గూగుల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్: భావి నగరాలకు నమూనా అవుతుందా?
- జేన్ వేక్ఫీల్డ్
- టెక్నాలజీ రిపోర్టర్

ఫొటో సోర్స్, SidewalkToronto/facebook
నిరుపయోగంగా ఉన్న నదీముఖ ప్రాంతాన్ని.. ఓ మినీ మహానగరంగా మారుస్తామని సైడ్‌వాక్ హామీ ఇస్తోంది. అయితే.. ఈ నగరాన్ని వాస్తవంగా ఎప్పటికల్లా నిర్మిస్తారనే దానికి కాల పరిమితి ఏమీ లేదు
టొరంటో ఈస్టర్న్ వాటర్‌ఫ్రంట్ మీద ఒక కొత్త డిజిటల్ నగరాన్ని నిర్మిస్తున్నారు. ఈ నగర నిర్మాత ‘సైడ్‌వాక్ లాబ్స్’ అనే సంస్థ. అది.. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని సంస్థే.
ఇరవై ఒకటో శతాబ్దపు నగరవాసానికి తాము నిర్మిస్తున్న సిటీ నమూనాగా మారుతుందని ఆ సంస్థ ఆశిస్తోంది.
కానీ.. ఒక నగరం - ఒక భారీ కార్పొరేట్ సంస్థ మధ్య కుదిరిన ఈ అతి పెద్ద ఒప్పందం వివాదాస్పదంగా మారింది. పైగా.. ఆ కార్పొరేట్ సంస్థ ప్రపంచంలోనే భారీ టెక్నాలజీ సంస్థల్లో ఒకటి కావటంతో పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది.
ఫొటో సోర్స్, SIDEWALK LABS
సైడ్‌వాక్స్ ల్యాబ్స్ ప్రణాళిక రూపొందించిన ఈ నగరం అనేక మార్గాల్లో సమాచారం సేకరిస్తుంది
నిరుపయోగంగా ఉన్న నదీముఖ ప్రాంతాన్ని.. ‘‘ఇంటర్నెట్ ఆధారంగా’’ ఉన్న ఓ మినీ మహానగరంగా మారుస్తామని సైడ్‌వాక్ హామీ ఇస్తోంది. అయితే.. ఈ నగరాన్ని వాస్తవంగా ఎప్పటికల్లా నిర్మిస్తారనే దానికి కాల పరిమితి ఏమీ లేదు.
‘‘మరింత ఆరోగ్యవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఆనందభరితమైన జీవనాలను సృష్టించటం’’ ఈ ప్రాజెక్టు ఉద్దేశమని సదరు కంపెనీ అధిపతి, న్యూయార్క్ మాజీ డిప్యూటీ మేయర్ డాన్ డాక్టరాఫ్ బీబీసీకి చెప్పారు.
ట్రాఫిక్, ధ్వని, గాలి నాణ్యత వంటి సమాచారాన్ని సేకరించటంతో పాటు.. విద్యుత్ గ్రిడ్, వ్యర్థాల సేకరణ వంటి వాటి పర్యవేక్షణ కోసం ఈ నగరంలో విస్తృతంగా సెన్సర్లు ఏర్పాటు చేస్తారు.
ఫొటో సోర్స్, SIDEWALK LABS
ఈ నగరంలో జనం నడవటం, సైకిళ్ల మీద తిరగటం లేదంటే స్వయం చలిత ట్యాక్సీలను ఉపయోగించటాన్ని ప్రోత్సహిస్తారు
ఈ అంశం మీద టొరంటో డిప్యూటీ మేయర్ డెంజిల్ మిన్నన్-వాంగ్ సహా నగర వాసులు కొందరు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
‘‘సైడ్‌వాక్ నిజంగా ఏం సాధించాలని కోరుకుంటోంది? ఏ సమాచారాన్ని సేకరిస్తారు? ఆ సమాచారాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? టొరంటో నగరాన్ని వేధిస్తున్న అసలు ప్రశ్నలు ఇవి’’ అని ఆయన బీబీసీతో పేర్కొన్నారు.
అయితే.. పౌరులపై పర్యవేక్షణకు, వారి సమాచార సేకరణకు ఈ సెన్సర్లను ఉపయోగించబోమని సైడ్‌వాక్ ల్యాబ్స్ బీబీసీకి చెప్పింది. పరిసర ప్రాంతాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశం మీద పాలక సంస్థలకు ఆ సెన్సర్లు ఉపయోగపడతాయని పేర్కొంది.
