‘గూగుల్ నా వీడియోలను కొట్టేసింది’

  • 25 మే 2018
కన్ను Image copyright Getty Images

తన వీడియోలను గూగుల్ అక్రమంగా వినియోగించిందని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వీడియో రూపకర్త ఫిలిప్ బ్లూమ్ ఆరోపించారు.

ఓ కార్పొరేట్ వీడియోను రూపొందించేందుకు గూగుల్ ఆ వీడియోలను వినియోగించిందని ఆయన తెలిపారు.

'ది సెల్ఫిష్ లెడ్జర్' పేరుతో 2016లో గూగుల్ 'ఎక్స్‌' పరిశోధనా విభాగంలో పనిచేసే డిజైనింగ్ హెడ్ ఆ వీడియోను రూపొందించారు.

అయితే ఆ వీడియో ఇటీవల బయటకు లీకైంది.

తాను యూట్యూబ్‌లో పెట్టిన ఫుటేజీని ఆ వీడియోలో వినియోగించారని ఫిలిప్ ఆరోపించారు.

Image copyright SARAH SEAL
చిత్రం శీర్షిక ఫిలిప్ బ్లూమ్ గతంలో బీబీసీ, సీఎన్‌ఎన్, స్కై న్యూస్‌ల కోసం కెమెరా ఆపరేటర్‌గా పనిచేశారు

"నా అనుమతి లేకుండానే 7 వీడియోల నుంచి 73 సెకన్ల ఫుటేజీని తీసుకున్నారు. ఆ వీడియోలకు సంబంధించి అన్ని హక్కులూ నాకున్నాయి. తప్పు చేశారన్న విషయం గూగుల్‌కు తెలుసు. మరి, పరిహారం చెల్లిస్తామన్న ప్రతిపాదనతో వస్తారేమో అని చూస్తున్నా" అని అన్నారు.

అయితే, ఆ ఫుటేజీకి సంబంధించి కాపీరైట్ అనుమతులు తీసుకున్నామని గూగుల్ నొక్కి చెప్పింది.

ఫిలిప్ మాత్రం ఆ ఫుటేజీని గూగుల్‌ అంతర్గతంగా వినియోగించుకునేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చానని అంటున్నారు.

Image copyright Image copyrightPHILIP BLOOM
చిత్రం శీర్షిక గూగుల్ వినియోగించిన ఫుటేజీలో ఇది కూడా ఉంది.

ఫిలిప్ బ్లూమ్ గతంలో బీబీసీ కోసం కెమెరా ఆపరేటర్‌గా పనిచేశారు. స్కై న్యూస్, సీఎన్‌ఎన్ కోసం కూడా పనిచేసిన ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు భారీగానే ఉన్నారు. అందులో అతను ఫిలిం చిత్రీకరణ గురించి సూచనలు ఇస్తుంటారు. ఆయన యూట్యూబ్‌ చానల్‌కి 1,68,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

తాజా వివాదం కోర్టు దాకా వెళ్తే గూగుల్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని అమెరికాకు చెందిన మేధో హక్కుల నిపుణులు ఒకరు అభిప్రాయపడ్డారు.

అమెరికా కాపీరైట్ చట్టం అతికొద్ది పరిస్థితుల్లో మాత్రమే లైసెన్సు లేకుండా వీడియోలను వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. విద్య, న్యూస్ రిపోర్టింగ్, లేదా అదే వీడియోపై విమర్శలు చేసేందుకు ఆ వెసులుబాటు ఉంటుందని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)