ఐర్లాండ్ అబార్షన్ రెఫరెండం: ఆమె ప్రాణాలు కోల్పోయింది.. ఈమె చరిత్ర తిరగరాసింది

ఫొటో సోర్స్, Getty Images
ఐర్లాండ్‌లో అబార్షన్ ‘చట్ట సవరణ’కు కారణమైన వారిలో భారత్‌కు చెందిన సవిత హలప్పన్వార్ ఒకరు. ఆమె 2012లో ఐర్లాండ్‌లో ఉన్నపుడు అక్కడి అబార్షన్‌పై నిషేధం అమల్లో ఉన్నందువల్ల చనిపోయారు. తర్వాత అబార్షన్ చట్ట సవరణపై ఆందోళనలు ముమ్మరమయ్యాయి.
ఇప్పుడు చట్ట సవరణపై ఐర్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణ జరుపగా.. ఎక్కువ శాతం మంది అనుకూలంగా ఓటేశారు.
ఈ నేపథ్యంలో సవిత తల్లిదండ్రులు బీబీసీ మరాఠి ప్రతినిధి స్వాతి పాటిల్‌తో మాట్లాడారు.
సవిత తల్లి అక్క మహాదేవి మాట్లాడుతూ.. ‘అబార్షన్ చట్ట సవరణకు అనుకూలంగా ఓటేయడం మా కూతురు విజయం. ఇప్పుడు మేం చాలా ఆనందంగా ఉన్నాం. మా కుమార్తె చనిపోయిన తర్వాత ఆరేళ్ల అనంతరం చట్ట సవరణకు అనుకూల పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుంది. అబార్షన్‌ను చట్టబద్దం చేయడం కోసం ఆమె చేసిన పోరాటం ఊరికే పోలేదు.’ అని చెప్పారు.
అంతకు ముందు ఏం జరిగిందంటే..
అబార్షన్ నిషేధం చట్ట సవరణకు అనుకూలంగా ఐర్లాండ్ ప్రజలు భారీగా 66.4 శాతం ఓట్లు వేశారు. 33.6 శాతం మంది మాత్రం వ్యతిరేకించారు.
శుక్రవారం జరిగిన రెఫరెండంలో అబార్షన్ నిషేధం ఉపసంహరించాలని కోరుతున్న వారికి భారీ విజయం దక్కింది. ప్రస్తుతం మహిళల ప్రాణాలు ప్రమాదంలో పడ్డప్పుడు మాత్రమే అబార్షన్ అనుమతిస్తున్నారు. అత్యాచారం, అసహజ సంబంధాలతో గర్భం రావడం, పిండం సహజంగా వృద్ధి చెందిన కేసుల్లో దీన్ని అనుతించడం లేదు.
ఈ ఓటింగ్‌తో గర్భస్థ శిశువుకు కూడా తల్లిలాగే జీవించే హక్కు ఉంటుందని చెప్పే 8వ సవరణను ఇప్పుడు మార్చనున్నారు.
ఈ డిక్లరేషన్‌ను డబ్లిన్ కాజిల్ దగ్గర ప్రకటించారు.
ఒకే ఒక డొనెగల్ నియోజకవర్గంలో మాత్రం 8వ చట్ట సవరణ ఉపసంహరణకు వ్యతిరేకంగా 51.9 శాతం ఓటింగ్ జరిగింది.
ఉపసంహరణకు అనుకూలంగా జరిగిన ఓటింగ్‌తో ఐరిష్ పార్లమెంటులో ఈ చట్టాన్ని మార్చడానికి వీలవుతుంది. 2015లో స్వలింగ వివాహ చట్టబద్ధతపై జరిగిన చారిత్రక రెఫరెండంలో ఐర్లాండ్ ప్రజలు అనుకూలంగా ఓటు వేశారు.
ఫొటో సోర్స్, Getty Images
అవమాన భారం తప్పింది
ఫలితాలపై స్పందించిన ప్రధాని లియో వరాద్కర్ "ఐర్లాండ్‌కు ఇది చరిత్రాత్మక రోజు, దేశంలో నిశ్శబ్ద విప్లవం వచ్చింది" అన్నారు. సొంత నిర్ణయం తీసుకునేలా మహిళలను గౌరవించాలని, విశ్వసించాలని పిలుపునిచ్చారు. డాక్టర్లు కూడా ఇక రోగులకు తామేం చేయలేమని చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రహస్యం ముసుగును ఎత్తేశామని, కళంకానికి ఇక తావు లేదని అన్నారు.
