‘ప్రపంచ భాష ఇంగ్లిష్’కు రోజులు దగ్గరపడ్డాయా!

ఇంగ్లిష్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు మాట్లాడే భాష ఇంగ్లిష్. మరి ఎంత కాలం ఈ భాషను జనాలు ఇదే స్థాయిలో ఇష్టపడతారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అత్యధికంగా చైనాలో దాదాపు 35కోట్లమంది ప్రజలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉంది. భారత్‌లో కనీసం 10కోట్ల మందికి ఎంతో కొంత ఇంగ్లిష్ తెలుసని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంచనా వేస్తోంది.

అమెరికాలో తమ ఫస్ట్ లాంగ్వేజీ కింద ఇంగ్లిష్ మాట్లాడేవారికంటే చైనాలో తమ సెకండ్ లాంగ్వేజీలో భాగంగా ఇంగ్లిష్ మాట్లాడేవాళ్లే ఎక్కువ. అమెరికాలో ఐదో వంతు మంది తమ ఇళ్లలో ఇంగ్లిష్ కాకుండా ఇతర భాషల్లో మాట్లాడతారు.

ఈ నేపథ్యంలో ఇంకెంత కాలం ఇంగ్లిష్ ప్రపంచానికి ‘ఫేవరెట్ భాష’గా ఉంటుందోనని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేస్తోంది. ఆ సంస్థ అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150కోట్ల మంది ఇంగ్లిష్ మాట్లాడతారు. కానీ వాళ్లలో ఇంగ్లిష్ ఫస్ట్ లాంగ్వేజీగా ఉన్నవారి సంఖ్య 40కోట్ల కంటే తక్కువే.

ఇంగ్లిష్‌లో అమెరికన్ ఇంగ్లిష్, బ్రిటిష్ ఇంగ్లిష్, పాంపే లాంటి వేర్వేరు మాండలికాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైతే ప్రపంచంలో ఎక్కువ మంది నేర్చుకోవడానికి ఇష్టపడే రెండో భాష ఇంగ్లిష్.

ఉదాహరణకు ఫ్రెంచ్ రాని ఓ తెలుగు వ్యక్తి, తెలుగు రాని ఓ ఫ్రెంచ్ వ్యక్తితో మాట్లాడాల్సి వస్తే ఇద్దరూ కలిసి ఇంగ్లిష్‌లో మాట్లాడటానికి ప్రయత్నించే అవకాశాలే ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

భవిష్యత్తులో మానవ అనువాదకుల అవసరం ఉండకపోవచ్చు

కానీ టెక్నాలజీ పెరిగేకొద్దీ పరిస్థితి మారింది. ఇప్పుడు పోన్‌లో వాయిస్ రికగ్నిషన్ పరిజ్ఞానం ద్వారా గొంతును గుర్తుపట్టి అప్పటికప్పుడు మనకు కావల్సిన భాషలోకి దాన్ని తర్జుమా చేసి వినిపించే సాఫ్ట్‌వేర్లు అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఇంగ్లిష్ రాకపోయిన ఎదుటివారితో సంభాషించే అవకాశం దొరకుతోంది.

దీనివల్ల ఎల్లకాలం ఇంగ్లిష్ ప్రపంచ నంబర్ వన్ భాషగా ఉండే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంగ్లిష్‌పైన టెక్నాలజీ పైచేయి సాధిస్తోంది.

ఒక్క క్లిక్కుతో కంప్యూటర్‌లో ఇంగ్లిష్ అక్షరాలు మనకు నచ్చిన భాషలోకి మారిపోతున్నాయి. మనకు కావల్సిన పనిని కంప్యూటర్లు చేస్తున్నప్పుడు మళ్లీ ఇంగ్లిష్ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది?

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఏవైనా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలన్నా, ఆధునిక వీడియోగేమ్స్ ఆడాలన్నా, పేరున్న హాలీవుడ్ సినిమాలు చూడాలన్నా ఇంగ్లిష్ రాకపోతే కష్టమే. కానీ నెమ్మదిగా ఆ పరిస్థితి మారుతోంది.

