వెనెజువెలా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన నికోలస్ మడూరో.. అక్రమాలు జరిగాయంటున్న విపక్షాలు

విజయం అనంతరం భార్యతో కలిసి మడూరో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

విజయానంతరం భార్యతో కలిసి మద్దతుదారులతో మాట్లాడుతున్న మడూరో

వెనెజువెలా అధ్యక్షుడిగా నికోలస్ మడూరో మరోసారి ఎన్నికయ్యారు.

మడూరో నేతృత్వంలోని పాలక పక్షం ఎన్నికల అక్రమాలకు పాల్పడుతుందన్న విపక్షాల ఆరోపణలు, బహిష్కరణల మధ్య ఆదివారం జరిగిన పోలింగ్‌లో అతి తక్కువ ఓటింగ్ నమోదైంది.

మునుపెన్నడూ లేనట్లుగా కేవలం 46 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాగా మడూరోకు 67.7 శాతం అంటే 58 లక్షల ఓట్లు రాగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి హెన్రీ ఫాల్కన్‌కు 18 లక్షల ఓట్లు(21.2 శాతం) లభించినట్లు వెనెజువెలా నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ చీఫ్ తిబిసే లూసెనా ప్రకటించారు.

‘మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’

మడూరో ఎన్నికైనట్లు తెలిసిన తరువాత ఫాల్కన్ స్పందిస్తూ.. ''ఈ ఎన్నికను మేం గుర్తించడం లేదు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి'' అన్నారు.

ప్రభుత్వం సరఫరా చేసే ఆహార వస్తువులు పొందడానికి జారీ చేసే కార్డులను అడ్డం పెట్టుకుని మడూరోకు అనుకూలంగా ఆయన మద్దతుదారులు రిగ్గింగ్ జరిపారని ఫాల్కన్ ఆరోపించారు.

వెనెజువెలాలో ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికే అవమానకరం అంటూ 'ఐరాసలోని అమెరికా ప్రతినిధి వర్గం' ట్వీట్ చేసింది.

నిజానికి ఈ ఎన్నికలు 2018 డిసెంబరులో జరగాల్సి ఉండగా ముందుకు జరిపారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

మడూరో మద్దతుదారుల ఆనందం

బస్ డ్రైవర్ నుంచి అధ్యక్షుడి వరకు..

వెనెజువెలా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన 'యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలా' సారథి నికోలస్ మడూరోకు 55 ఏళ్లు.

ఒకప్పుడు బస్ డ్రైవర్‌గా పనిచేశారు. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో చాలాకాలం చురుగ్గా పాల్గొన్నారు.

హ్యూగో చావెజ్ ప్రభుత్వంలో ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.

2013 మార్చి 5న చావెజ్ కన్నుమూసినప్పుడు మడూరో తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

విజయం తరువాత మద్దతుదారులతో కలిసి చిందేస్తున్న మడూరో

ఎన్నికలను ముందుకు జరిపి..

2013 ఏప్రిల్ 14న స్వల్ప ఆధిక్యంతో అధ్యక్షుడిగా ఎన్నికైన మడూరో పదవీకాలం 2019 వరకు ఉంది.

కానీ, ఈ ఏడాది డిసెంబరులో జరుగుతాయనుకున్న అధ్యక్ష ఎన్నికలను జాతీయ రాజ్యాంగ సభ ముందుకు జరిపింది. రాజ్యాంగ సభలో అందరూ మడూరో మద్దతుదారులే ఉన్నారు.

విపక్ష కూటమి 'డెమొక్రటిక్ యూనిటీ'లో విభేదాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ప్రయోజనం పొందేందుకే ఎన్నికలను మడూరో ముందుకు జరిపించారని ఈ కూటమి ఆరోపిస్తోంది.

విపక్ష కూటమికి చెందిన ఇద్దరు కీలక అభ్యర్థులను ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించారు. మరికొందరు నాయకులు దేశం విడిచి పారిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

హెన్నీ ఫాల్కన్

విపక్షాల నుంచి ఒకే ఒక్కడు

ప్రధాన విపక్ష అభ్యర్థి హెన్రీ ఫాల్కన్.. హ్యూగో చావెజ్ హయాంలో ఫాల్కన్ గవర్నర్‌గా పనిచేశారు.

ఒకప్పుడు మడూరో, ఫాల్కన్ ఇద్దరూ ఒకే పార్టీలో ఉండేవారు. ఫాల్కన్ 2010లో 'యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలా'ను వీడి విపక్షంలో చేరారు.

దాదాపు విపక్షాలన్నీ ఈ ఎన్నికలను బహిష్కరించినప్పటికీ, తాను ఎన్నికల్లో పోటీ పడడాన్ని ఫాల్కన్ సమర్థించుకున్నారు. మడూరోను గద్దె దింపడానికి ఇదొక్కటే మార్గమని చెప్పారు.

మడూరో ఓడిపోవాలని ప్రజల్లో అత్యధికులు కోరుకొంటున్నారని, వారి కోరిక నెరవేరాలంటే తాను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరముందని ఫాల్కన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)