ఐర్లాండ్ అబార్షన్‌ రెఫరెండం: చట్ట సవరణకు అనుకూలంగా ఓటింగ్

ఐర్లాండ్‌లో శిశువు

ఫొటో సోర్స్, BRIAN LAWLESS

ఐర్లాండ్‌లో అబార్షన్ చట్ట సవరణకు అనుకూలంగా అక్కడి ప్రజలు తీర్పు చెప్పారు. 66.4 శాతం ప్రజలు సవరణకు అనుకూల ఓటు వేశారని అధికారులు తెలిపారు.

అంతకు ముందు అబార్షన్‌కు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ సూచించిన నేపథ్యంలో ఈ పరిణామాన్ని ఐరిష్ ప్రధాని నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణించారు.

నిషేధం ఎత్తివేయాలంటూ దేశంలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఐరిష్ ప్రధాని కూడా ఓటు వేశారు.

అబార్షన్ విషయంలో జరిగిన ఎగ్జిట్ పోల్స్ అనంతరం ప్రధాని లియో వరాద్కర్ మాట్లాడుతూ.. ''ఈ రోజు ప్రజలు మాట్లాడారు.. ఆధునిక దేశంలో ఆధునిక రాజ్యాంగం కావాలని ప్రజలు కోరారు'' అని అన్నారు.

69% మంది ప్రజలు.. రాజ్యాంగ సవరణకు మద్దతుగా ఓటు వేశారని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.

తుది ఫలితాలు కూడా చట్ట సవరణకే అనుకూలంగా వచ్చాయి. 66.4 శాతం ప్రజలు సవరణకు అనుకూల ఓటు వేశారని అధికారులు తెలిపారు. 33.6 శాతం వ్యతిరేక ఓటు వేసినట్లు వివరించారు.

సరళీకరణకు మద్దతుగా ప్రచారం చేసిన వరాద్కర్ మాట్లాడుతూ, ''దేశంలో గత 20 సంవత్సరాలుగా జరుగుతోన్న విప్లవం పరిసమాప్తం అయ్యింది. ఇకపై తమ ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్త తీసుకునే అవకాశం మహిళలకు ఉంటుంది. వారిని గౌరవించండి'' అన్నారు.

ఫొటో సోర్స్, PA

ఏమీటీ ప్రజాభిప్రాయ సేకరణ

శుక్రవారం నాడు అబార్షన్‌పై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. వారిని.. ‘గర్భస్థ శిశువుకు కూడా గర్భిణీ స్త్రీతో సమానమైన హక్కులు ఉంటాయి’ అని వివరించే 8వ సవరణను మార్చాలా లేక అలాగే కొనసాగించాలా? అని ప్రశ్నించారు.

ప్రస్తుత చట్టం ప్రకారం.. గర్భిణీ స్త్రీ ఆరోగ్యం విషమించినపుడు మాత్రమే అబార్షన్‌కు ఆ ప్రభుత్వం అంగీకరిస్తుంది. కానీ అత్యాచారాలు, అసహజ సంబంధాలతో వచ్చిన గర్భం, లేదా పిండం సహజంగా వృద్ధి చెందని సందర్భాల్లో కూడా అబార్షన్‌కు ఐరిష్ చట్టం అనుమతించదు.

సరికొత్త అబార్షన్ చట్టం ఈ యేడాది చివరికల్లా అమల్లోకి వస్తుందని వరాద్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అబార్షన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కొందరు మాత్రం ఎగ్జిట్ పోల్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

''ఇకపై గర్భస్థ శిశువులు జీవించే హక్కును కోల్పోయారు'' అని అభిప్రాయపడ్డారు.

ప్రతిపక్ష పార్టీ నేత మిషెల్ మార్టిన్ కూడా.. ''ఈ ఒక్క ఓటు కొత్త శకానికి నాంది'' అని వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో తాను ఎంతగానో పోరాడానని, చివరకు ప్రజలు సరైన దారినే ఎంచుకున్నారన్నారు. ఇకపై ఐరిష్ ఆసుపత్రుల్లోని మహిళా సంరక్షణ మెరుగుపడుతుందని అన్నారు.

ఫలితాలపట్ల సానుకూలంగా స్పందించిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ.. ''మహిళల హక్కుల విషయంలో ఇదో గొప్ప విజయం. ఆధునిక ఐర్లాండ్ ఆవిర్భవానికి ఇది నాంది'' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP/getty

అబార్షన్‌పై వివాదం ఇప్పటిది కాదు

కఠినమైన అబార్షన్ చట్టంలో సంస్కరణలు తీసుకురావాలా? వద్దా? అనే అంశంపై ఐర్లాండ్‌లో ఈ నెల 25న అంటే శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.

ఈ సమస్యపై ఐర్లాండ్‌లో ఆరోసారి నిర్వహించిన రెఫరెండం ఇది.

గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ అబార్షన్ చేయడానికి అనుమతి ఉంది.

అత్యాచారం వల్ల గర్భం వచ్చినా, అవాంఛిత గర్భం, గర్భస్థ శిశువు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నా కూడా అబార్షన్ చేయడానికి దేశంలో అనుమతించరు.

ఐరీష్ చరిత్రలో అబార్షన్‌లపై వచ్చిన వివాదాలు, చట్టాలను ఒకసారి పరిశీలిద్దాం.

1861 - కొత్త చట్టం

1861లో మొదటిసారి ఐర్లాండ్‌లో అబార్షన్‌లపై నిషేధం విధించారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం కూడా ఈ చట్టం కొనసాగింది.