నిషేధం ఎత్తివేయాలంటూ దేశంలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఐరిష్ ప్రధాని వరాద్కర్ కూడా ఓటు వేశారు.
సరళీకరణకు మద్దతుగా ప్రచారం చేసిన వరాద్కర్ మాట్లాడుతూ, ''దేశంలో గత 20 సంవత్సరాలుగా జరుగుతోన్న విప్లవం పరిసమాప్తం అయ్యింది. ఇకపై తమ ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్త తీసుకునే అవకాశం మహిళలకు ఉంటుంది. వారిని గౌరవించండి'' అన్నారు.
విశ్లేషణ
షేన్ హారిసన్, బీబీసీ న్యూస్, ఎన్ఐ డబ్లిన్ ప్రతినిధి
మరో మూడు నెలల్లో పోప్ ఫ్రాన్సిస్ ఐర్లాండ్ వెళ్లనున్నారు.
1983లో పోప్ జాన్ పాల్ 2 విజయోత్సవ పర్యటనకు నాలుగేళ్ల తర్వాత, ఐరిష్ ప్రజలు తమ రాజ్యాంగంలో 8వ చట్ట సవరణను ఏర్పాటు చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆ చట్టాన్ని సవరించాలని రెఫరెండం జరిగిన తర్వాత పోప్ పర్యటన జరుగుతుండటం గమనార్హం.
ఈ సవరణ తల్లితో పాటు గర్భస్థ శిశువుకు కూడా సమాన హక్కులను కల్పిస్తుంది.
శుక్రవారం జరిగిన ఓటింగ్‌తో అబార్షన్ చట్టాన్ని సరళతరం చేయడానికి పార్లమెంటు సభ్యులకు ఆస్కారం ఉంటుంది.
62 శాతం అనుకూల ఓటింగ్‌తో స్వలింగ వివాహాల చట్టాన్ని ఆమోదించిన మూడేళ్లలోనే జరిగిన ఇది దేశంలో సామాజిక మార్పుకు మరో సంకేతంగా నిలిచింది.
ఫొటో సోర్స్, Reuters
‘ఆందోళనలు కొనసాగిస్తాం’
"సేవ్ ది ఎయిత్" అనే ప్రచారకులు ఈ ఫలితాలను విషాదంగా పేర్కొన్నారు.
"ఐరిష్ ప్రభుత్వం ద్వారా గర్భస్థ శిశువుకు దక్కిన జీవించే హక్కు ఇక లేదు" అని ప్రతినిధి మెక్ గైర్క్ తెలిపారు.
పోల్స్ ప్రచురించిన తర్వాత యాంటీ అబార్షన్ ప్రచారకుల్లో ఒకరు తాము ఓటమి చెందామని అంగీకరించారు.
అయినా, ఐర్లాండ్‌లో అబార్షన్ క్లినిక్స్ తెరిస్తే, వాటికి వ్యతిరేకంగా తమ ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.
ఐరిష్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత మైకేల్ మార్టిన్ దీన్ని "కొత్త శకం ప్రారంభం" అని చెప్పారు.
ఈ విషయంలో తాను ఎంతగానో పోరాడానని, చివరకు ప్రజలు సరైన దారినే ఎంచుకున్నారన్నారు. ఇకపై ఐరిష్ ఆసుపత్రుల్లోని మహిళా సంరక్షణ మెరుగుపడుతుందని అన్నారు.
ఏమిటీ ప్రజాభిప్రాయ సేకరణ?
శుక్రవారం నాడు అబార్షన్‌పై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. వారిని.. 'గర్భస్థ శిశువుకు కూడా గర్భిణీతో సమానమైన హక్కులు ఉంటాయి' అని వివరించే 8వ సవరణను మార్చాలా లేక అలాగే కొనసాగించాలా? అని ప్రశ్నించారు.
ప్రస్తుత చట్టం ప్రకారం.. గర్భిణీ స్త్రీ ఆరోగ్యం విషమించినపుడు మాత్రమే అబార్షన్‌కు ఆ ప్రభుత్వం అంగీకరిస్తుంది. కానీ అత్యాచారాలు, అసహజ సంబంధాలతో వచ్చిన గర్భం, లేదా పిండం సహజంగా వృద్ధి చెందని సందర్భాల్లో కూడా అబార్షన్‌కు ఐరిష్ చట్టం అనుమతించదు.
