బ్రెజిల్: ఈ జైళ్లకు కాపలా ఉండదు.. కఠిన నిబంధనలూ ఉండవు!

ఫొటో సోర్స్, GUSTAVO OLIVEIRA
లిమా ఇటీవలే అపాక్ జైలుకు వచ్చారు
బ్రెజిల్లో ఓ 26 ఏళ్ల మహిళా ఖైదీ ఈ మధ్య తన పాత జైలు నుంచి ఓ కొత్త జైలుకు వెళ్లారు. అక్కడున్న అద్దంలో చూసుకొని ఒక క్షణంపాటు తన మొఖాన్ని తానే గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే, ఆమె చాలా ఏళ్ల తర్వాత తన ముఖాన్ని అద్దంలో స్పష్టంగా చూసుకుంటున్నారు.
కారియా డె లిమా.. బ్రెజిల్లో 12 ఏళ్ల జైలుశిక్షను అనుభవిస్తోన్న ఓ ఖైదీ. నిన్నమొన్నటి దాకా ఆమె ఓ సాధారణ జైలులో జీవితం గడిపారు.
ఈ మధ్యే అధికారులు ఆమెను ‘అపాక్’ (అసోసియేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ అసిస్టెన్స్ టు కన్విక్ట్స్) అనే ఓ వ్యవస్థలో భాగంగా ఉన్న ప్రత్యేక జైలుకు తరలించారు.
పేరుకి అది జైలే అయినా, వసతుల పరంగా చూస్తే ఇతర జైళ్లతో దాన్ని ఏ విధంగా కూడా పోల్చలేం. అక్కడ అసలు భద్రతా సిబ్బంది ఉండరు. ఆయుధాల వినియోగం ఉండదు.
ఖైదీలు తమకు నచ్చిన దుస్తులు వేసుకొని స్వేచ్ఛగా ఉండొచ్చు. కాకపోతే వాళ్లకు కొన్ని షరతులు వర్తిస్తాయి. జైల్లోని ప్రత్యేక నియమ నిబంధనలను ఎట్టి పరిస్థితిలోనూ వాళ్లు పాటించి తీరాల్సిందే.
లేకపోతే వారు మళ్లీ పాత జైలుకే మారాల్సి ఉంటుంది!
ఎందుకీ జైళ్లు?
జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంఖ్యాపరంగా చూస్తే బ్రెజిల్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. అక్కడ జైళ్ల వాతావరణం, సదుపాయాలు, నిర్వహణ కూడా సరిగ్గా ఉండవనే వార్తలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి.
హింస, ఘర్షణల లాంటి ఘటనలు కూడా అక్కడ అప్పుడప్పుడూ చోటుచేసుకుంటుంటాయి.
బ్రెజిల్ జైళ్లలో నెలకొన్న ఆ సంక్షోభానికి సమాధానం చెప్పేలా ఈ అపాక్ జైళ్లను అధికారులు ప్రారంభించారు.
రాండానియా రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన జైలుతో కలిపి దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక అపాక్ జైళ్ల సంఖ్య 49కి చేరింది.
ఫొటో సోర్స్, GUSTAVO OLIVEIRA
మహిళా ఖైదీలు తమ భాగస్వాములను ఏకాంతంగా కలవొచ్చు
ఏంటి వీటి ప్రత్యేకత?
అపాక్ జైళ్లలోకి చేరేవాళ్లంతా ముందుగా కొన్నాళ్లపాటు సాధారణ జైళ్లలో శిక్ష అనుభవించి ఉండాలన్నది నిబంధన.
అలా శిక్ష అనుభవిస్తోన్న ఖైదీల్లోంచి పశ్చాత్తాప భావనలో ఉన్న ఖైదీలను గుర్తించి వారిని ఈ అపాక్ జైళ్లకు పంపేందుకు అధికారులు ఎంపిక చేస్తారు.
ఎంపికైన ఖైదీలు అపాక్ జైళ్లలో అప్పగించే పనులు చేయడంతో పాటు చదువుకోవడానికి కూడా అంగీకరిస్తేనే వాళ్లను ఆ జైళ్లకు బదిలీ చేస్తారు.
అపాక్ మహిళా జైళ్లలో ఉండే ఖైదీలు తమను చూడటానికి వచ్చిన బంధువులతో, భాగస్వాములతో ఏకాంతంగా గడపడానికి అనువైన ఏర్పాట్లు సైతం ఉంటాయి. అక్కడి ఖైదీలు చదువుకోవడంతో పాటు జైలు అధికారులు సూచించే ఉపాధి పనులూ చేయాలి.
ఇటీవల ఇలాంటి అపాక్ జైలుకి వచ్చిన లిమా అనే యువతి మాట్లాడుతూ, సాధారణ జైలులో గడపడం వల్ల స్త్రీ సహజ గుణాలు దెబ్బతింటాయనీ, ఈ ప్రత్యేక జైలు వల్ల మళ్లీ పూర్వపు ఉత్సాహాన్ని పొందే అవకాశం దొరకుతుందనీ అన్నారు. అక్కడ తనకి నచ్చిన దుస్తులూ, మేకప్ కూడా వేసుకునే సౌలభ్యం ఉందని చెప్పారు.
