Image copyright Reuters
చిత్రం శీర్షిక నికోలస్ మడూరో

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న లాటిన్ అమెరికా దేశం వెనెజువెలాలో ఈ రోజు (ఆదివారం) అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు, 'యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలా' సారథి అయిన నికోలస్ మడూరో తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుత ఎన్నికలను దాదాపు విపక్షాలన్నీ బహిష్కరించాయి. ఎన్నికల్లో పాలకపక్షం పెద్ద యెత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు మడూరో ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

మడూరోకు 55 సంవత్సరాలు. ఒకప్పుడు బస్ డ్రైవర్‌గా పనిచేశారు. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో సుదీర్ఘకాలం చురుగ్గా పాల్గొన్నారు. 2013 మార్చి 5న దేశాధ్యక్షుడు హ్యూగో చావెజ్ కన్నుమూసినప్పుడు మడూరో తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతకు ముందు హ్యూగో చావెజ్ ప్రభుత్వంలో ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.

మడూరో 2013 ఏప్రిల్ 14న స్వల్ప ఆధిక్యంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2019 వరకు ఉంది.

ఈ ఏడాది డిసెంబరులో జరుగుతాయనుకున్న అధ్యక్ష ఎన్నికలను జాతీయ రాజ్యాంగ సభ ముందుకు జరిపింది. రాజ్యాంగ సభలో అందరూ మడూరో మద్దతుదారులే ఉన్నారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు ఈ సభ ఏర్పాటైంది.

విపక్ష కూటమి 'డెమొక్రటిక్ యూనిటీ'లో విభేదాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ప్రయోజనం పొందేందుకే ఎన్నికలను మడూరో ముందుకు జరిపించారని ఈ కూటమి ఆరోపిస్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హ్యూగో చావెజ్ చిత్రం వద్ద మడూరో

మడూరోకు పోటీయే లేరా?

విపక్ష కూటమికి చెందిన ఇద్దరు కీలక అభ్యర్థులను ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించారు. మరికొందరు నాయకులు దేశం విడిచి పారిపోయారు.

విపక్షాల అభ్యర్థులు కొందరు బరిలో ఉన్నా, హెన్రీ ఫాల్కన్ తప్ప ఎవ్వరూ మడూరోకు ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదు.

మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ హయాంలో ఫాల్కన్ గవర్నర్‌గా పనిచేశారు. ఒకప్పుడు మడూరో, ఫాల్కన్ ఇద్దరూ ఒకే పార్టీలో ఉండేవారు. ఫాల్కన్ 2010లో 'యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలా'ను వీడి విపక్షంలో చేరారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హెన్రీ ఫాల్కన్

దాదాపు విపక్షాలన్నీ ఈ ఎన్నికలను బహిష్కరించినప్పటికీ, తాను ఎన్నికల్లో పోటీ పడడాన్ని ఫాల్కన్ సమర్థించుకున్నారు. మడూరోను గద్దె దింపడానికి ఇదొక్కటే మార్గమని చెప్పారు.

మడూరో ఓడిపోవాలని ప్రజల్లో అత్యధికులు కోరుకొంటున్నారని, వారి కోరిక నెరవేరాలంటే తాను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరముందని ఫాల్కన్ తెలిపారు. విపక్ష నాయకులు కొందరు ఆయన్ను 'ద్రోహి' అని విమర్శించారు.

బహిష్కరణకు నిరుటి ఫలితాలూ కారణమే

నిరుడు 23 రాష్ట్రాల్లో గవర్నర్‌ పదవులకు ఎన్నికలు జరగ్గా, 17 రాష్ట్రాల్లో మడూరో పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని విపక్షం ఆరోపించింది. ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించడానికి నాటి ఫలితాలు ఒక కారణం.

వెనెజువెలాలో ఓటింగ్ యంత్రాలు తయారుచేసే కంపెనీ గవర్నర్ పదవులకు ఎన్నికలకు ముందు జులైలో కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కల్లో తారుమారు జరిగిందని సంస్థ వెల్లడించింది.

ఎన్నికల కమిషన్‌లో అత్యధికులు ప్రభుత్వ మద్దతుదారులే. రాజ్యాంగ సభ సభ్యులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఇతరులు ఇందులో ఉన్నారు.

ఆంక్షల విధింపుపై ఈయూ, అమెరికా హెచ్చరికలు

ఎన్నికల నిష్పాక్షికతపై అనుమానాల నేపథ్యంలో, ఐరోపా సమాఖ్య(ఈయూ), అమెరికా, ఇతర అంతర్జాతీయ పరిశీలక సంస్థలు వెనెజువెలాకు హెచ్చరికలు చేశాయి. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

వెనెజువెలా పొరుగు దేశాలు కొన్ని తాజా ఎన్నికల ఫలితాలను గుర్తించకపోవచ్చు. ఈ అనిశ్చితి నేపథ్యంలో చాలా మంది ఓటర్లు అసలు ఓటింగ్‌లోనే పాల్గొనకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఇది మే 16న తీసిన చిత్రం. వీరిలా నిత్యం వేల మంది ప్రజలు వెనెజువెలాను వీడి కొలంబియాకు వెళ్లిపోతున్నారు. ఇది కొన్ని నెలలుగా జరుగుతోంది.

ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి?

మడూరో ప్రభుత్వం వచ్చాక వెనెజువెలా ఆర్థిక మాంద్యంలో చిక్కుకొంది. ప్రజలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా వెనెజువెలా కరెన్సీ అయిన బొలివర్‌ విలువ పాతాళానికి చేరుకుంది. ఏదైనా కొనాలంటే ఎక్కువ మొత్తంలో కరెన్సీ నోట్లను ఉపయోగించాల్సి వస్తోంది.

ఆహారం, ఔషధాలు వంటి కనీస అవసరాలు తీర్చుకొనేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 70 శాతానికి పైగా చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా వెనెజువెలా కరెన్సీ 'బొలివర్‌' విలువ నామమాత్రమైపోయింది. ఏదైనా కొనాలంటే ఎక్కువ సంఖ్యలో కరెన్సీ నోట్లు అవసరమవుతున్నాయి. ఒక మనిషి రోజువారీ అవసరాలు, కార్యకలాపాల కోసం ఒక బస్తా డబ్బు అవసరమవుతోంది. సాధారణ ఉద్యోగులు చిన్నారులకు నాప్ కిన్స్ కొనడానికి నాలుగు నెలల జీతం ఖర్చు చేయాల్సి వస్తోంది.

దేశవ్యాప్తంగా కరెన్సీ నోట్లకు కొరత ఏర్పడింది. డబ్బు కోసం ప్రజలు బ్యాంకుల బయట బారులు తీరుతున్నారు. కానీ బ్యాంకుల్లో కూడా సరిపడా డబ్బు లేదు.

జీవనం అంతకంతకూ కష్టంగా మారుతుండటంతో లక్షల మంది ప్రజలు దేశం వీడారు. వలసలు కొనసాగుతున్నాయి. వెనెజువెలా వీడినవారిలో అత్యధికులు పొరుగు దేశాలైన కొలంబియా, బ్రెజిల్‌లకు చేరుకున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవెనెజువెలా: పిల్లల నాప్కిన్ కొనాలంటే నాలుగు నెలల జీతం ఖర్చు పెట్టాలి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)