1983 - తొలిసారిగా రెఫరెండం

తల్లికి ఉన్నట్లే గర్భస్థ శిశువుకు కూడా ఆమెతో సమాన స్థాయిలో జీవించే హక్కు ఉంటుందని స్పష్టం చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం సవరణ చేశారు.

రాజ్యాంగానికి 8వ సవరణ చేసి ప్రకరణ 40.3.3 కింద కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Reuters

1992 - కోర్టు కేసు కారణంగా రెఫరెండం

అత్యాచారానికి గురై ఆత్మహత్యకు యత్నించిన 14 ఏళ్ల బాలిక అబార్షన్ కోసం ఇంగ్లాండ్ వెళ్లడానికి సిద్ధమవగా కోర్టు జోక్యం చేసుకొని ఆమె ప్రయాణంపై నిషేధం విధించింది. అయితే, ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ కేసు ఐర్లాండ్‌లో 'ఎక్స్' కేసుగా పేరొందింది.

దీంతో అబార్షన్‌ నిషేధానికి వ్యతిరేకంగా, అనుకూలంగా ప్రచారం మొదలైంది. ఐర్లాండ్‌తో పాటు, న్యూయార్క్, లండన్‌లలో ప్రదర్శనలు జరిగాయి.

అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ, 'ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందనే కారణంగా అబార్షన్‌లకు అనుమతించడం సరికాదు' అని ఐర్లాండ్ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

అయితే అదే ఏడాది నవంబర్‌లో 'ఎక్స్' కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి మూడు సందర్భాల్లో అబార్షన్ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని నిర్ణయించారు.

అయితే, అందులో రెండు సవరణలు ( 13,14 సవరణలు) మాత్రమే ఆమోదం పొందాయి.

కానీ, 'ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందనే కారణంగా అబార్షన్‌లకు అనుమతించడం సరికాదు' అనే 12వ సవరణ ఆమోదం పొందలేదు.

ఫొటో సోర్స్, Getty Images

2002 -రెఫరెండం

ఆత్మహత్య చేసుకుంటారనే కారణంతో అబార్షన్‌కు చట్టబద్ధత కల్పించాలా అని ప్రజాభిప్రాయసేకరణకు వెళ్లగా ప్రజలు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

2010 - కోర్టు కేసు

అబార్షన్ నిషేధంపై ముగ్గురు మహిళలు ఐర్లాండ్‌పై యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ను ఆశ్రయించారు.

ఏ సందర్భంలో అబార్షన్ చేయాలి? గర్భిణి జీవితం ప్రమాదంలో ఉందా? అంశాల్లో ఐర్లాండ్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలో విఫలమైందని యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ పేర్కొంది.

2012 - గర్భస్రావం కారణంగా అబార్షన్‌ చేయాలన్న మహిళ

కానీ, ఆ తరవాత కొద్ది రోజులకే ఆమె గర్భస్రావం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో చనిపోయారు. సవిత మరణంతో దేశవ్యాప్తంగా వైద్యులకు, రాజకీయ నేతలకు, అబార్షన్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి.

అబార్షన్ చట్టాల్లో మార్పులు చేయాలనే ఆందోళనలు ఊపందుకున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

2013 - చట్ట సవరణ

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేసేందుకు వీలుగా చట్ట సవరణ చేశారు.

తల్లి ప్రాణాలకు ముప్పు వచ్చిందని వైద్యులు భావించినపుడు అబార్షన్ చేసేందుకు అనుమతిస్తూ ఈ చట్ట సవరణ చేశారు.

ఒకవేళ చట్ట విరుద్ధంగా అబార్షన్ చేస్తే దోషులకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించేలా మార్పులు చేశారు.

2015 - మరో ప్రజాభిప్రాయ సేకరణకు సిఫార్సు

ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక హక్కులపై ఐక్యరాజ్య సమితి కమిటీ అబార్షన్లపై మరో ప్రజాభిప్రాయ సేకరణకు సిఫార్సు చేసింది.

అత్యాచారం వల్ల వచ్చిన గర్భం, గర్భిణికి ప్రమాదకరమైన సందర్భాలపై మరింత స్పష్టత కోరింది. ఈ సందర్భాల్లో గర్భ విచ్ఛిత్తిని నేరంగా పరిగణించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

2017 - పౌర సభ సిఫార్సు

అబార్షన్‌కి ఆంక్షల రహిత అనుమతి ఇవ్వాలన్న సిఫార్సును పౌర సభ ఆమోదించింది. ఇందులో గర్భం వచ్చిన తొలి నాళ్లలో అబార్షన్ సిఫార్సుకు అనుగుణంగా 64 శాతం ఓట్లు వచ్చాయి.

అయితే దీనిపైనా భిన్నవాదనలు వచ్చాయి. దీంతో చట్ట సవరణ అవసరమన్న అభిప్రాయం తెరపైకి వచ్చింది.

2018లో చట్ట సవరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని ఐర్లాండ్ ప్రభుత్వం పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP/getty

2018 - రెఫరెండానికి తేదీ నిర్ణయం

ఐర్లండ్ మంత్రి ఇయోగన్ ముర్ఫీ అబార్షన్ పై ప్రజాభిప్రాయ సేకరణకు తేదీ నిర్ణయిస్తూ ఒక ఆదేశంపై సంతకం చేశారు.

జీవించే హక్కుకు భంగం కలిగించని విధంగా గర్భస్థ శిశువుకు రక్షణ ఉండాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రజాభిప్రాయ సేకరణకు తేదీ నిర్ణయమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)