అంతర్జాతీయ ముఖ్యాంశాలు: ‘చర్చిని, దాని ఖ్యాతిని రక్షించాలని’.. చిన్నపిల్లలపై వేధింపుల్ని దాచిపెట్టిన కేసులో దోషిగా తేలిన ఆస్ట్రేలియా ఆర్చిబిషప్

ఫొటో సోర్స్, CATHOLIC ARCHDIOCESE OF ADELAIDE
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్లో 1970ల్లో నలుగురు బాలలపై ఓ మతగురువు లైంగిక వేధింపులకు పాల్పడిన అంశాన్ని దాచిపెట్టిన కేసులో అడిలైడ్ ఆర్చిబిషప్ ఫిలిప్ విల్సన్ దోషి అని న్యూకేస్టిల్ స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది.
పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో శిక్షకు గురికానున్న అత్యంత సీనియర్ ఆర్చిబిషప్ ఈయనే.
1970లో పీడోఫైల్లో మతాచార్యుడిగా ఉన్న జేమ్స్ ఫ్లెచర్ నలుగురు అబ్బాయిలను లైంగికంగా వేధించారు. ఈ కేసులో ఆయన 2004లో దోషిగా తేలారు. 2006లో ఆయన జైలులోనే మృతిచెందారు.
ఘటన జరిగే నాటికి అక్కడ సహాయ మతాచార్యుడిగా ఉన్న విల్సన్ ఈ వేధింపుల గురించి తనకేమీ తెలియదని దాచిపెట్టారన్నది ఆరోపణ.
కానీ, బాధితుల్లో ఒకరు ఈ మొత్తం వ్యవహారాన్ని విల్సన్‌కు చెప్పానని చెప్పడంతో ఆయన దాచిపెట్టినట్లుగా రుజువైంది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.
‘‘బాధితుడు చేస్తోంది విశ్వసనీయ ఆరోపణేనని మతబోధకుడికి తెలుసు. అయినప్పటికీ చర్చిని, దాని ఖ్యాతిని రక్షించాలని ఆయన భావించాడు’’ అని మేజిస్ట్రేట్ స్టోన్ తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
నికోలస్ మడూరో
వెనెజువెలా ఎన్నికలు: రాయబారులను స్వదేశాలకు పిలిచిన 14 దేశాలు
వెనెజువెలా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన నికోలస్ మడూరో అంతర్జాతీయంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విపక్షాలు కొన్ని ఎన్నికలను బహిష్కరించినా వెనక్కు తగ్గకుండా ఎన్నికలు జరిపి మళ్లీ అధ్యక్షుడైన మడూరో తీరును పలు దేశాలు నిరసిస్తున్నాయి.
అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా సహా 14 దేశాలు తమ రాయబారులను వెనెజువెలా నుంచి వెనక్కు పిలిపించాయి.
మడూరో గెలిచిన తరువాత అమెరికా ఆ దేశంపై కొత్తగా ఆర్థిక ఆంక్షలు విధించింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
జావెద్ జారిఫ్
ఆంక్షలు విధిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు: అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
కనీవినీ ఎరుగనంతగా ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధిస్తామన్న అమెరికా ప్రకటనను ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జారిఫ్ ఖండించారు.
అమెరికా తన విఫల విధానాల్లో బందీగా చిక్కుకుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చర్యలు స్పష్టం చేస్తున్నాయని, అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఐరోపా సమాఖ్య విదేశాంగ విధాన అధిపతి ఫెడరికా మాగరిని కూడా అమెరికా తీరుపై విమర్శలు కురిపించారు. 2015 నాటి అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం మధ్యప్రాచ్య భద్రతకు ఎలా ఉపయోగమన్నది పాంపియో చెప్పలేకపోయారన్నారు.
కాగా 2015 అణు ఒప్పందం తరువాత ఇరాన్‌పై అమెరికా ఎత్తివేసిన ఆంక్షలను మళ్లీ అమల్లోకి తెస్తామని.. మరిన్ని కొత్త నిర్ణయాలతో ఇరాన్ ప్రభుత్వంపై మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఆర్థికంగా ఒత్తిడి తెస్తామని పాంపియో ఇటీవల ప్రకటించారు.
ఫొటో సోర్స్, Getty Images
మైక్ పెన్స్
'ట్రంప్'తో ఆటలాడొద్దు: ఉత్తరకొరియాకు అమెరికా వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆటలాడొద్దంటూ ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను హెచ్చరించారు.
వచ్చే నెలలో ట్రంప్, కిమ్‌ల భేటీ జరిగే అవకాశాలున్న నేపథ్యంలో పెన్స్ 'ఫాక్స్ న్యూస్'కు ఇంటర్య్వూ ఇచ్చారు.
ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'ట్రంప్‌తో ఆడుకోవచ్చనుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు ఇంకోటి ఉండదు' అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)