సరికొత్త అబార్షన్ చట్టం ఈ యేడాది చివరికల్లా అమల్లోకి వస్తుందని వరాద్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అబార్షన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కొందరు మాత్రం ఎగ్జిట్ పోల్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
''ఇకపై గర్భస్థ శిశువులు జీవించే హక్కును కోల్పోయారు'' అని అభిప్రాయపడ్డారు.
ఫలితాల పట్ల సానుకూలంగా స్పందించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ.. ''మహిళల హక్కుల విషయంలో ఇదో గొప్ప విజయం. ఆధునిక ఐర్లాండ్ ఆవిర్భావానికి ఇది నాంది'' అని పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
అబార్షన్‌పై వివాదం ఇప్పటిది కాదు
కఠినమైన అబార్షన్ చట్టంలో సంస్కరణలు తీసుకురావాలా? వద్దా? అనే అంశంపై ఐర్లాండ్‌లో ఈ నెల 25న అంటే శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
ఈ సమస్యపై ఐర్లాండ్‌లో ఆరోసారి నిర్వహించిన రెఫరెండం ఇది.
గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ అబార్షన్ చేయడానికి అనుమతి ఉంది.
అత్యాచారం వల్ల గర్భం వచ్చినా, అవాంఛిత గర్భం, గర్భస్థ శిశువు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నా కూడా అబార్షన్ చేయడానికి దేశంలో అనుమతించరు.
ఐరిష్ చరిత్రలో అబార్షన్లపై వచ్చిన వివాదాలు, చట్టాలను ఒకసారి పరిశీలిద్దాం.
1861 - కొత్త చట్టం
1861లో మొదటిసారి ఐర్లాండ్‌లో అబార్షన్లపై నిషేధం విధించారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం కూడా ఈ చట్టం కొనసాగింది.
1983 - తొలిసారిగా రెఫరెండం
తల్లికి ఉన్నట్లే గర్భస్థ శిశువుకు కూడా సమాన స్థాయిలో జీవించే హక్కు ఉంటుందని స్పష్టం చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం సవరణ చేశారు.
రాజ్యాంగానికి 8వ సవరణ చేసి ప్రకరణ 40.3.3 కింద కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.
1992 - కోర్టు కేసు కారణంగా రెఫరెండం
అత్యాచారానికి గురై ఆత్మహత్యకు యత్నించిన 14 ఏళ్ల బాలిక.. అబార్షన్ కోసం ఇంగ్లాండ్ వెళ్లడానికి సిద్ధమవగా కోర్టు జోక్యం చేసుకొని ఆమె ప్రయాణంపై నిషేధం విధించింది. అయితే, ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ కేసు ఐర్లాండ్‌లో 'ఎక్స్' కేసుగా పేరొందింది.
దీంతో అబార్షన్ నిషేధానికి వ్యతిరేకంగా, అనుకూలంగా ప్రచారం మొదలైంది. ఐర్లాండ్‌తో పాటు, న్యూయార్క్, లండన్లలో ప్రదర్శనలు జరిగాయి.
అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ, 'ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందనే కారణంగా అబార్షన్లకు అనుమతించడం సరికాదు' అని ఐర్లాండ్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
అయితే అదే ఏడాది నవంబర్‌లో 'ఎక్స్' కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మూడు సందర్భాల్లో అబార్షన్ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని నిర్ణయించారు.
అయితే, అందులో రెండు సవరణలు ( 13,14 సవరణలు) మాత్రమే ఆమోదం పొందాయి.
కానీ, 'ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందనే కారణంగా అబార్షన్లకు అనుమతించడం సరికాదు' అనే 12వ సవరణ ఆమోదం పొందలేదు.
2002 -రెఫరెండం
ఆత్మహత్య చేసుకుంటారనే కారణంతో అబార్షన్‌కు చట్టబద్ధత కల్పించాలా అని ప్రజాభిప్రాయసేకరణకు వెళ్లగా ప్రజలు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.
2010 - కోర్టు కేసు
అబార్షన్ నిషేధంపై ముగ్గురు మహిళలు ఐర్లాండ్‌పై యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ను ఆశ్రయించారు.