అయితే.. ఆ సంస్థ తన సొంత సమాచారం విషయంలోనే అంత పారదర్శకంగా లేదని మిన్నన్ వాంగ్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
‘‘బహిరంగ సమాచారం గురించి సైడ్‌వాక్ మాట్లాడుతోంది. కానీ.. అసలు ముందు ‘వాటర్‌ఫ్రంట్ టొరంటో’తో ఒప్పందం ఏమిటనే సమాచారాన్నే ఆ సంస్థ బయట పెట్టటం లేదు’’ అని ఆయన తెలిపారు.
టొరంటో నగరంలోని ఓడరేవు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పునరుద్ధరించే బాధ్యతను చేపట్టిన సంస్థ వాటర్‌ఫ్రంట్ టొరంటో.
ఆ సంస్థతో సైడ్‌వాక్ తొలుత చేసుకున్న ఒప్పందం.. 12 ఎకరాల స్థలానికి మాత్రమే పరిమితం. కానీ.. మొత్తం 325 ఎకరాలున్న ఆ ప్రాంతమంతటికీ విస్తరించాలని సైడ్‌వాక్ కోరుకుంటోందని అది భారీ స్థాయిలో భూ ఆక్రమణ అవుతుందని భావిస్తున్నారు.
ఫొటో సోర్స్, SIDEWALK LABS
సైడ్‌వాక్ ల్యాబ్స్ ఇతర నగర ప్రాజెక్టులను కూడా నిర్మిస్తోంది.. న్యూయార్క్ నగరంలో వై-ఫై కియోస్కుల నిర్మాణం అందులో ఒకటి
‘‘అసలు ఏ భూమి గురించి మనం మాట్లాడుతున్నాం? అన్న ప్రాధమిక అంశం మీదే స్పష్టత లేదు’’ అని మిన్నన్-వాంగ్ చెప్పారు.
‘‘ఇది రియల్ ఎస్టేట్ క్రీడా? లేకపోతే టెక్నాలజీ ప్రాజెక్టా? మాకేమీ తెలీదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఒప్పందం ఎలా కుదిరిందని ప్రశ్నిస్తున్నది ఆయన ఒక్కరే కాదు.
యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో పట్టణ చట్టాల పరిశోధకురాలు మారియానా వాల్వెర్దె ‘ద కాన్వర్జేషన్’ అనే న్యూస్ వెబ్సైట్లో ఒక వ్యాసం రాస్తూ.. ‘‘గూగుల్ ప్రతినిధులు.. మామూలుగా, నియమనిబంధనల పరిధిలో నగరంతో నేరుగా సంప్రదించటం లేదు. వారు దూరంగా వాటర్‌ఫ్రంట్ టొరంటోతో రహస్యంగా చర్చలు జరుపుతున్నారు’’ అని పేర్కొన్నారు.
‘‘నగర సిబ్బంది.. చివరకు తమ నదీముఖ ప్రణాళిక నిపుణులను కూడా సంప్రదించలేదని గుర్తించారు. గూగుల్ ఆకాంక్షలకు.. ప్రజా చట్టాలు, విధానాలకు మధ్య సంఘర్షణకు దారితీయగల ముఖ్యమైన అంశాలను వారు ఇటీవల లేవనెత్తారు’’ అని తెలిపారు.
‘‘ఉదాహరణకు.. నగరంలో సేకరణకు సమన్యాయ విధానం అమలులో ఉంది. దాని ప్రకారం.. ఒక భారీ అమెరికా సంస్థ ఏ రకమైన గుత్తాధిపత్యానికీ చోటు లేదు’’ అని ఆమె వివరించారు.
