అంతర్జాతీయ వార్తలు: 30 ఏళ్లొచ్చినా స్థిరపడలేదని కొడుకుపై కేసు వేసిన అమెరికా తల్లిదండ్రులు

ఇంటి ఫొటో
ఫొటో క్యాప్షన్,

కుటుంబ వివాదానికి కేంద్రమైన ఇల్లు

ఇల్లు వదలకుండా.. కూర్చుని తింటున్న 30 ఏళ్ల కొడుకుపై తీవ్రమైన చర్యలకు దిగారు అమెరికాలోని ఒక జంట. సొంత కొడుకుపైనే వాళ్లు కేసు వేశారు.

న్యూయార్క్‌లోని ఒనోండగా కౌంటీ సుప్రీం కోర్టులో మార్క్‌ రొటోండో, ఆయన భార్య క్రిస్టినా ఈ కేసు దాఖలు చేశారు.

కోర్టు పత్రాల ప్రకారం.. వీళ్ల కొడుకు మైఖేల్ రొటోండో ఇంటి అద్దె చెల్లించట్లేదు, రోజువారీ ఇంటి పనులు చేయట్లేదు, ‘కొంత డబ్బు ఇస్తాం.. బయటకెళ్లి స్థిరపడు’ అని తల్లిదండ్రులు చెప్పినా పట్టించుకోవట్లేదు.

దీంతో, ఇల్లు ఖాళీ చేయాలంటూ ఐదు సార్లు తల్లిదండ్రులు కొడుక్కి లేఖలు రాశారు. అయినా కూడా అతను ఇల్లు విడిచివెళ్లేందుకు ససేమిరా అన్నాడు.

చట్ట ప్రకారం తాను ఇల్లు వదిలి వెళ్లేందుకు తగినంత సమయం ఇవ్వలేదని మైఖేల్ వాదిస్తున్నాడు.

చాలా నెలలుగా ఇల్లు వదిలి వెళ్లాలని కొడుకును అర్థిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయినా మైఖేల్ వినకపోవటంతో ఈనెల 7వ తేదీన కేసు దాఖలు చేశారు.

తమ కొడుకును ఇంటి నుంచి బయటకు పంపించేందుకు కేసు వేయడం మినహా మరో మార్గం ఆ తల్లిదండ్రులకు తోచలేదని వారి తరపు న్యాయవాది ఆంథోనీ అడొరాంటే సైరకూస్ డాట్ కామ్‌కు చెప్పారు.

ఐదు లేఖల్లో ఇంటి నుంచి వెళ్లిపోవాలని సూచించిన తల్లిదండ్రులు, మార్చి 15వ తేదీ లోపు ఇల్లు విడిచి వెళ్లకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా సూచించినట్లు కోర్టుకు అందజేసిన పత్రాల ద్వారా తెలుస్తోంది.

కొడుకు ప్రవర్తన గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఆ తల్లిదండ్రులు, బయటకు వెళ్లి స్థిరపడేందుకు గాను 1100 డాలర్లు (సుమారు రూ.75 వేలు) ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారు.

మెక్‌డొనాల్డ్స్‌పై లైంగిక వేధింపుల కేసు

అమెరికాలో మెక్‌డొనాల్డ్స్‌ ఫాస్ట్‌ఫుడ్ అనుబంధ (ఫ్రాంఛైజీ) రెస్టారెంట్లలో పనిచేస్తున్న పది మంది మహిళా సిబ్బంది సంస్థపై లైంగిక వేధింపుల కేసు దాఖలు చేశారు.

వీరిలో 15 ఏళ్ల యువతి ఒకరు మాట్లాడుతూ.. అసభ్యకరంగా తాకడం, తన ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక ప్రతిపాదనలు చేయడం, అసభ్యకరంగా చూపించడం, మాట్లాడటం వంటివి చవి చూడాల్సి వచ్చిందని ఆరోపించారు.

