ట్రంప్‌తో భేటీకి ఉక్రెయిన్ రహస్యంగా ఎంత చెల్లించింది?

  • పాల్ వుడ్
  • బీబీసీ ప్రతినిధి
ట్రంప్, పొరషెంకో

ఫొటో సోర్స్, Getty Images

ఉక్రెయిన్ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మధ్య చర్చలు ఏర్పాటు చేసేందుకు ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైకేల్ కోహెన్‌‌కి రూ.2.75 కోట్లకు పైగా ( 4 లక్షల డాలర్లు ) రహస్య చెల్లింపులు చేశారని ఇందులో ప్రమేయం ఉన్నవారికి సన్నిహితులైన కొందరు ఆధారాలు బయటపెట్టారు.

ఉక్రెయిన్ నేత పెట్రో పోరోషెంకో మధ్యవర్తులు ఈ మొత్తాన్ని ఈ లాయర్‌కు అందించినట్టు వీరు చెబుతున్నారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం కోహెన్ ఉక్రెయిన్ ప్రతినిధిగా రిజిస్టర్ కాలేదు.

ఈ ఆరోపణలను కోహెన్ ఖండించారు.

గత ఏడాది జూన్‌లో ఈ సమావేశం జరిగింది. తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు స్వదేశానికి తిరిగి వచ్చిన కొన్ని రోజులకే, ఆ దేశానికి చెందిన యాంటీ కరప్షన్ ఏజెన్సీ, ట్రంప్ మాజీ కాంపైన్ మేనేజర్ పాల్ మన్ ఫోర్ట్‌పై తమ దర్యాప్తును నిలిపివేసింది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

పాల్ మన్ ఫోర్ట్

పోరోషెంకో ప్రభుత్వంలో పనిచేసే ఉక్రెయిన్ నిఘా విభాగానికి చెందిన ఒక ఉన్నతాధికారి వైట్ హౌస్ పర్యటనకు ముందు ఏం జరిగిందో వివరించారు.

"ట్రంప్‌ స్థాయి లేని పోరోషెంకోను కాస్త ఎక్కువ స్థాయి వ్యక్తిగా చూపించేందుకు ఉక్రెయిన్‌లోని రిజిస్టర్ లాబీయిస్టులు, వాషింగ్టన్ డీసీ రాయబార కార్యాలయం కోహెన్‌ను రంగంలోకి దించాయి. దీన్ని చర్చల్లా చూపించుకోడానికి పోరోషెంకోకు అలాంటిది ఏదైనా కావాల్సి వచ్చింది" అని ఆ అధికారి తెలిపారు.

"మిస్టర్ ట్రంప్ తో చర్చల కోసం దొడ్డిదారిని వెతకాలని పోరోషెంకో నిర్ణయించారు. ఈ పనిని తన మాజీ సహచరుడి అప్పగించారు, ఆయన నమ్మకస్తుడైన ఒక ఉక్రెయిన్ ఎంపీ సాయం కోరారు" అని ఈ సీనియర్ అధికారి అన్నారు.

"ఆయన న్యూయార్క్‌, చబాడ్ ఆఫ్ పోర్ట్ వాషింగ్టన్‌లో ఒక యూదు చారిటీకి హాజరైన వ్యక్తుల కాంటాక్ట్స్ ఉపయోగించారు" (ఇందులో అధికారుల ప్రమేయం లేదని స్పష్టంగా చెప్పాలని చబాడ్‌లోని ఒక ప్రతినిధి కోరారు )

ఇది చివరికి అధ్యక్షుడు ట్రంప్ లాయర్, నమ్మకస్తుడైన ఫిక్సర్ మైకేల్ కోహెన్ దగ్గరికి చేరింది. దీనికోసం కోహెన్‌కు 4 లక్షల డాలర్లు చెల్లించారు.

ఈ చెల్లింపుల గురించి ట్రంప్‌కు తెలిసినట్టు ఎలాంటి సమాచారం లేదు.

కీవ్‌కు చెందిన మరొకరు కూడా ఇలాంటి వివరాలే చెప్పారు. కానీ ఆయన "కోహెన్‌కు మొత్తం 6 లక్షల డాలర్లు చెల్లించారని" అన్నారు.

కోహెన్ వెల్లడించని ఆదాయం వివరాల గురించి అమెరికా లాయర్ మైకేల్ అవెనట్టీ కూడా చెప్పారు. ఈయన ట్రంప్‌పై కేసులు పెట్టిన పోర్న్ నటి, స్టార్మీ డేనియల్స్ తరపున వాదిస్తున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కీవ్‌లో రష్యా వ్యతిరేక ఆందోళనలు

"కోహెన్‌కు చెందిన బ్యాంక్, అమెరికా ట్రెజరీకి అందించిన అనుమానస్పద లావాదేవీల నివేదికలు ఆయన ఉక్రెయిన్ ప్రయోజనాల కోసం డబ్బు అందుకున్నట్టు చూపిస్తున్నాయి" అని తెలిపారు.

కోహెన్‌తోపాటూ, ఇద్దరు ఉక్రెయిన్ అధికారులు తమ అధ్యక్షుడి కోసం రహస్య చెల్లింపులు జరిగాయనే కథనాలను ఖండించారు.

ఒకప్పుడు ట్రంప్ వ్యాపార భాగస్వామి, మాజీ మాబ్‌స్టర్ ఫెలిక్స్ సేటర్ కోహెన్‌కు సాయం చేశాడని కీవ్‌లోని ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. ఈ ఆరోపణలను సేటర్ లాయర్ ఖండించారు.

ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం దీనిపై స్పందించడానికి నిరాకరించింది. కానీ ఒక జర్నలిస్టు స్పందన కోరడంతో "ఇది పచ్చి అబద్ధమని, అపవాదులు వేస్తున్నారని" ఒక ప్రకటన విడుదల చేసింది.

గత ఏడాది జూన్‌లో పోరోషెంకో వాషింగ్టన్ వచ్చినపుడు ఆయన ట్రంప్‌తో ఎంత సమయం ఉంటారోనని ఉహాగానాలు రేగాయి.

ఓవల్ ఆఫీసులో ట్రంప్ తన స్టాఫ్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు అక్కడ పోరోషెంకో ఆయన్ను కలుస్తారని అప్పట్లో వైట్ హౌస్ షెడ్యూల్ పేర్కొంది.

అలా కలవడానికి అధికారికంగా అంగీకరించారు. కానీ కోహెన్‌కు చెల్లింపులతో కేవలం కరచాలనం, కొన్ని నిమిషాల చర్చలకు బదులు పోరోషెంకో అక్కడ కాస్త ఎక్కువే గడిపారని సీనియర్ అధికారి తెలిపారు. ఆయన వాషింగ్టన్ వచ్చిన రోజు ఇద్దరు నేతలు ఉదయం సమయంలో కలిశారు.

దీనిపై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సజావుగా జరగని పనికి కోహెన్ తమ నుంచి లక్షల డాలర్లు తీసుకున్నారని విమర్శించింది.

చివరి క్షణం వరకూ తను ఈ అవమానం నుంచి బయటపడగలరా, లేదా అనేది ఉక్రెయిన్ అధినేతకు తెలీదు.

ఈ మొత్తం ఏర్పాట్లు ( కోహెన్‌తో ) ఎంత చెత్తగా జరిగాయో చూసిన పోరోషెంకో ఇన్నర్ సర్కిల్ షాక్ అయ్యింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)