ఫొటో సోర్స్, SIDEWALK LABS
భూగర్భ రోబోల సైన్యం.. వ్యర్థాల సేకరణ, పార్సిళ్ల డెలివరీ పనులు చేస్తాయి
భూగర్భ రోబోలు
నగరం కోసం ఆ సంస్థ కొన్ని వినూత్న ఆలోచనలు చేస్తోంది:
యాప్‌ల నియంత్రణతో స్వయంగా నడిచే కార్లు - ఆ ప్రాంతంలో రవాణాకు వెన్నెముకగా ఉంటాయి
‘ద లాఫ్ట్’ అని వ్యవహరించే బలమైన (ఉక్కుతో కాకుండా చెక్కతో చేసే) నిర్మాణాలతో భవనాలను వినియోగ అవసరానికి అనుగుణంగా మార్చుకునేలా కొత్త తరహాలో రూపొందిస్తారు
వాతావరణ నియంత్రణ - బాహ్య ప్రదేశాలను పౌరులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా చూడటం - అవసరమైనప్పుడు విచ్చుకుని, తర్వాత ముడుచుకుపోయే ప్లాస్టిక్ పైకప్పులతో ప్రజలకు వర్షంలో ఆశ్రయం కల్పిస్తే.. పాదచారులు నడిచే ఫుట్‌పాత్‌లు, సైకిళ్లు నడిచే బైక్ పాత్‌లు అవసరమైనపుడు వేడి చేస్తూ వాటిపై పడే మంచును కరిగిస్తాయి.
ఫొటో సోర్స్, SIDEWALK LABS
అవసరానికి అనుగుణంగా ఇళ్లుగాను, ఆఫీసులుగాను మార్చుకునేలా ఫ్యాక్టరీల్లో నిర్మించే మాడ్యులార్ బిల్డింగులను తయారు చేయాలన్నది సైడ్‌వాక్ ప్రణాళిక
అయితే.. టొరంటోలో సాధించబోయేది జీవితాలను అర్థవంతంగా మెరుగుపరచేదిగా ఉండేలా చూడటానికి.. నగర నాయకులు, స్థానిక విధాన రూపకర్తలు, విస్తృత సమాజంతో సంప్రదింపులకే ఈ ఏడాది మొత్తం పడుతుందని సైడ్‌వాక్ చెప్తోంది.
ఆ సంస్థ ఇప్పటివరకూ రెండు బహిరంగ సమావేశాలు నిర్వహించింది. మిన్నన్-వాంగ్ ఆ సమావేశాలకు హాజరుకాలేదు. అయినా.. ఆ సంస్థ చెప్తున్నది నమ్మశక్యంగా లేదని ఆయన అంటారు.
‘‘ఆ సమావేశాలు తూతూ మంత్రంగా సాగాయని నేను విన్నాను. ప్రజల సందేహాలను, ఆందోళనలను తీర్చటం మీద ఆ సమావేశాలు దృష్టిపెట్టలేదు. అసలు ఒప్పందంలో ఏముందో తెలుసుకోవాలని జనం కోరుకుంటున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘సైడ్‌వాక్ సంస్థ తను మాట్లాడాలని అనుకున్న దాని గురించి మాట్లాడుతోందా? లేక జనం మాట్లాడాలని కోరకుంటున్న దాని గురించి మాట్లాడుతోందా?’’ అని ప్రశ్నించారు.
ఫొటో సోర్స్, SIDEWALK LABS
మాడ్యులార్ ఇళ్లు, ఆఫీసుల నిర్మాణానికి స్టీలు దిమ్మెలు కాకుండా చెక్క దిమ్మెలు వాడతారు
అయితే.. హరితదనం అనేది అజెండాలో అగ్రస్థానంలో ఉంటుందనేది స్పష్టం. మరింత పర్యావరణ హితమైన భవన నిర్మాణ వస్తువులను ఉపయోగిస్తారు. అదికూడా నిర్మాణ ప్రాంతం గందరగోళంగా ఉండకుండా చూడటానికి ఆ వస్తువులను ఫ్యాక్టరీల్లో తయారుచేస్తారు. దీనివల్ల ‘‘తక్కువ వ్యయంతో, వేగంగా నిర్మించే ఇళ్ల పరిసరాల’’ను రూపొందించవచ్చునని సైడ్‌వాక్ అభివర్ణిస్తోంది.
వ్యర్థాలను గణనీయంగా తగ్గించటానికి.. రీసైక్లింగ్ (పునర్వినియోగం) కోసం ఉపయోగపడే వ్యర్థాలను వేరు చేయటానికి సెన్సర్లు ఉపయోగిస్తారు.
