నేటి ప్రధాన వార్తలు: ఇటలీలో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు విఫలం

  • 28 మే 2018
Image copyright Reuters

ఇటలీలో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు విఫలం

ఇటలీలో ప్రధాని పదవికి ప్రతిపాదించిన గ్యూసెప్ కాంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకున్నారు. తాను ఆర్థిక మంత్రిగా ప్రతిపాదించిన వ్యక్తిని దేశ అధ్యక్షుడు వీటో చేయడంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు.

తాను అన్ని ప్రతిపాదనలను అంగీకరించడానికి సిద్ధమే కానీ పావ్లో సావోనాను మాత్రం అంగీకరించలేనని అధ్యక్షుడు సెర్గియో మాటరెల్లా పేర్కొన్నారు. పావ్లోకు యూరోపియన్ యూనియన్ అధికారాలను విమర్శిస్తాడనే పేరుంది.

ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న పాప్యులిస్టు పార్టీలకు అధ్యక్షుడి నిర్ణయం ఆగ్రహం తెప్పించింది. 5-స్టార్ పార్టీ నేత లూయిగీ డి మాయివో అధ్యక్షుడి అభిశంసనకు సైతం పిలుపునిచ్చారు.

ఇటలీలో మార్చి 4న ఎన్నికలు జరిగినప్పటికీ ఇంకా ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు.

రెండు పాప్యులిస్టు పార్టీలు, 5-స్టార్ పార్టీకి కలిపి 32 శాతం ఓట్లు లభించాయి. కాగా, 18 శాతం ఓట్లు లభించిన మితవాద లీగ్ పార్టీ ఈ నెల ఆరంభంలో జరిగిన చర్చల తర్వాత సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

Image copyright Reuters

డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్-ఉన్‌ల భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయా?

ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య భేటీకి ఏర్పాట్లు చేసేందుకు అమెరికా ప్రతినిధి బృందం ఉత్తర కొరియా అధికారులతో చర్చలు జరుపుతోంది.

ఇద్దరు నేతల మధ్య జరగబోయే చర్చల గురించి సన్నాహాలు చేసేందుకు అమెరికా నుంచి ప్రత్యేక ప్రతినిధి బృందం ఉత్తర కొరియా చేరుకుంది.

ఉభయ కొరియాల మధ్య ఉన్న డీమిలిటరైజ్డ్ జోన్‌లో ఉన్న పాన్‌మున్‌జోం గ్రామంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది అనడానికి దీనిని తాజా సంకేతంగా భావిస్తున్నారు.

ఉత్తర కొరియాలో ఉన్న శత్రుత్వం కారణంగా జూన్‌లో జరగాల్సిన సమావేశం రద్దు చేసినట్టు గురువారం ట్రంప్ ట్విటర్‌లో ప్రకటించారు.

అప్పటి నుంచి చర్చలను తిరిగి పట్టాలెక్కించేందుకు రెండు వైపులా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

శనివారం ఉత్తర కొరియా నేత కిమ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ఎటువంటి ప్రకటనా లేకుండా భేటీ అయ్యారు.

Image copyright Getty Images

బంగ్లాదేశ్‌లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం - 70 మందికి పైగా మృతి

బంగ్లాదేశ్‌లో మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అదుపు చేసేందుకు ఈ నెలలో భద్రతా బలగాలు చేపట్టిన చర్యల్లో ఇప్పటి వరకు 70 మందికి పైగా చనిపోయినట్టు అధికారులు తెలిపారు.

దేశ రాజధాని ఢాకాలో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించినట్టు వారు చెప్పారు.

శనివారం నాడు దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకున్నామనీ, రాత్రంతా కొనసాగిన దాడుల్లో అక్రమ డ్రగ్స్ వ్యాపారంలో భాగస్వాములుగా అనుమానిస్తున్న చాలా మందిని కాల్చివేసినట్టు అధికారులు ప్రకటించారు.

కాగా, హక్కుల కార్యకర్తలు ఈ చర్యలను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్చే డ్రగ్స్‌పై చేపట్టిన కఠిన అణచివేత చర్యలతో పోలుస్తున్నారు.

ఈ ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో వేలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. వందల మంది డ్రగ్స్ వాడకందారులకు జరిమానా విధించినట్టు బంగ్లాదేశ్ పోలీసు విభాగం తెలిపింది.

అనేక జిల్లాల్లో డ్రగ్స్ అక్రమ వ్యాపారులపై దాడులు నిర్వహించిన సందర్భంగా పలు చోట్ల ఎదురుకాల్పులు జరగగా, వాటిల్లో చాలా మంది నిందితులు చనిపోయారని అధికారులు తెలిపారు.

కశ్మీర్ టాపర్

నేను తిహార్ జైలు ఎదుట చదివేదాన్ని: కశ్మీర్ సీబీఎస్ఈ టాపర్

శనివారం నాడు ప్రకటించిన సీబీఎస్‌ఈ ఫలితాలతో భారత పాలనలో ఉన్న కశ్మీర్‌లోని ఓ ఇంట్లో ఆనందం వెల్లివెరిసింది.

సమా షబ్బీర్ షాహ్ జమ్మూ సీబీఎస్ఈ పరీక్షల్లో కశ్మీర్ ప్రాంతంలో మొదటి స్థానం దక్కించుకున్నారు. ఆమెకు 97.8 శాతం మార్కులొచ్చాయి. ఆమె శ్రీనగర్‍‌లోని అఠవాజాన్ ప్రాంతంలో ఉన్న దిల్లీ పబ్లిక్ స్కూలు విద్యార్థిని.

సీబీఎస్ఈ టాపర్ కావడానికి ముందు చాలా మందికి సమా ఒక వేర్పాటువాద నాయకుడి కూతురిగానే తెలుసు. ఆమె తండ్రి షబ్బీర్ షాహ్ వేర్పాటువాద సంస్థ జమ్మూ-కశ్మీర్ డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండేవారు.

మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఆయనను 2017లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన దిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.

"పరీక్షలకు సిద్ధం కావడానికి ముందు నేను మా నాన్నను కలవడానికి దిల్లీకి వెళ్లాను. ఆయనను కలవడానికి తిహార్ జైలుకు ఎప్పుడు వెళ్లినా రోజంతా అక్కడే గడపాల్సి వచ్చేది. ఎందుకంటే నన్ను దాదాపు 5 గంటల సేపు కూర్చోబెట్టి ఆ తర్వాత కేవలం 10 నిమిషాల పాటు ఆయనను చూడనిచ్చేవారు. ఆ సమయంలో నేను నా ప్రయణంలో, జైలు ముందు ఎదురు చూసే సమయంలో నా చదువును కొనసాగించేదాన్ని" అని సమా బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసు: బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సహా 49 మందికి నోటీసులు

ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. ఫ్యాక్టరీ అత్యవసరంగా తెరిచేందుకు అనుమతి

ప్రధానితో కాళ్లు కడిగించుకున్న పారిశుద్ధ్య మహిళలు ఈ లాక్‌డౌన్ కాలంలో ఎలా ఉన్నారు

రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే

తేమ నిండిన ఎండలు ఎంత ప్రమాదకరం.. ఎవరికి ప్రాణాంతకం

సోషల్ డిస్టెన్సింగ్: మీ కోసం షాపింగ్ చేసి పెట్టే రోబో

వీడియో: ఫేస్ మాస్కులు ధరించడంలో తప్పులు, ఒప్పులు

‘నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా.. లాక్‌డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది’

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ: పాడైపోయిన ఆకు కూరలు, కూరగాయలు.. సాగు నష్టపోయిన 400 రైతు కుటుంబాలు