ఎంత తిన్నామన్నదే కాదు.. ఎప్పుడు తిన్నామన్నదీ ముఖ్యమే!

చిరుతిండి తింటున్న యువతి

ఫొటో సోర్స్, iStock

పొద్దున పూట రాజులా పుష్టిగా తినాలి, మధ్యాహ్నం పూట మంత్రిలా ఆలోచించి తినాలి, రాత్రిపూట బంటులా కొద్దిగా తినాలి అని చెబుతుంటారు. ఆ మాటలో ఎంత వరకూ నిజముందో, మనం ఆహారం తీసుకునే వేళల ప్రభావం ఆరోగ్యంపై, ముఖ్యంగా ఊబకాయంపై ఎలా ఉంటుందో తెలుసుకునేందకు శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు సాగిస్తున్నారు.

ఉదయం పూట ఎక్కువగా తినడం, నిద్రపోవడానికి చాలాసేపటి ముందే భోజనాన్ని ముగించడం ద్వారా ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పడుతుందని చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఒక పరిశోధన ప్రకారం బరువు తగ్గడానికి ప్రయత్నించే మహిళలు త్వరగా భోజనం చేయడం వల్ల సానుకూల ఫలితాలు కనిపించాయని తేలింది. ఆలస్యంగా అల్పాహారం తీసుకునేవాళ్లలో బీఎంఐ ఎక్కువగా నమోదవుతున్నట్లు కూడా మరో పరిశోధన ద్వారా తెలుస్తోంది.

‘ఉదయం రాజులా, మధ్యాహ్నం మంత్రిలా, రాత్రి బంటులా తినాలని పాత సామెత ఒకటి చెబుతోంది. అందులో చాలావరకు నిజముందని నా నమ్మకం’ అంటారు లండన్‌లోని కింగ్స్ కాలేజీలో న్యూట్రిషినల్ సైన్సెస్ లెక్చరర్‌గా సేవలందిస్తున్న డాక్టర్ గెర్డా పాట్.

ఇప్పుడు భోజన వేళలకూ, బాడీ క్లాక్‌కు మధ్య ఉన్న సంబంధం గురించి కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

రాత్రిపూట ఎక్కువ తింటే ఎందుకు అరగదు?

సాధారణంగా మన అలవాట్లకు తగ్గట్లే మన జీవ గడియారం(బాడీ క్లాక్) కూడా ఉంటుంది. రోజూ దాదాపు ఒకే సమయానికి నిద్ర లేవడం, నిద్ర రావడం లాంటివన్నీ బాడీ క్లాక్‌ పనిలో భాగమే.

ఆ సమయానికి రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల స్థాయుల లాంటివాటిని నియంత్రించడం ద్వారా శరీరంలో ఏ క్రియ చోటు చేసుకోవాలనే సూచనలను బాడీ క్లాక్ అందిస్తుంది. క్రమం తప్పకుండా ఒకే పనిని ఒకే సమయానికి చేయడం ద్వారా మన జీవ గడియారం ఆ సమాచారాన్ని నిక్షిప్తం చేసుకొని దానికి తగ్గట్లే స్పందిస్తుంది.

నిద్ర మాదిరిగానే భోజన వేళలు కూడా జీవ గడియారాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని ‘క్రోనో న్యూట్రిషన్’ అని పిలుస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

‘ప్రతి 24గంటలకూ ఏ జీవ క్రియ ఏ సమయానికి జరగాలనే సందేశాన్ని జీవ గడియారం శరీరానికి అందిస్తుంది. అందుకే రాత్రి పూట ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకపోవడం మంచిది. అప్పటికే నిద్రకు సమయం ఆసన్నమైందనే సందేశాన్ని జీవగడియారం శరీరానికి అందించి ఉంటుంది. దాంతో జీవక్రియల వేగం తగ్గిపోతుంది. ఫలితంగా అరుగుదల కూడా మందగిస్తుంది’ అని ప్రొఫెసర్ గెర్డా అన్నారు.

‘రాత్రి వేళలో ఆహారం అంత సులువుగా అరగదని తెలుస్తున్నా, అలా ఎందుకు జరుగుతుందన్న కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలీదు’ అని సర్రే యూనివర్సిటీకి చెందిన క్రోనో బయోలాజీ నిపుణుడు డాక్టర్.జొనాథన్ జాన్‌స్టన్ తెలిపారు. ఉదయంపూట తీసుకున్న ఆహారం అరగడం కంటే, రాత్రుళ్లు తీసుకున్న ఆహారం అరగడానికి తక్కువ శక్తి ఖర్చవుతుందనీ, అందుకే రాత్రుళ్లు ఎక్కువ తినడం వల్ల కెలొరీలు పేరుకునే అవకాశం ఉందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైనట్లు జొనాథన్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వివిధ షిఫ్టుల్లో పనిచేసేవారిపై భోజన వేళల ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇంకా తేలలేదు

భోజనం ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినకూడదు?

అందుకే ప్రతిసారీ మనం తీసుకునే ఆహారాన్ని మార్చుకోవాల్సిన పనిలేదనీ, భోజన వేళల్లో మార్పులు చేసుకుంటే సత్ఫలితాలు అందుతాయనీ ఆయన అంటున్నారు.

ఈ భోజన వేళలకు సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభించలేదు.

ఉదాహరణకు భోజనం ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినకూడదు? వివిధ షిఫ్టుల్లో పనిచేసేవారిపై భోజన వేళల ప్రభావం ఎలా ఉంటుంది? ఏవైనా కొన్ని రకాల పదార్థాలను కొన్ని వేళల్లోనే తీసుకోవాలా? లాంటి ప్రశ్నలకు పూర్తిస్థాయిలో జవాబు దొరకలేదు.

మొత్తానికి పగటి వేళలోనే శరీరానికి ఎక్కువ కెలొరీలు అందించాలనీ, అందులోనూ భోజన సమయంలో ఎక్కువ ఆహారం తీసుకోవాలనీ ప్రొఫెసర్ జొనాథన్, ప్రొఫెసర్ గెరాట్‌లు సూచించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)