అంతర్జాతీయ వార్తలు: డీజిల్ ధరల పెంపుపై బ్రెజిల్ ట్రక్ డ్రైవర్ల ఆగ్రహం.. స్తంభించిన దేశం.. ‘రంగంలోకి సైన్యం’

ఫొటో సోర్స్, Getty Images
బ్రెజిల్‌లో 2016 నుంచి డీజిల్ ధరలు దాదాపు రెట్టింపు పెరిగాయి. దీనికి నిరసనగా ట్రక్ డ్రైవర్లు సమ్మెకు దిగటంతో దేశం స్తంభించిపోయింది.
పెట్రోల్ స్టేషన్లలో భారీగా ప్రజలు క్యూలుకట్టారు. విమానాశ్రయాల్లో ఇంధనం నిండుకుంది. సూపర్‌మార్కెట్లు ఖాళీ అయ్యాయి.
డ్రైవర్లు 15 రోజుల పాటు సమ్మెను నిలిపివేస్తే.. ఇంధన పన్నులను తొలగించటానికి, పెట్రోల్ పంపుల్లో ధరలను నెల రోజుల పాటు 10 శాతం తగ్గించటానికి ప్రభుత్వం అంగీకరించిందని గురువారం ప్రకటించింది.
ఫొటో సోర్స్, Getty Images
అయితే.. అల్పసంఖ్యాకులైన ఒక అతివాద డ్రైవర్ల వర్గం ఈ ఒప్పందాన్ని అడ్డుకుంటోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఇంధనంపై సుంకాల రద్దు మీద చట్టం చేసే వరకూ సమ్మె కొనసాగిస్తామని అబ్కామ్ డ్రైవర్ల సంఘం ఇంతకుముందు ప్రకటించింది.
ఫొటో సోర్స్, Getty Images
అయితే, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా రహదారులపై ట్రక్కులను నిలిపివేసి సమ్మె చేస్తున్న డ్రైవర్లను ఖాళీ చేయించటానికి సైన్యాన్ని రంగంలోకి దింపుతానని దేశాధ్యక్షుడు తెమర్ హెచ్చరించారు.
ఈ హెచ్చరికతో రోడ్లను ఖాళీ చేయటానికి డ్రైవర్లు సిద్ధమయ్యారు.
ఫొటో సోర్స్, AFP/GETTY
ఈ సమ్మెలో పాల్గొంటున్న ప్రధాన డ్రైవర్ల సంఘాల్లో ఒకటైన అబ్కామ్ డ్రైవర్ల సంఘం.. దేశాధ్యక్షుడి హెచ్చరిక విచారకరమైనదని పేర్కొంది.
తమ సభ్యుల భద్రత దృష్ట్యా రోడ్ల నుంచి ట్రక్కులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
ఫొటో సోర్స్, Reuters
10 లక్షల డాలర్ల బెయిల్‌పై హార్వే వైన్‌స్టీన్ విడుదల
అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో అరెస్టైన మాజీ హాలీవుడ్ మొఘల్ హార్వే వైన్‌స్టీన్ 10 లక్షల డాలర్ల బెయిల్ మీద విడుదలయ్యారు.
న్యూయార్క్ పోలీసుల ముందు లొంగిపోయిన వైన్‌స్టీన్ (66).. జీపీఎస్ ట్రాకర్‌ను ధరించటం, తన పాస్‌పోర్టును అప్పగించాలన్న నిబంధనలకు కూడా అంగీకరించి బెయిల్ పొందారు.
పరస్పర అంగీకారం లేకుండా లైంగిక చర్యలకు పాల్పడ్డానన్న ఆరోపణలను ఆయన తిరస్కరిస్తున్నారు. నిర్దోషినని వాదిస్తారని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు.
వైన్‌స్టీన్ తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపించిన నటి రోజ్ మెక్‌గోవాన్ ఆయన అరెస్ట్ మీద స్పందిస్తూ.. ‘‘అతడి బారినపడి బయటపడ్డ వారికి ఇది అద్భుతమైన రోజు’’ అని అభివర్ణించారు.
‘‘ఇది ముఖ్యమైన పరిణామం. అధికార దుర్వినియోగానికి చెంప పెట్టు. అయితే ఇది ఆరంభమే. ముగింపు వరకూ తీసుకెళ్లగలిగితే మేం విజయం సాధించగలం’’ అని ఆమె పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, EPA
ఒమన్‌లో మెకును తుపాను కల్లోలం
దక్షిణ ఒమన్ మీద పెను గాలులు, వానలతో మెకును తుపాను విరుచుకుపడింది.
గంటకు 170 కిలోమీటర్ల వేగంతో వీచిన తుపాను గాలుల కారణంగా.. ఒక 12 ఏళ్ల బాలిక గోడకు కొట్టుకుని చనిపోయిందని అధికారులు తెలిపారు.
ధోఫార్, అల్-వుస్తా ప్రావిన్సుల్లో చాలా ప్రాంతాలను వరద ముంచెత్తిన దృశ్యాలను ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నీటమునిగి కనిపించాయి. ఈ రెండు ప్రావిన్సుల్లో తీర ప్రాంతాల నుంచి వేలాది మందిని ఖాళీ చేయించారు.
మెకును తుపాను మొదట యెమన్ దీవి సొకోట్రాను అతలాకుతలం చేసింది. కనీసం ఏడుగురు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ దీవిని సంక్షుభిత ప్రాంతంగా యెమన్ ప్రకటించింది.
ఆ మరుసటి రోజు ఒమన్‌లోని సలాలా నగరం వద్ద తుపాను తీరం దాటింది. శుక్రవారం బలపడిన తుపాను.. క్రమంగా బలహీనపడుతోందని అధికారులు చెప్పారు.
ఫొటో సోర్స్, PA/GETTY IMAGES
జేమ్స్ బాండ్ సినిమాకి డానీ బోయెల్ దర్శకత్వం
జేమ్స్ బాండ్ సిరీస్‌లో తర్వాతి సినిమాకు.. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ దర్శకుడు, ఆస్కార్ విజేత డానీ బోయెల్ దర్శకత్వం వహించబోతున్నారు.
2015లో విడుదలైన ‘స్పెక్టర్’ తర్వాత రూపొందుతున్న బాండ్ సినిమా ఇదే. దీనిని 2019లో విడుదల చేస్తారు.
బాండ్ సినిమా మీద స్పూఫ్‌గా బోయెల్ దర్శకత్వంలో తీసిన ‘లండన్ 2012’ సినిమాలో.. బాండ్ పాత్రధారి డానియల్ క్రెయిగ్ అతిథి పాత్రలో కనిపించారు.
వీరిద్దరూ కలిసి జేమ్స్ బాండ్ సిరీస్‌లో 25వ సినిమా కోసం పనిచేయనున్నారు. డానియల్ క్రెయిగ్ బాండ్ పాత్రలో నటించటం ఇది ఐదోసారి.
డానీ బోయెల్ దర్శకత్వంలో జేమ్స్ బాండ్ సినిమా ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)