కాన్సస్ కాల్పులు: ‘అవును.. కూచిభొట్ల శ్రీనివాస్‌ను నేనే చంపా’.. నేరం అంగీకరించిన ఆడమ్ పురింటన్

కూచిభొట్ల శ్రీనివాస్, ఆయన భార్య సునన్య
ఫొటో క్యాప్షన్,

భార్య సునన్యతో కూచిభొట్ల శ్రీనివాస్ (పాత చిత్రం)

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్య కేసులో ప్రభుత్వం మోపిన ద్వేష పూరిత నేరాభియోగాలను 52 ఏళ్ల ఆడమ్ పురింటన్ అంగీకరించాడు.

గతేడాది ఫిబ్రవరిలో కాన్సస్‌ రాష్ట్రం ఒలేథ్ నగరంలోని ఒక బార్‌లో కూచిభొట్ల శ్రీనివాస్‌ను హత్య చేసిన పురింటన్ అలోక్ మాడసానిని గాయపర్చాడు.

తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లి జీపీఎస్ తయారు చేసే గర్మిన్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఈ ఇద్దరినీ ‘తీవ్రవాదులు’ అని సంబోధిస్తూ.. ‘నా దేశం విడిచిపొండి’ అని అరిచాడు. అనంతరం వారిపై కాల్పులకు దిగాడు.

ఈ హత్య కేసులో పురింటన్‌కు ఇప్పటికే పెరోల్ లేని 50 ఏళ్ల జైలు శిక్ష పడింది.

ఈ సంఘటనను ప్రపంచవ్యాప్తంగా అంతా ఖండించారు. శ్రీనివాస్ హత్యోదంతం భారతీయ అమెరికన్లను షాక్‌కు గురి చేసింది.

ఇద్దరు భారతీయులను ‘‘వాళ్ల జాతి, రంగు, మతం వల్లనే’’ పురింటన్ లక్ష్యంగా చేసుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.

పురింటన్‌కు ద్వేషపూరిత నేరాభియోగాల కింద పెరోల్‌ లేకుండా జీవిత ఖైదు విధించాలని ప్రాసిక్యూషన్, డిఫెన్స్‌ న్యాయవాద బృందాలు సంయుక్తంగా కోరాయి.

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్,

ఈ కాల్సుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ చనిపోగా, అలోక్ మేడసాని (మధ్యలో), ఇయాన్ గ్రిల్లాట్ గాయపడ్డారు

కాగా, ఇంజనీర్లు ఇద్దరినీ ఇరాన్‌ దేశస్తులుగా భావించి, వారిపై కాల్పులు జరిపానని పురింటన్ చెప్పాడు.

‘నా దేశం విడిచిపొండి’ అని అరిచేముందు వారిద్దరూ అమెరికాలో ఉండేందుకు చట్టబద్ధత ఉందా అని పురింటన్ ఆరా తీశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

అలా అరచిన తర్వాత పురింటన్ తన ఇంటికి వెళ్లి, ఒక గన్‌ తీసుకుని బార్‌కు వచ్చి ఇద్దరు భారతీయులపై కాల్పులు జరిపాడు.

కాగా, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఇయాన్ గ్రిల్లాట్ అనే 24 ఏళ్ల వ్యక్తి కూడా ఈ సంఘటనలో గాయపడ్డాడు.

‘‘విద్వేష నేరాలు చెడ్డ పనులు. బాధితులకు, వారి కుటుంబాలకు జరిగిన హాని పూడ్చలేనిది. దాన్ని మేం సరిచేయలేం. అయితే, ఈ కేసులో సరైన శిక్ష పడేలాగా చేయటం ద్వారా వారికి కొంత స్వాంతన చేకూర్చగలం’’ అని తాత్కాలిక అసోసియేట్ అటార్నీ జనరల్ జెస్సీ పనుక్కియో ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)