క్రికెట్‌కు ఏబీ డివిలియర్స్ గుడ్‌బై: ‘అలసిపోయాను, నాలో గ్యాస్ అయిపోయింది’

  • 23 మే 2018
ఏబీ డివిలియర్స్ Image copyright Getty Images

దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వీడియో సందేశం ద్వారా పేర్కొన్నాడు.

ఆ రకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున రాజస్థాన్ రాయల్స్‌తో మే19న ఆడిన ఐపీఎల్ మ్యాచే అతడికి చివరిది. డివిలియర్స్ తన చివరి టెస్ట్ ఆస్ట్రేలియాతో (మార్చి 2018లో), చివరి వన్డే భారత్‌తో (ఫిబ్రవరి 2018లో) ఆడాడు.

‘నిజం చెప్పాలంటే నేను చాలా అలసిపోయాను. భారత్, ఆస్ట్రేలియాలపై అద్భుతమైన సిరీస్ విజయాలను సాధించాక, రిటైరవ్వడానికి ఇదే సరైన సమయం’ అని తన సందేశంలో ఏబీ చెప్పాడు. దీంతో పద్నాలుగేళ్ల క్రికెట్ కెరీర్‌కు ఏబీ స్వస్తి పలికాడు.

‘114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాను. ఇప్పటిదాకా నా వంతు బాధ్యత నేను నిర్వర్తించాను. ఇప్పుడు నా స్థానంలో వేరేవాళ్లు రావల్సిన అవసరం ఉంది’ అని డివిలియర్స్ అన్నాడు.

Image copyright Getty Images

డివిలియర్స్ అంతర్జాతీయ కెరీర్

టెస్టులు వన్డేలు టీ20లు
మ్యాచ్‌లు 114 228 78
పరుగులు 8765 9577 1672
శతకాలు 22 25 10(అర్ధ శతకాలు)
అత్యధిక స్కోర్ 278* 176 79*

రిటైరయ్యే నాటికి ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో డివిలియర్స్ టెస్టుల్లో 6, వన్డేల్లో 2వ స్థానంలో ఉన్నాడు.

Image copyright Getty Images

ఇది చాలా కఠినమైన నిర్ణయమనీ, మంచి ఫామ్‌లో ఉండగానే రిటైరవ్వాలని ముందే అనుకున్నాననీ అతడు తెలిపాడు. కోచ్‌లకూ, దక్షిణాఫ్రికా క్రికెట్‌కూ తానెప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు.

‘నాలో గ్యాస్ అయిపోయింది. కాబట్టి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం. దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరికీ నా క‌ృతజ్ఞతలు. ప్రతిదానికీ ఓ ముగింపు ఉంటుంది’ అని ఏబీ తన సందేశంలో పేర్కొన్నాడు.

తనకు విదేశాల్లో ఆడే ఉద్దేశం లేదనీ, నిజానికి దేశవాళీ క్రికెట్‌కు తన వంతు సేవ చేయాలని ఉందని డివిలియర్స్ తెలిపాడు.

Image copyright Anthony Au-Yeung

డివిలియర్స్ రిటైర్మెంట్‌పై ట్విటర్‌లో పలువురు స్పందించారు.

‘360 డిగ్రీల్లో ఆడటం చాలా సులువని ప్రపంచానికి చూపించిన వ్యక్తి డివిలియర్స్. ఎన్నో జ్ఞాపకాలను అందించినందుకు ధన్యవాదాలు’ అని ఆర్‌పీ సింగ్ ట్వీట్ చేశాడు.

‘క్రికెట్‌ను ఎలా ఆడాలో డివిలియర్స్ అచ్చంగా అలానే ఆడాడు. చాలా సరదాగా, ఆస్వాదిస్తూ, సాహసోపేతంగా ఆడాడు’ అని హర్షా భోగ్లే అన్నారు.

‘డివిలియర్స్‌ ఎప్పటికీ రజనీకాంత్ ఆఫ్ క్రికెట్‌గా గుర్తుండిపోతాడు. జ్ఞాపకాలకు ధన్యవాదాలు’ అని చేతన్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తూ ఈ ఫొటోను పెట్టాడు.

ఎస్‌పీ గుర్జర్ అనే మరో ట్విటర్ యూజర్, డివిలియర్స్ రిటైర్మెంట్ గురించి తెలియజేస్తూ ఇటీవల అతడు పట్టిన అద్భుతమైన క్యాచ్‌ గిఫ్‌ను పంచుకున్నాడు.

"గత దశాబ్దపు అతిపెద్ద ఎంటర్‌టెయినర్ డివిలియర్స్ రిటైరయ్యాడు. క్రికెట్‌లో అతడి వెలితి కనిపిస్తుంది" అని ఆకాష్ చోప్రా ట్వీట్ చేశాడు.

‘వన్ ఆఫ్ ది బెస్ట్, విష్ యు ఆల్‌ ది బెస్ట్. అద్భుతమైన ఆటగాడు. అంతకుమించి మంచి మనిషి’ అని శ్రీలంక క్రికెటర్ మహేల జయవర్దనే ట్వీట్ చేశాడు.

డివిలియర్స్ 2004లో ఇంగ్లండ్‌పై తన తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. రిటైరయ్యే నాటికి టెస్టుల్లో 50కి పైగా సగటుతో 8,765 పరుగులు నమోదు చేశాడు. వన్డేల్లోనూ 50కి పైగా సగటుతో 9577 పరుగులు పూర్తి చేశాడు.

వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఏబీ పేరిటే ఉంది. 2015లో వెస్టిండీస్‌పై 31 బంతుల్లోనే అతడు శతకం పూర్తి చేశాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)