స్నాలగది సింకులు, షవర్లు, బాత్‌టబ్‌లు, వాషింగ్ మెషీన్ల నుంచి వచ్చే వాడేసిన నీటిని.. అద్దెదారులు పునర్వినియోగించుకునేలా సాయపడటానికి ఒక పైలట్ ప్రాజెక్టును కూడా ఆ సంస్థ రూపొందిస్తోంది.
ఫొటో సోర్స్, SIDEWALK LABS
సామాజిక సంరక్షణ, వైద్య సేవలు రెండిటినీ ఒకే కప్పు కిందకు తీసుకురావాలని కూడా సైడ్‌వాక్ యోచిస్తోంది
పట్టణవాదులు వర్సెస్ సాంకేతికవాదులు
ఇటువంటి నగరాన్ని సృష్టించటంలో ఉండే సవాళ్ల గురించి తెలియని వ్యక్తి కాదు డాక్టరాఫ్.
‘‘వినూత్న ఆవిష్కరణలతో పట్టణీకరణను సమ్మిళితం చేయటం చాలా కష్టమవుతుంది. పైగా నగరాలను నడిపించే, ప్రణాళికలు రచించే నగరవాదులకు - సాంకేతికవాదులకు మధ్య పెద్ద అగాధముంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ఈ రెండు పనులూ చేయగల ఒక టీమ్‌ను నిర్మించటం కష్టం’’ అని చెప్పారు.
అయితే.. ఈ సమ్మేళనాన్ని అందించగల వినూత్న పట్టణీకరణ సంస్థగా సైడ్‌వాక్ విశిష్ట స్థానంలో ఉందని ఆయన భావిస్తున్నారు. గూగుల్ ఇంజనీర్లు, పాలన నాయకుల విజ్ఞానాలను తమ సంస్థ కలపగలదని ఆయన అంటారు.
నదీముఖ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బిడ్డింగ్ ప్రక్రియ ప్రణాళికలో భాగంగా.. ఆ సంస్థ 150 రకాల స్మార్ట్ సిటీ ఉదాహరణలను పరిశీలించింది. పూర్తిగా కొత్తగా నిర్మించిన అబుదాబిలో మస్దార్, దక్షిణ కొరియాలోని సాంగ్డో నగరాలు కూడా వాటిలో ఉన్నాయి.
ఫొటో సోర్స్, SIDEWALK LABS
సైడ్‌వాక్ కలలు కంటున్న ఈ వినూత్న నగరం పౌరులు నివసించాలని కాంక్షించే నగరమవుతుందా?
‘‘ఇంతకుముందు నగరాలను నిర్మించటంలో చేసిన తప్పుల్లో ఒకటి ఏమిటంటే.. పై నుంచి నగరాల ప్రణాళిక రూపొందించవచ్చుననే భావన. కానీ నగరాలు అలా నడవవు. అవి సహజసిద్ధంగా అభివృద్ధి చెందుతాయి’’ అని డాక్టరాఫ్ అంటారు.
న్యూయార్క్ నగరాన్ని వదిలివెళ్లి టొరంటోలో నివసించిన పట్టణవాది జేన్ జాకబ్స్‌కు డాక్టరాఫ్ వీరాభిమాని. నగరాల్లో ఉమ్మడి స్థలాలను పెంచటాన్ని జాకబ్స్ ప్రోత్సహించారు.
‘‘ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అందించే సామర్థ్యం నగరాలకు ఉంది.. ఆ నగరాలను ప్రతి ఒక్కరి కోసం నిర్మించినపుడే అలా జరుగుతుంది’’ అన్న ఆమె మాట చాలా ప్రజాదరణ పొందింది.
ఈ హామీని గూగుల్ సంస్థ నగర ప్రయోగం నెరవేరుస్తుందా అనేదానిని ఎంతో మంది ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- పన్ను బకాయిలు చెల్లించిన మహేశ్ బాబు
- టెక్స్టింగ్ సరే.. మరి sexting అంటే? అలా చేయొచ్చా?
- వేధిస్తున్నాడని.. పిలిచి మర్మాంగం కోసేసింది
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
- పాము కాటు: ఏ పాములు ప్రమాదకరం? కాటేసినపుడు ఏం చేయాలి?
- #MeToo: 'నిర్మాతలతో, దర్శకులతో పడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్నారు'
- ‘నా న్యూడ్ చిత్రాలు గీశాక, నా కాళ్లకు నమస్కరిస్తారు’
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్‌లో ఎందుకు కొనసాగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)