‘మా వాడ్ని ఇంటి నుంచి బయటకు పంపండి’ 30 ఏళ్ల కొడుకుపై తల్లిదండ్రుల కేసు, అతను ఇల్లు వదిలిపెట్టాడా?

ఇంటి ఫొటో
ఫొటో క్యాప్షన్,

కుటుంబ వివాదానికి కేంద్రమైన ఇల్లు

ఇల్లు వదలకుండా.. కూర్చుని తింటున్న 30 ఏళ్ల కొడుకుపై తీవ్రమైన చర్యలకు దిగారు అమెరికాలోని ఒక జంట. సొంత కొడుకుపైనే వాళ్లు కేసు వేశారు. ఇందులో ఆ తల్లిదండ్రులు విజయం సాధించారు. ఆ యువకుడిని ఇల్లు వదిలి పోవాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

న్యూయార్క్‌లోని ఒనోండగా కౌంటీ సుప్రీం కోర్టులో మార్క్‌ రొటోండో, ఆయన భార్య క్రిస్టినా ఈ కేసు దాఖలు చేశారు.

కోర్టు పత్రాల ప్రకారం.. వీళ్ల కొడుకు మైఖేల్ రొటోండో ఇంటి అద్దె చెల్లించట్లేదు, రోజువారీ ఇంటి పనులు చేయట్లేదు, ‘కొంత డబ్బు ఇస్తాం.. బయటకెళ్లి స్థిరపడు’ అని తల్లిదండ్రులు చెప్పినా పట్టించుకోవట్లేదు.

దీంతో, ఇల్లు ఖాళీ చేయాలంటూ ఐదు సార్లు తల్లిదండ్రులు కొడుక్కి లేఖలు రాశారు. అయినా కూడా అతను ఇల్లు విడిచివెళ్లేందుకు ససేమిరా అన్నాడు.

చట్ట ప్రకారం తాను ఇల్లు వదిలి వెళ్లేందుకు తగినంత సమయం ఇవ్వలేదని మైఖేల్ వాదిస్తున్నాడు.

చాలా నెలలుగా ఇల్లు వదిలి వెళ్లాలని కొడుకును అర్థిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయినా మైఖేల్ వినకపోవటంతో ఈనెల 7వ తేదీన కేసు దాఖలు చేశారు.

తమ కొడుకును ఇంటి నుంచి బయటకు పంపించేందుకు కేసు వేయడం మినహా మరో మార్గం ఆ తల్లిదండ్రులకు తోచలేదని వారి తరపు న్యాయవాది ఆంథోనీ అడొరాంటే సైరకూస్ డాట్ కామ్‌కు చెప్పారు.

ఐదు లేఖల్లో ఇంటి నుంచి వెళ్లిపోవాలని సూచించిన తల్లిదండ్రులు, మార్చి 15వ తేదీ లోపు ఇల్లు విడిచి వెళ్లకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా సూచించినట్లు కోర్టుకు అందజేసిన పత్రాల ద్వారా తెలుస్తోంది.

కొడుకు ప్రవర్తన గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఆ తల్లిదండ్రులు, బయటకు వెళ్లి స్థిరపడేందుకు గాను 1100 డాలర్లు (సుమారు రూ.75 వేలు) ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారు.

ఫొటో క్యాప్షన్,

రొటొండో

కేసు విచారణ సందర్భంగా తన తరపున వాదించుకున్న రొటోండో.. తల్లిదండ్రులు తనపై దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నాడు.

ఇల్లు వదిలిపోవడానికి తనకు ఆరు నెలల సమయం కావాలని కోరాడు.

కానీ న్యాయమూర్తి నవ్వుతూ.. ‘‘నేను మీరు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లాలని కోరుకుంటున్నాను..’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)