అంతర్జాతీయ కథనాలు: ప్రపంచంలోనే అత్యంత విలువైన మీడియా కంపెనీ నెట్‌ఫ్లిక్స్!

  • 25 మే 2018
Image copyright Getty Images

ప్రపంచంలోనే అత్యంత విలువైన మీడియా కంపెనీగా గురువారం నెట్‌ఫ్లిక్స్‌ అవతరించింది. అయితే ఈ ఘనత కొంత సమయం వరకే పరిమితమైంది.

ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ షేర్లు 2 శాతానికి పెరగటంతో దాని మార్కెట్ విలువ 153 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది.

దీంతో, కొద్ది సేపు వాల్ట్ డిస్నీని అధిగమించింది. అమెరికా ప్రజలను కేబుల్ టీవీ నుంచి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వైపు నెట్‌ఫ్లిక్స్ ఆకర్షిస్తోంది. వాల్ట్ డిస్నీకి గట్టి పోటీ ఇస్తోంది.

అయితే, కొద్ది సేపటి తర్వాత నెట్‌ఫ్లిక్స్ షేర్లు వెనక్కు తగ్గాయి. మొత్తం మీద గురువారం 1.3 శాతం పెరుగుదలను ఆ సంస్థ షేర్లు నమోదు చేశాయి.

డీవీడీలను అద్దెకిచ్చే సేవలతో, పది లక్షల మందికంటే తక్కువ వినియోగదారులతో 1997లో ప్రారంభమైన ఈ సంస్థ 2002లో స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించింది.

Image copyright Stewart, Seay & Felton Trial Attorneys
చిత్రం శీర్షిక న్యాయవాదితో హోప్ ఛెస్టన్ (కుడి), ఆమె తల్లి రెనెట్టా ఛెస్టన్ (ఎడమ)

అమెరికాలో అత్యాచార బాధితురాలికి రూ.6849 కోట్ల పరిహారం

అమెరికాలోని ఒక న్యాయస్థానం యుక్తవయసులో ఉండగా అత్యాచారానికి గురైన మహిళకు ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ.6849 కోట్లు) పరిహారం ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఆమెకు 14 ఏళ్లున్నప్పుడు ఒక సాయుధ సెక్యూరిటీ గార్డు అత్యాచారం చేశాడు.

హోప్ ఛెస్టన్‌గా పేరు మార్చుకున్న ఆమె.. తన తరపున తన తల్లి చేత 2015లో ఈ దావా వేయించారు. ఈ తీర్పు అత్యాచార బాధితులందరికీ దక్కిన విజయం అని ఆమె చెప్పారు.

అమెరికాలో అత్యాచార దాడి కేసుల్లో అత్యంత భారీ పరిహారం ప్రకటించిన కోర్టు కేసు ఇదేనని ఆమె తరపు న్యాయవాది తెలిపారు.

అయితే, సదరు సెక్యూరిటీ సంస్థ విలువ ఒక బిలియన్ డాలర్లు ఉండదు. న్యాయమూర్తి పరిహార మొత్తాన్ని తగ్గించవచ్చు. కాబట్టి తుది పరిహార మొత్తం ఎంతనేది స్పష్టత లేదు.

ఛెస్టన్ ప్రస్తుత వయసు 20 ఏళ్లు. ఆమె న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. అత్యాచార బాధితులకు న్యాయం జరుగుతుందని ఈ తీర్పు రుజువు చేసిందని అన్నారు.

Image copyright AFP/Getty

ట్రంప్, కిమ్ నాణేనికి పెరిగిన డిమాండ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా ‘సుప్రీమ్ లీడర్’ కిమ్ జోంగ్ ఉన్‌ల భేటీ జరుగుతుందో లేదో స్పష్టత లేదు. దీన్ని రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

అయితే, సింగపూర్‌లో జూన్ 12వ తేదీన జరగాల్సిన వీరి భేటీ నేపథ్యంలో విడుదలైన స్మారక నాణేనికి మాత్రం ట్రంప్ ప్రకటన తర్వాత మరింత డిమాండ్ పెరిగింది.

