ఆమ్నెస్టీ: ‘రోహింజ్యా మిలిటెంట్ల చేతుల్లో డజన్ల కొద్దీ హిందువుల ఊచకోత’

  • 15 జూలై 2018
రోహింజ్యాలు, మయన్మార్, అర్సా మిలిటెంట్లు Image copyright EPA
చిత్రం శీర్షిక మరణించిన హిందువుల్లో అనేక మంది పిల్లలు ఉన్నారని ఆమ్నెస్టీ నివేదిక వెల్లడించింది

2017 ఆగస్టులో రోహింజ్యా ముస్లిం మిలిటెంట్లు చేసిన దాడుల్లో డజన్ల కొద్దీ సామాన్య హిందూ పౌరులు మరణించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక నివేదికలో వెల్లడించింది.

'అర్సా' అనే మిలిటెంట్ల బృందం జరిపిన ఊచకోతలో దాదాపు 99 మంది హిందూ పౌరులు మరణించారని ఆమ్నెస్టీ తెలిపింది.

మియన్మార్ ప్రభుత్వ బలగాలకు వ్యతిరేకంగా మొదటిసారి తిరుగుబాటు జరిగినప్పుడు ఈ ఊచకోత జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. మియన్మార్ బలగాలు కూడా రోహింజ్యాలను ఊచకోత కోశాయని ఆరోపణలు వెలువడ్డాయి.

గత ఆగస్టు నుంచి దాదాపు 7 లక్షల మంది రోహింజ్యాలు మియన్మార్ నుంచి పారిపోయారు.

ఈ ఘర్షణల కారణంగా అనేక మంది బౌద్ధులు, హిందువులు కూడా వారి స్వస్థలాలను వీడిపోవాల్సి వచ్చింది.

బంగ్లాదేశ్‌లోను, రఖైన్ రాష్ట్రంలోను తలదాచుకుంటున్న శరణార్థులను ఇంటర్వూ చేసిన అనంతరం, అరకాన్ రోహింజ్యా సాల్వేషన్ ఆర్మీ (అర్సా) మౌంగ్‌డ్వా పట్టణానికి దగ్గరలో ఉన్న కొన్ని గ్రామాలలో ఈ సామూహిక హత్యాకాండకు పాల్పడినట్లు ఆమ్నెస్టీ తెలిపింది.

ఇతర ప్రాంతాలలో జరిగిన హింసకు కూడా అర్సానే కారణమని ఈ ఇంటర్వ్యూల ద్వారా తెలుస్తోంది.

Image copyright YOUTUBE
చిత్రం శీర్షిక అర్సా మిలిటెంట్ల నేత అతావుల్లా (మధ్యలో)

అర్సా సభ్యులు గత ఏడాది ఆగస్టు 26న హిందూ గ్రామం అహ్ నౌక్ ఖా మౌంగ్‌సెయిక్ గ్రామంపై ఎలా దాడి చేశారో ఆమ్నెస్టీ నివేదిక వివరించింది.

''అర్సా సభ్యులు అనేక మంది హిందూ మహిళలు, పురుషులు, పిల్లలను బంధించి, వారిని వాళ్ల సొంత గ్రామాల వెలుపలే అంతమొందించారు'' అని ఈ నివేదికలో పేర్కొన్నారు.

తమ బంధువులను హత్య చేయడం తాము కళ్లారా చూశామని ఆ మారణకాండ నుంచి బయటపడ్డ వారు ఆమ్నెస్టీకి వెల్లడించారు.

అహ్ నౌక్ ఖా మౌంగ్‌సెయిక్ గ్రామానికి చెందిన ఒక మహిళ.. ''వాళ్లు పురుషులను ఊచకోత కోశారు. వాళ్ల చేతుల్లో కత్తులు, ఇనుప రాడ్‌లు, పారలు ఉన్నాయి. వాళ్లు తమ వైపు చూడొద్దని మమ్మల్ని ఆదేశించారు. మేము పొదల్లో దాక్కున్నాము. ఈ మారణకాండలో మా నాన్న, సోదరుడు, మామయ్య.. అందరూ మరణించారు'' అని తెలిపారు.