మానవ అనువాదానికి దీటుగా ఇతర భాషలను ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లిష్‌ను ఇతర భాషల్లోకి అనువదించే అత్యాధునిక టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీతో పాటు ఇంగ్లిష్‌కు ఇతర సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి.

ఫొటో క్యాప్షన్,

ఉగాండాలో తల్లిదండ్రులు ఇంగ్లిష్‌కే ప్రాధాన్యమిస్తున్నారు

చాలామందికి ఇంగ్లిష్ సెకండ్ లాంగ్వేజ్ కావడం వల్ల, తమ మాతృభాషనూ ఇంగ్లిష్‌ను కలిపి మాట్లాడటం అలవాటవుతోంది. దానివల్ల హైబ్రిడ్ ఇంగ్లిష్ పుట్టుకొస్తోంది. ఒక్క భారత్‌లోనే హింగ్లిష్(హిందీ-ఇంగ్లిష్), బెంగ్లిష్ (బెంగాలి-ఇంగ్లిష్), టంగ్లిష్(తమిళం-ఇంగ్లిష్).. ఇలా ఇంగ్లిష్‌ను రకరకాల భాషలతో కలిపి మట్లాడేస్తున్నారు.

అమెరికాలో స్థిరపడ్డ చాలామంది కూడా తమ తల్లిదండ్రులు, తాతల నుంచి సంక్రమించిన భాషను కలిపి ‘స్పాంగ్లిష్’లో మాట్లాడుతున్నారు.

అమెరికా, యూకేల కారణంగా ఇన్నాళ్లూ ఇంగ్లిష్ ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యాన్ని కనబర్చింది. కానీ ఇప్పుడు, ముఖ్యంగా చైనా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న సమయంలో ఇంగ్లిష్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

హాంకాంగ్‌లో కొన్ని యూనివర్సిటీలు విద్యార్థులు మాండరిన్ భాష కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలని చెబుతున్నాయి

ఇంగ్లిష్ నేర్చుకుని అమెరికా వెళ్లటం కంటే.. మాండరిన్ నేర్చుకుని చైనా వెళ్లటం మేలు!!

ఆఫ్రికాలో ఉండే వ్యక్తులు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్ నేర్చుకొని అమెరికా, యూకేల్లో ఉద్యోగం ఆశించే బదులు, మాండరిన్ నేర్చుకొని చైనా వెళ్లడం మేలంటున్నారు కొందరు భాషా నిపుణులు.

అంతెందుకు, అమెరికాలోనే చైనీస్ నేర్చుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రెండేళ్లలో అక్కడ చైనీస్ నేర్చుకునే స్కూల్ విద్యార్థుల సంఖ్య రెట్టింపైందని 2015లో ఓ నివేదిక పేర్కొంది. కాలేజీ స్థాయిలో చైనీస్ నేర్చుకునే వారి సంఖ్య పదేళ్లలో 50శాతం మేర పెరిగింది.

కానీ ఉగాండా లాంటి కొన్ని దేశాల్లో ఇంగ్లిష్‌కు ఇప్పటికీ చాలా ప్రాధాన్యమిస్తున్నారు. అక్కడ చాలామంది తల్లిదండ్రులు మొదట తమ పిల్లలకు ఇంగ్లిష్ నేర్పించి తరవాతే తమ భాష నేర్పుతున్నారు. జీవితంలో విజయం సాధించాలంటే ఇంగ్లిష్ నేర్చుకోవడమే మార్గమని ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్ముతున్నారు.

దాంతో ఇంగ్లిష్‌ భవిష్యత్తుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదు. కానీ రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాని ఆధిపత్యం తగ్గిపోయే అవకాశాలు మాత్రం పుష్కలం.

ఇంగ్లిష్ కూడా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి అనేక ఇతర భాషా పదాలను సైతం తనలో కలుపుకుంటోంది. కాబట్టి మున్ముందు హైబ్రిడ్ భాషలు, పెరుగుతున్న చైనా దూకుడు, ఆధునిక అనువాద సాఫ్ట్‌వేర్ల లాంటి సవాళ్లను ఇంగ్లిష్ ఎలా ఎదుర్కొంటుందన్నదే కీలకం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)