ఏ సందర్భంలో అబార్షన్ చేయాలి? గర్భిణి జీవితం ప్రమాదంలో ఉందా? అనే అంశాల్లో ఐర్లాండ్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలో విఫలమైందని యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
భారతీయ మహిళ సవితా హలప్పనవార్ 17వారాల గర్భవతిగా ఉన్నప్పుడు తనకు గర్భస్రావం జరుగుతందని తెలియడంతో, అబార్షన్ చేసి పిండాన్ని తొలగించమని వైద్యుల్ని కోరారు. వారు నిరాకరించటంతో కొద్ది రోజులకు ఆమె చనిపోయారు
2012 - గర్భస్రావం కారణంగా అబార్షన్ చేయాలన్న భారతీయ మహిళ
కానీ, ఆ తరవాత కొద్ది రోజులకే ఆమె గర్భస్రావం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో చనిపోయారు. సవిత మరణంతో దేశవ్యాప్తంగా వైద్యులకు, రాజకీయ నేతలకు, అబార్షన్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి.
అబార్షన్ చట్టాల్లో మార్పులు చేయాలనే ఆందోళనలు ఊపందుకున్నాయి.
2013 - చట్ట సవరణ
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేసేందుకు వీలుగా చట్ట సవరణ చేశారు.
తల్లి ప్రాణాలకు ముప్పు వచ్చిందని వైద్యులు భావించినపుడు అబార్షన్ చేసేందుకు అనుమతిస్తూ ఈ చట్ట సవరణ చేశారు.
ఒకవేళ చట్ట విరుద్ధంగా అబార్షన్ చేస్తే దోషులకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించేలా మార్పులు చేశారు.
2015 - మరో ప్రజాభిప్రాయ సేకరణకు సిఫార్సు
ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక హక్కులపై ఐక్యరాజ్య సమితి కమిటీ అబార్షన్లపై మరో ప్రజాభిప్రాయ సేకరణకు సిఫార్సు చేసింది.
అత్యాచారం వల్ల వచ్చిన గర్భం, గర్భిణికి ప్రమాదకరమైన సందర్భాలపై మరింత స్పష్టత కోరింది. ఈ సందర్భాల్లో గర్భ విచ్ఛిత్తిని నేరంగా పరిగణించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఫొటో సోర్స్, Getty Images
2017 - పౌర సభ సిఫార్సు
అబార్షన్‌కి ఆంక్షలులేని అనుమతి ఇవ్వాలన్న సిఫార్సును పౌర సభ ఆమోదించింది. ఇందులో గర్భం వచ్చిన తొలి నాళ్లలో అబార్షన్ సిఫార్సుకు అనుగుణంగా 64 శాతం ఓట్లు వచ్చాయి.
అయితే దీనిపైనా భిన్నవాదనలు వచ్చాయి. దీంతో చట్ట సవరణ అవసరమన్న అభిప్రాయం తెరపైకి వచ్చింది.
2018లో చట్ట సవరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని ఐర్లాండ్ ప్రభుత్వం పేర్కొంది.
2018 - రెఫరెండానికి తేదీ నిర్ణయం
ఐర్లాండ్ మంత్రి ఇయోగన్ ముర్ఫీ అబార్షన్ పై ప్రజాభిప్రాయ సేకరణకు తేదీ నిర్ణయిస్తూ ఒక ఆదేశంపై సంతకం చేశారు.
జీవించే హక్కుకు భంగం కలిగించని విధంగా గర్భస్థ శిశువుకు రక్షణ ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రజాభిప్రాయ సేకరణకు తేదీ నిర్ణయమైంది.
ఇవి కూడా చదవండి:
- #MeetToSleep: దిల్లీ అమ్మాయిలు పార్కుల్లో ఒంటరిగా ఎందుకు పడుకుంటున్నారు?
- భవిష్యత్తుపై ఆశలు రేపుతున్న మహిళల పోరాటం
- #UnseenLives: పీరియడ్స్ సమయంలోనూ మాతో ‘సెక్స్ వర్క్’ చేయించేవారు!
- బీబీసీ 100 మంది మహిళలు: 4 సమస్యలపై పోరు
- స్త్రీపురుష సమానత్వంపై మనం వియత్నాం నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి?
- #BBCShe విశాఖ: 'పెద్ద మనిషి' అయితే అంత ఆర్భాటం అవసరమా?
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)