విశ్లేషణ: కిమ్‌తో భేటీని ట్రంప్ ఎందుకు రద్దు చేసుకున్నారు? అమెరికా వ్యూహం ఏంటి?

ట్రంప్, కిమ్

ఫొటో సోర్స్, AFP

ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్‌తో జరగాల్సిన శిఖరాగ్ర సదస్సును రద్దు చేసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. దాంతో సదస్సు కోసం కొన్ని వారాలుగా కనిపించిన సానుకూల సంకేతాలకు బ్రేక్ పడింది. అసలు ఏం జరిగింది? అన్న దానిపై ప్రముఖ విశ్లేషకులు అంకిత్ పాండా అందిస్తున్న కథనం.

జూన్ 12న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్‌తో సింగపూర్‌లో జరగాల్సిన శిఖరాగ్ర సదస్సును రద్దు చేసుకుంటున్నట్టు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఉదయం విడుదల చేసిన లేఖలో ప్రకటించారు.

ఇటీవల ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యక్తమైన "తీవ్ర ఆగ్రహం, బహిరంగ శత్రుత్వం" ఆధారంగా తానీ నిర్ణయానికి వచ్చినట్టు ట్రంప్ వివరణ ఇచ్చారు.

ఈ సమావేశం జరిగితే తొలిసారి అమెరికా అధ్యక్షుడు, ఉత్తర కొరియా అధినేతతో భేటీ అయ్యేవారు.

అయితే, అంతకు ముందు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఉత్తర కొరియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి చో సోన్-హుయి మధ్య మాటల తూటాలు పేలాయి.

సింగపూర్ సదస్సులో అమెరికా పెట్టే షరతులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్- ఉన్ లొంగకపోతే "ఉత్తర కొరియాకు కూడా లిబియాకు పట్టిన గతే పట్టొచ్చు" అని మైక్ పెన్స్ వ్యాఖ్యానించారు. అందుకు చో సోన్ ఘాటుగా స్పందించారు. "మైక్ పెన్స్ ఓ పిచ్చివాడు, రాజకీయ డమ్మీ" గా అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ఉత్తర కొరియా తన అణు పరీక్షల కేంద్రంలో సొరంగాలను ధ్వంసం చేసిన కొన్ని గంటల్లోనే ట్రంప్ నిర్ణయం వెలువడింది

ఈ సదస్సు ముగింపు కథ మొదలైంది ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ నుంచే. శిఖరాగ్ర సదస్సు ద్వారా ఉత్తర కొరియా నుంచి అమెరికా అనేక హామీలను రాబట్టవచ్చన్న ఆశాభావాన్ని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

అణు నిరాయుధీకరణతో పాటుగా, రసాయన, జీవ ఆయుధాలను కూడా త్యజించేందుకు ఉత్తర కొరియా ఈ భేటీలో అంగీకరించాల్సి ఉంటుందన్న ప్రతిపాదన చేశారు బోల్టన్.

కానీ, ఉత్తర కొరియాతో దౌత్యపరమైన సదస్సు విజయవంతంగా సాగాలన్న ఆసక్తి బోల్టన్‌లో ఎన్నడూ లేదనే చెప్పొచ్చు.

ఎందుకంటే.. ట్రంప్‌కి జాతీయ భద్రతా సలహాదారుడిగా నియమితులు కాకముందు అతనో సాధారణ పౌరుడు. కిమ్‌తో భేటీ అయ్యేందుకు ట్రంప్ అంగీకరించిన తర్వాత బోల్టన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సంప్రదింపుల ద్వారా మన సమయమే వృథా అవుతుంది, మనం ఆశించిన ఫలితాలేవీ రావు" అని వ్యాఖ్యానించారు.

నిజానికి గతంలో లిబియా నుంచి ఎలాంటి అంగీకారాలను అమెరికా రాబట్టగలిగిందో.. ఇప్పుడు ఉత్తర కొరియా ముందు కూడా అలాంటి ప్రతిపాదనలు ఉంచాలన్నది బోల్టన్ ఆలోచన.

ఫొటో సోర్స్, AFP/GETTY

ఫొటో క్యాప్షన్,

అణు నిరాయుధీకరణకు 2003లో లిబియా అంగీకరించింది

లిబియా నుంచి ఉత్తర కొరియా పాఠం నేర్చుకుందా?

2003లో గడాఫీ హయాంలో లిబియాలో అణు నిరాయుధీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

లిబియాతో ఉత్తర కొరియాను పోల్చడాన్ని ఉత్తర కొరియా సహాయ మంత్రి చో సోన్-హుయి తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తర కొరియా పూర్తిస్థాయి అణ్వాయుధ సంపత్తి, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, థర్మో న్యూక్లియర్ ఆయుధాలు కలిగిన దేశం అన్న విషయం గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.

అప్పట్లో లిబియా దగ్గర పెద్దగా అణ్వాయుధాలు ఏమీ లేవు. కొద్దిపాటి ఆయుధాలతోనే ఆ దేశం గొప్పలు చెప్పుకునేదన్న అభిప్రాయం ఒకటి ఉండేది.

అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో 2003లో ఏకమొత్తంగా వాటిని నాశనం చేయడానికి, అంతర్జాతీయ అణుశక్తి కమిషన్ తనిఖీలకు లిబియా అంగీకరించింది. దాన్నే 'లిబియా మోడల్‌'గా అమెరికా చెబుతుంటుంది.

ఆ తర్వాత 2011లో లిబియాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. లిబియా నియంత కల్నల్ గడాఫీ ఆ నిరసనలను అణచివేయడంతో, అక్కడ అంతర్యుద్ధం మొదలైంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం మేరకు నాటో బలగాలు లిబియాపై దాడులు ప్రారంభించాయి. చివరికి గడాఫీ అంతమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా ఒత్తిళ్ల వల్ల అణ్వాయుధాలను త్యజించేందుకు అంగీకరించిన లిబియా పరిస్థితి చివరికి ఏమయ్యిందో.. ఉత్తర కొరియా పాలకుడు గ్రహించారు.

అందుకే ట్రంప్ చేసే వ్యాఖ్యలను హెచ్చరికలుగానే ఉత్తర కొరియా పరిగణిస్తూ వచ్చింది.

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను కూడా ఓ హెచ్చరికగానే చూసింది.

ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సింగపూర్ శిఖరాగ్ర సదస్సును రద్దు చేయడం ద్వారా అమెరికాకు వచ్చిన నష్టమేమీ లేదు.

ఉత్తర కొరియాతో అమెరికా చర్చలకు దక్షిణ కొరియా ప్రాధాన్యమిస్తున్న తరుణంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణ కొరియాను ఇరకాటంలో పడేసింది.

మరోపక్క ఉత్తర కొరియా తన అణు పరీక్షల కేంద్రంలో సొరంగాలను ధ్వంసం చేసిన కొన్ని గంటల్లోనే వెలువడిన ఈ నిర్ణయం అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలను తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)