ఈ మారణకాండంలో అర్సా మిలిటెంట్లు మొత్తం 20 మంది పురుషులు, 10 మంది మహిళలు, 23 మంది పిల్లలను చంపేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

యెబౌక్ క్యార్ గ్రామంలో కూడా అదే రోజు మారణహోహం జరిగిందని ఈ నివేదిక వెల్లడించింది.

గత సెప్టెంబర్‌లో ఒక సామూహిక ఖనన ప్రదేశంలో 45 మృతదేహాలు బయటపడ్డాయని ఆమ్నెస్టీ వెల్లడించింది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక గత ఆగస్టు నుంచి దాదాపు 7 లక్షల మంది రోహింజ్యాలు బంగ్లాదేశ్‌కు పారిపోయారు

తన నివేదికలో ఆమ్నెస్టీ మియన్మార్ భద్రతా బలగాల హింసను కూడా తీవ్రంగా ఖండించింది.

రోహింజ్యాలపై మియన్మార్ మిలటరీ జరిపిన జాతిహనన కార్యక్రమాల వల్లనే అర్సా దాడులు జరిగాయని ఆమ్నెస్టీ పేర్కొంది.

రఖైన్‌లోను, సరిహద్దుల్లోని బంగ్లాదేశ్‌లోను నిర్వహించిన డజన్ల కొద్దీ ఇంటర్వ్యూలు, ఫోరెన్సిక్ పాథలాజిస్టుల సాక్ష్యాల ఆధారంగా ఆమ్నెస్టీ తన నివేదిక వెలువరించింది.

ఈ నివేదిక రఖైన్‌ రాష్ట్రంలో అర్సా దురాగతాలను వెల్లడిస్తోందని ఆమ్నెస్టీ ప్రతినిధి తిరానా హసన్ తెలిపారు.

అయితే అర్సా మాత్రం ఆమ్నెస్టీ నివేదికను తోసిపుచ్చింది. తమ మిలిటెంట్లు గ్రామస్తులను చంపారన్న విషయాన్ని 'అబద్ధాలు'గా పేర్కొంది.

తమదంటూ దేశంలేని ముస్లిం మైనారిటీలైన రోహింజ్యాలు మియన్మార్‌లో తీవ్ర ద్వేషాన్ని ఎదుర్కొంటున్నారు. వారిలో కొందరు కొన్ని తరాలుగా మియన్మార్‌లోనే ఉంటున్నప్పటికీ వారిని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులుగా పరిగణిస్తున్నారు.

బంగ్లాదేశ్ కూడా వారికి పౌరసత్వం ఇవ్వడానికి నిరాకరిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోటాబయ రాజపక్ష: "ఆయన విజయంతో భారత్-శ్రీలంక సంబంధాల్లో మార్పేమీ రాదు"

‘హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేసే ఆలోచన లేదు’

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు

ఒకప్పుడు కరడుగట్టిన నేరస్థుల కారాగారం... నేడు పర్యటకుల స్వర్గధామం

లవ్ జిహాద్ కేసు: ఇబ్రహీం-అంజలి జంట తమ ఇష్టప్రకారం జీవించవచ్చన్న హైకోర్టు

శ్రీలంక ఎన్నికలు: అధ్యక్షుడిగా ఎన్నికైన రక్షణ శాఖ మాజీ కార్యదర్శి గోటాబయ రాజపక్ష

రంజన్ గొగోయ్: భారత రాజకీయాల్లో అయోధ్యకాండకు 'ముగింపు' పలికిన చీఫ్ జస్టిస్

పంజాబ్, హ‌రియాణా పొలాల పొగ దిల్లీని క‌మ్మేస్తుంటే ఏపీ రైతులు ఏం చేస్తున్నారు