అంతర్జాతీయ వార్తలు: ‘ట్రంప్‌ను కలవాల్సిందే’..కిమ్ జోంగ్ ఉన్ ‘కృత నిశ్చయం’

డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్-ఉన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సింగపూర్‌లో తన శిఖరాగ్ర సమావేశం జరగాలని ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ ‘‘కృతనిశ్చయ’’మని ఆ దేశ అధికారిక మీడియా చెప్తోంది.

ఉత్తర కొరియా ‘‘విరోధా’’న్ని కారణంగా చూపుతూ.. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్ గురువారం ప్రకటించారు. అయితే.. ఉత్తర కొరియా నుంచి సామరస్యపూర్వక సందేశాలు రావటంతో తిరిగి ఆ భేటీకి తాను సానుకూలమేనని చెప్పారు.

ఉత్తర, దక్షిణ కొరియాల నాయకులు తాము ‘‘తరచుగా కలుసుకోవాల’’ని కూడా నిర్ణయించినట్లు ఉత్తర కొరియా కేసీఎన్ఏ ఏజెన్సీ తెలిపింది.

కిమ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌లు శనివారం అకస్మాత్తుగా ఇరు దేశాల సరిహద్దులో భేటీ అయిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

ఇద్దరు నాయకుల మధ్య రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో పరస్పర అభిప్రాయాలను ‘‘విస్పష్టంగా’’ తెలియజేశారని మూన్ అధికార ప్రతినిధి చెప్పారు.

సింగపూర్‌లో జూన్ 12వ తేదీన జరపాలని నిశ్చయించిన అమెరికా - ఉత్తర కొరియాల శిఖరాగ్ర సదస్సును తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నంలో భాగంగా ఆ భేటీ జరిగినట్లు కనిపిస్తోంది.

సింగపూర్ శిఖరాగ్ర సదస్సు కోసం మూన్ జే-ఇన్ ‘‘ఎంతో కృషి చేశార’’ని కిమ్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారని.. ఆ భేటీ జరుగుతుందని ‘‘తన కృత నిశ్చయాన్ని’’ వ్యక్తంచేశారని ఒక ప్రకటనలో పేర్కొంది.

సింగపూర్ శిఖరాగ్రానికి ఏర్పాట్లు చేయటానికి అధికారుల బృందం ఈ వారాంతంలో బయల్దేరి వెళుతుందనే విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం నిర్ధారించింది.

లిబియాలో ‘పారిపోతున్న వలసదారుల’పై స్మగ్లర్ల కాల్పులు

లిబియాలోని ఉత్తర ప్రాంతంలో మనుషులను అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్ల కబంధ హస్తాల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించిన 100 మంది బృందంపై స్మగ్లర్లు కాల్పులు జరిపారని సహాయ సంస్థ ఎంఎస్ఎఫ్ తెలిపింది.

వారి కాల్పుల్లో కనీసం 15 మంది చనిపోయారని.. గాయపడిన వారిలో 25 మంది తప్పించుకుని బాని వాలీద్‌లో చికిత్స పొందారని వెల్లడించింది.

ఇంకా డజన్ల మంది వలసదారులు ముఖ్యంగా మహిళలు, చిన్నారులు స్మగ్లర్ల గుప్పిట్లోనే ఉండిపోయారని ఎంఎస్ఎఫ్ పేర్కొంది.

సహారా ఎడారి దిగువున ఉన్న ఆఫ్రికా దేశాల ప్రజలు సముద్ర మార్గం ద్వారా యూరప్ చేరుకునే ప్రయత్నాలకు లిబియా ముఖ్య కేంద్రంగా మారింది.

2011లో మోమ్మద్ గడాఫీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత లిబియా సంక్షోభంలో చిక్కుకుంది. అధికారం విభిన్న సాయుధ బృందాల మధ్య చీలిపోయింది. రెండు ప్రత్యర్థి ప్రభుత్వాలు తమ పట్టు బిగించడానికి అక్రమ కార్యకలాపాలకు అనుమతిస్తున్నాయి.

ఎరిత్రియా, ఇతియోపియా, సోమాలియాలకు చెందిన టీనేజర్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. యూరప్‌లో ఆశ్రయం కోసం వారు బయలుదేరి లిబియా చేరుకున్నారని ఎంఎస్ఎఫ్ తెలిపింది.

తాము మూడేళ్లుగా స్మగ్లర్ల చెరలో ఉన్నామని.. మానవ స్మగ్లర్ల ముఠాల మధ్య తమను విక్రయిస్తూ ఉన్నారని వారు చెప్పారు. మే 23వ తేదీన వారి చెర నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా స్మగ్లర్లు కాల్పులు జరిపారని వివరించారు.

ఉగాండాలో బస్సు ప్రమాదం.. 22 మంది మృతి

ఉగాండాలోని ఉత్తర ప్రాంతంలో జరిగిన ఒక బస్సు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా 22 మంది చనిపోయారని పోలీసులు తెలిపారు.

రాత్రివేళ లైట్లు లేకుండా ప్రయాణిస్తున్న ఒక ట్రాక్టర్‌ను బస్సు తొలుత ఢీకొట్టిందని, ఆ వెంటనే మరొక ట్రక్కును కూడా ఢీకొందని పోలీసులు ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.

రాజధాని కంపాలాకు ఉత్తరంగా 220 కిలోమీటర్ల దూరంలోని కిర్యాన్‌డాంగోలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 30 మంది కన్నా ఎక్కువ ఉందని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

అధికారిక లెక్కల ప్రకారం.. ఉగాండాలో 2015 - 2017 మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 10,000 మంది చనిపోయారు.

ఫ్రాన్స్: రూ. 81 లక్షలు పలికిన 1774 నాటి వైన్ బాటిల్

ఫ్రాన్స్‌లో జరిగిన ఒక వైన్ వేలంలో.. 1774 సంవత్సరానికి చెందిన ఒక వైన్ సీసా ధర రికార్డు స్థాయిలో 1,03,700 యూరోల (సుమారు రూ. 81 లక్షలు) పలికింది.

విన్ జోన్ (ఎల్లో వైన్) బాటిల్ తూర్పు జురా ప్రాంతం నుంచి వచ్చింది. ఇందులోని వైన్‌ను.. 16వ లూయీ పాలనా కాలంలో పండించిన ద్రాక్షల నుంచి తయారు చేశారు.

అదే కాలానికి చెందిన మరొక బాటిల్‌ 76,250 యూరోలు (సుమారు రూ. 60 లక్షలు), మూడో బాటిల్ రూ. 73,200 యూరోలు ఆర్జించాయి.

ఈ మూడు విన్ జోన్ వైన్ సీసాలనూ అనతోలీ వెర్సెల్ అనే వైన్ తయారీ సంస్థ తయారు చేసింది.

ఈ వైన్ సీసాలను కొన్న వారు కెనడావాసులని.. వారు అమెరికావాసుల కోసం కొనుగోళ్లు చేస్తుంటారని వేలం నిర్వాహక సంస్థ జురా ఎంచెరెస్ ప్రతినిధి చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

ఇక్కడ జరిగే వైన్ వేలంలో చివరిసారిగా నమోదైన రికార్డు ధర 2011లో పలికిన 57,000 యూరోలని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)