కాగా, ఈ ఆరోపణల్ని చాలా తీవ్రంగా పరిగణిస్తామని, తమ ఫ్రాంఛైజీలు కూడా అదేవిధంగా పరిగణిస్తాయని మెక్‌డొనాల్డ్స్‌ తెలిపింది.

మెక్‌డొనాల్డ్స్‌పై రెండేళ్ల కిందట కూడా ఇదేవిధమైన లైంగిక కేసులు నమోదయ్యాయి.

ఫైట్ ఫర్ 15 డాలర్స్ అనే ప్రచారోద్యమం ఈ తాజా ఆరోపణల్ని సిబ్బంది తరపున బయటపెట్టింది. ఈ మేరకు అమెరికా సమాన ఉపాధి అవకాశాల కమిషన్ వద్ద కేసు నమోదైంది.

మియామీ, లాస్ ఏంజెల్స్, డెట్రాయిట్ నగరాల్లోని సిబ్బందిపై ఈ వేధింపులు జరిగాయని, వీటిని మేనేజర్ల దృష్టికి తీసుకెళ్లగా.. వారు సిబ్బందిని వెక్కిరించారని తెలిపింది.

ఇలాగైతే.. ఇంగ్లాండ్‌లో నీటికి కటకటే!

నీటి వినియోగాన్ని, వృధాను తగ్గించకపోతే 2050 నాటికి ఇంగ్లాండ్ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ దేశ పర్యావరణ సంస్థ హెచ్చరించింది.

ప్రతిరోజూ నీటి లీకేజీల కారణంగా రెండు కోట్ల మందికి సరిపడేంత నీరు వృధా అవుతోందని తాజా నివేదికలో పేర్కొంది.

గతేడాది భూగర్భం నుంచి 28 శాతం నీటిని వాడేశారని, ఇలా చేయటం సరికాదని వెల్లడించింది.

ప్రతి వ్యక్తికీ నీటి వినియోగ లక్ష్యాలను నిర్ణయించేందుకు ఇతర భాగస్వామ్య పక్షాలతో కలసి పనిచేస్తామని తెలిపింది.

ఇంగ్లాండ్‌లోని నీటి వనరులపై వెలువడిన మొదటి ముఖ్యమైన నివేదిక ఇదే.

ఫొటో క్యాప్షన్,

ఇజ్రాయెల్ 50 ఎఫ్-35 విమానాలను కొనుగోలు చేస్తోంది

మొదటిసారి యుద్ధంలో దిగిన ప్రపంచంలోనే ఖరీదైన విమానం

అమెరికా తయారు చేసిన ఎఫ్-35 నిగూఢ పోరాట యుద్ధ విమానం మొట్టమొదటి సారి తన పోరాట పటిమను ప్రదర్శించింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కోసం చేపట్టిన ఆపరేషన్‌లో ఇది పాల్గొంది.

లెబనాన్ సమీపంలోని బీరుట్‌ ప్రాంతంపై ప్రయాణిస్తున్న యుద్ధ విమానాలను ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ మేజర్ జనరల్ అమికమ్ నోక్రిన్ ప్రదర్శించారు. ‘రెండు వైపుల నుంచి రెండు సార్లు ఇవి దాడి చేశాయి’ అని ఆయన చెప్పారు. ఈ మధ్యనే ఇజ్రాయెల్ సిరియాపై భారీ స్థాయిలో వైమానిక దాడులు జరిపింది.

ఎఫ్-35 వ్యయం, పోరాట సామర్థ్యాల కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రక్షణ కార్యక్రమం విమర్శలను చవిచూడాల్సి వచ్చింది.

ఒక్కో విమానం తయారీకి 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.682 కోట్లు) ఖర్చవుతోందని గతేడాది అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ల ద్వారా విమర్శలు చేశారు. దీంతో రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ ఈ పథకాన్ని వెనకేసుకువచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)