ఉత్తర కొరియా: డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలకు ఎప్పుడైనా సిద్ధమే

ట్రంప్ కిమ్ చిత్రాలను చూపిస్తున్న దక్షిణ కొరియా టీవీ

ఫొటో సోర్స్, AFP/Getty

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు ‘ఎప్పుడైనా, ఏ విధంగానైనా’ తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా ప్రకటించింది. కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీని రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్ అర్థాంతరంగా ప్రకటించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

ట్రంప్ నిర్ణయం దురదృష్టకరమని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ ఉప మంత్రి కిమ్ కై గ్వాన్ తెలిపారు.

ఉత్తర కొరియా ‘బహిరంగ విరోధమే’ భేటీ రద్దు నిర్ణయానికి కారణమని ట్రంప్ ఆరోపించారు.

ఈ సమావేశం జరిగితే తొలిసారి అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా అధినేతతో భేటీ అయ్యేవారు.

జూన్ 12వ తేదీన సింగపూర్‌లో జరగాల్సిన ఈ భేటీ వివరాలు ఇంకా స్పష్టం కాలేదు. అయితే, కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ, ఉద్రిక్తతల తగ్గింపుపై ఈ భేటీ దృష్టి సారించేది.

కాగా, ట్రంప్ ప్రకటనకు కొన్ని గంటల ముందే.. ఇచ్చిన హామీ మేరకు తమ ఏకైక అణ్వాయుధ పరీక్షా ప్రాంతమైన సొరంగాలను ‘ధ్వంసం’ చేశామని ఉత్తర కొరియా తెలిపింది..

ట్రంప్ ఏమన్నారంటే..

ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్‌తో జరగాల్సిన శిఖరాగ్ర సదస్సును రద్దు చేసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఇటీవల ఉత్తర కొరియా చేసిన ఒక ప్రకటనలో వ్యక్తమైన "తీవ్ర ఆగ్రహం, బహిరంగ శత్రుత్వం"ల ఆధారంగా తానీ నిర్ణయానికి వచ్చినట్టు ఆయన తెలిపారు.

ముందు నిర్ణయించినట్టుగా జూన్ 12న సింగపూర్‌లో శిఖరాగ్ర సదస్సును నిర్వహించలేమని ఆయన తన కిమ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

అయితే "ఏదో రోజున మనం కలుస్తామని ఆశిస్తున్నా" అని ట్రంప్ ఆ లేఖలో పేర్కొన్నారు.

"నేను మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను. కానీ, విచారకరంగా, ఇటీవలి మీ ప్రకటనలో వ్యక్తమైన తీవ్ర ఆగ్రహం, శత్రుత్వ ధోరణులను చూశాక మనం ముందుగా నిర్ణయించుకున్న ఈ భేటీ మంచిది కాదని అనిపించింది," అని ట్రంప్ ఆ లేఖలో రాశారు.

"మీరు మీ అణు సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు. కానీ మా దగ్గర ఉన్నవి చాలా భారీవి, శక్తిమంతమైనవి. వాటిని ఉపయోగించాల్సిన అవసరం ఎప్పుడూ రాగూడదని భగవంతుణ్ని వేడుకుంటున్నా" అంటూ ఆయన కొనసాగించారు.

అంతకు ముందు, "ఉత్తర కొరియాకు కూడా లిబియాకు పట్టిన గతే పట్టొచ్చు" అని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వ్యాఖ్యానించగా, "అయనో పిచ్చివాడు" అని ఉత్తర కొరియా నేత చో సోన్-హుయి అభివర్ణించారు.

లిబియా నేత గడాఫీని తిరుగుబాటుదారులు 2011లో హత్య చేశారు. అప్పటికి ఎనిమిదేళ్ల క్రితమే ఆయన అణ్వాయుధాలకు స్వస్తి పలికారు.

గత దశాబ్ద కాలంగా అమెరికాతో దౌత్య సంబంధాల్లో ఉత్తర కొరియా నేత చో భాగస్వామిగా ఉన్నారు. చర్చల కోసం ఉత్తర కొరియా "దేబిరించడం లేదనీ", దౌత్య ప్రక్రియ విఫలమైతే "అణ్వాయుధ శక్తిని ప్రదర్శించగలదని" ఆయన హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)