ఈ అపాక్ జైళ్లను 1972లో కొందరు క్యాథలిక్‌లు కలిసి నెలకొల్పారు. వీటిని ప్రస్తుతం ఇటలీకి చెందిన ఎన్జీవో ‘ఏవీఎస్ఐ ఫౌండేషన్’, బ్రెజిల్‌కు చెందిన ‘అసిస్టెన్స్ టు కన్విక్ట్స్’ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
‘ప్రేమ, పని.. ఈ రెండే ఈ జైళ్లలో ముఖ్యం. ఇక్కడందర్నీ పేరుతోనే పిలుస్తాం. ఖైదీలకు నంబర్లు, మారు పేర్లు ఉండవు’’ అని ఏవీఎస్ సంస్థ ఉపాధ్యక్షుడు జకోపో సబటీలో చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
మారుతున్న మనుషులు
ఈ అపాక్ జైళ్లలో ఖైదీలను ‘రెకుపెరాండోస్’(మారుతున్న మనుషులు)గా భావిస్తారు. రోజులో ఎక్కువ భాగం చదువుకూ, పనికే వీళ్లు కేటాయించాలి. ఆ పనులు చేయకపోయినా, పారిపోవడానికి ప్రయత్నించినా మళ్లీ మామూలు జైళ్లకు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ జైళ్లలో అప్పుడప్పుడూ ఘర్షణలు చోటు చేసుకున్నాయనీ, కానీ హత్యలు మాత్రం జరగలేదనీ సబటీలో చెప్పారు.
గార్డులు లేకపోవడం వల్ల వాతావరణం మరింత ప్రశాంతంగా ఉంటుందనీ, తీవ్రమైన నేరాలు చేసిన మహిళా ఖైదీలు వీటిలో ఉంటున్నా పెద్దగా ఇబ్బందులు ఎదురవట్లేదనీ ఆయన అన్నారు.
‘నేను ఇంకా నా పాత జైలు గది నంబరును మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నా. అక్కడ 20మంది ఖైదీలం ఒక ఇరుకు గదిలో పడుకునేవాళ్లం. తిండి తినలేకపోయేవాళ్లం. ఆడవాళ్లు అని కూడా చూడకుండా మమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ల దుస్తులన్నీ విప్పి చెక్ చేశాకే లోపలికి పంపించేవాళ్లు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు’ అని కాంపోస్ అనే మహిళా ఖైదీ అన్నారు.
తన భాగస్వామితో కలిసి ఉంటున్న ఇంట్లో కొకైన్ దొరికినందుకు, కాంపోస్‌ను అరెస్టు చేసి శిక్ష విధించారు.
ఫొటో సోర్స్, GUSTAVO OLIVEIRA
‘ప్రేమ నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అనే సందేశం అక్కడ కనిపిస్తుంది
కాంపోస్లానే బ్రెజిల్ జైళ్లలో ఉన్న చాలామంది మహిళలు తమ భాగస్వాములతో కలిసి ఏవైనా నేరాల్లో పట్టుబడి జైలు పాలైన వారే.
‘నాకు ఆ జైలుకి వెళ్లేంత వరకూ నేరాల గురించి ఏమీ తెలీదు. నాతో కలిసి అక్కడ గదిని పంచుకున్న మహిళ, మరో మహిళను చంపి, మొండెం నుంచి తలను వేరు చేసి సూట్‌కేసులో పెట్టిందట’ అని కాంపోస్ చెప్పారు.
జైళ్లలో విభాగాలు
అపాక్ జైళ్లలో కూడా ఖైదీలకు వేర్వేరు విభాగాలుంటాయి. కొందరు ఖైదీలు పూర్తిగా గదులకే పరిమితమవుతారు. వాళ్ల ప్రవర్తనను బట్టి ఒక్కో దశను దాటుకుంటూ జైల్లో తమకు నచ్చినట్టు స్వేచ్ఛగా తిరిగే దశకు చేరుకుంటారు. చివరి దశకు చేరుకున్నవాళ్లు వారానికి ఓసారి బయటకు వెళ్లొచ్చే వెసులుబాటు కూడా ఉంటుంది.
జైల్లో ఉంటూనే కాంపోస్ ఓ బాయ్ ఫ్రెండ్‌ను కూడా వెతుక్కున్నారు. పురుషుల అపాక్ జైళ్లలోని ఖైదీలతో మాట్లాడే సౌకర్యాన్ని అధికారులు మహిళా అపాక్ జైలు ఖైదీలకు కల్పిస్తారు. అలా జైలు అధికారుల సాయంతోనే ఆమెకు బాయ్‌ఫ్రెండ్ దొరికాడు.
‘ప్రేమ నుంచి ఎవరూ తప్పించుకోలేరు’.. మహిళల అపాక్ జైల్లోని ఓ గోడపై కనిపించే సందేశం ఇది.
ఇవి కూడా చదవండి
- వేదాంత ఫ్యాక్టరీ: అసలేంటీ వివాదం? ఎందుకిన్ని ఆందోళనలు?
- అత్యాచారానికి గురైన ఓ అబ్బాయి కథ ఇది!
- అగ్రిగోల్డ్ కేసులో మరో అరెస్ట్ - ఇంతకూ ఏంటీ అగ్రిగోల్డ్ కేసు?
- కర్ణాటక ఎన్నికలు రాహుల్ గాంధీకి ఏం నేర్పాయి? 2019లో బీజేపీని ఎలా ఎదుర్కొంటారు?
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)