ఎంతలా అంటే.. దీన్ని విక్రయిస్తున్న వైట్ హౌస్ గిఫ్ట్ షాప్ వెబ్‌సైట్ క్రాష్ అయ్యేంతగా!!

వాస్తవానికి ఇలాంటి నాణేలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి.. అందరి దృష్టినీ ఆకర్షించింది వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ ఏజెన్సీ (డబ్ల్యుహెచ్‌సీఏ) తయారు చేసిన ట్రంప్, కిమ్ నాణెం. ఈ ఏజెన్సీ తయారు చేసే నాణేలను విదేశీ అతిథులు, రాయబారులకు బహూకరిస్తుంటారు.

మరొకటి, ట్రంప్, కిమ్‌లతో పాటు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ముగ్గురి ఛాయాచిత్రాలతో కూడిన నాణెం. దీన్నే వైట్ హౌస్ గిఫ్ట్‌ షాపు విక్రయిస్తోంది.

దీని వాస్తవ ధర 24.95 డాలర్లు కాగా.. భారీ రాయితీ కల్పించి 19.95 డాలర్లకే దీన్ని అమ్మకానికి పెట్టింది. ఒకవేళ ఈ ఇద్దరు నాయకుల మధ్య భేటీ జరగకపోతే.. డబ్బుల్ని వెనక్కు ఇస్తామని కూడా చెబుతోంది.

ఫ్రీమాన్ Image copyright PA

మోర్గాన్ ఫ్రీమాన్‌‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. క్షమాపణలు చెప్పిన నటుడు

అమెరికా సినీ నటుడు మోర్గాన్ ఫ్రీమాన్‌పై ఎనిమిది మంది మహిళలు, ఇతర ప్రజలు లైంగికంగా తప్పుగా ప్రవర్తించాడంటూ ఆరోపణలు చేశారు. దీంతో ఆయన క్షమాపణలు తెలిపారు.

‘గోయింగ్ ఇన్ స్టైల్’ అనే హాస్య చిత్రం షూటింగ్ సందర్భంగా కొన్ని నెలల పాటు ఫ్రీమాన్ తనను వేధించారని చిత్ర నిర్మాణ సహాయకురాలు ఒకరు ఆరోపించారని సీఎన్ఎన్ పేర్కొంది.

80 ఏళ్ల ఫ్రీమాన్ తనను పదేపదే తాకేవాడని, తన స్కర్ట్‌ను పైకి లేపేందుకు ప్రయత్నించాడని, ‘అండర్‌వేర్ వేసుకున్నావా’ అని తనను అడిగేవాడని ఆమె చెప్పారు.

కాగా, తన వల్ల ఎవరైనా ఇబ్బందిపడినా, అగౌరవంగా భావించుకున్నా తాను క్షమాపణలు చెబుతున్నానని ఫ్రీమాన్ తెలిపారు. మహిళల్ని ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశ్యం కాదన్నారు.

హాలీవుడ్‌లో హార్వే వైన్‌స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత లైంగిక వేధింపులను వ్యతిరేకిస్తూ #MeeToo ప్రచారోద్యమం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా.. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా

ప్రాణాలు పోతున్నాయని చెప్పినా 18 ఆస్పత్రులు చేర్చుకోలేదు.. ప్రభుత్వం స్పందించింది, చనిపోయాక

ఆంధ్రప్రదేశ్: పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాల విభజన లాభమా.. నష్టమా

‘ఉపాధి లేదు.. చేతిలో డబ్బు లేదు’.. మహిళలను టార్గెట్ చేస్తున్న అక్రమ రవాణా ముఠాలు

రెఫరెండంలో పుతిన్‌ దేశభక్తి అస్త్రం.. 2036 వరకు ఆయనే అధికారంలో ఉండబోతున్నారా

‘వాటిని ఆపకపోతే.. మాకు యుగాంతమే’

‘3 నెలల్లో కరోనా టీకా.. తొలి వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే’

హైడ్రోజన్ విప్లవం ఇప్పటికైనా వస్తుందా

అనాథ ఉడుత వైరల్ వీడియో