ట్రంప్-కిమ్ భేటీకి సన్నాహాలు జరుగుతున్నాయా?

ట్రంప్-కిమ్

ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీకి ఏర్పాట్లు చేస్తున్న అమెరికా ప్రతినిధి బృందం ఉత్తర కొరియా అధికారులతో చర్చలు జరుపుతోంది.

ఇద్దరు నేతల మధ్య జరగబోయే చర్చలకు సన్నాహాలు చేసేందుకు అమెరికా నుంచి ప్రత్యేక ప్రతినిధి బృందం ఉత్తర కొరియా చేరుకుంది.

ఈ విషయాన్ని స్వయానా డొనాల్ట్ ట్రంపే వెల్లడించారు.

ఉభయ కొరియాల మధ్య ఉన్న డీమిలిటిరైజ్డ్ జోన్‌లో ఉన్న పాన్‌మున్‌జోం గ్రామంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది అనడానికి దీనిని తాజా సంకేతంగా భావిస్తున్నారు.

అంతకు ముందు, ఉత్తర కొరియా ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో వ్యక్తమైన "శత్రుత్వం" కారణంగా జూన్‌లో జరగాల్సిన సమావేశం రద్దు చేసుకుంటున్నట్టు గురువారం ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి చర్చలను తిరిగి పట్టాలెక్కించేందుకు రెండు వైపుల నుంచీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

ఉత్తర కొరియా నేత కిమ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ శనివారం ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే సమావేశమయ్యారు.

"కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా నేత సిద్ధంగా ఉన్నట్టు మరోసారి స్పష్టం చేశారు" అని మూన్ చెప్పారు.

తర్వాత మాట్లాడిన కిమ్ "శిఖరాగ్ర సదస్సు జరగాలని దృఢ సంకల్పం"తో ఉన్నట్టు తెలిపారు.

అది అలా ఉండగా.. ఉత్తర కొరియా తన మేధో సామర్థ్యాన్ని సాధించేందుకు అమెరికా సహకరిస్తుందని ట్రంప్ ఆదివారం ట్విటర్‌లో తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్‌కూ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌

తాజా చర్చల లక్ష్యం ఏంటి?

దక్షిణ కొరియా మాజీ రాయబారి సంగ్ కిమ్ నేతృత్వంలోని ఈ బృందం, ఉత్తర కొరియా ఉప-విదేశాంగ మంత్రి చో సన్-హుయ్‌తో చర్చలు జరపనుంది.

ట్రంప్, కిమ్ మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశం కోసం ఒక ఎజెండాను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతాయి.

"సమావేశం జరుగుతుందని అధికారులు ఆశగా ఎదురుచూస్తున్నప్పటికీ, బంధాలు చాలా త్వరగా మారిపోతాయని గత కొన్నివారాలుగా స్పష్టమైంది" అని వాషింగ్టన్‌లోని బీబీసీ ప్రతినిధి క్రిస్ బట్లర్ అన్నారు.

శిఖరాగ్ర సదస్సుకు ముందు పరిష్కరించాల్సిన అంశాలేంటి?

చర్చల మార్గం సుగమం అయ్యేందుకు ఇంకా చాలా జరగాల్సి ఉంది. ఒప్పందం జరగదని తనకు అనిపిస్తే, సమావేశానికి వెళ్లనని ట్రంప్ స్పష్టంగా చెప్పారు.

అణ్వాయుధాలను పూర్తిగా వదులుకోవడానికి కిమ్ అంగీకరిస్తారా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. గతంలో ఆయన ఇలాంటి హామీలే ఇచ్చినా వాటిని నిలబెట్టుకోలేదు.

అమెరికా మొదట అణు నిరాయుధీకరణను కోరుకుంటుందని-ఆ తర్వాత ఆంక్షలు ఎత్తివేయడం, ఆర్థిక సహకారం రూపంలో తాయిలాలు ప్రకటిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా, దక్షిణ కొరియా నేతలతో చర్చలకు సిద్ధమైన కిమ్ తను దశలవారీగా ముందుకెళ్లాలని అనుకుంటున్నట్టు సంకేతం ఇచ్చారు. ప్రధానంగా ఆంక్షలు ఎత్తివేయడంతోపాటూ, దక్షిణ కొరియాలో అమెరికా సైనిక ఉనికిని సరళతరం చేయాలని ఆయన కోరుకుంటున్నారు.

అలాంటి విధానాన్ని ట్రంప్ తోసిపుచ్చలేదు.

2006 నుంచి ఉత్తర కొరియా ఎన్నో సార్లు అంతర్జాతీయ ఆంక్షలకు గురి అవుతూ వచ్చింది. వాటి వల్ల ఆ దేశం నుంచి జరిగే చాలా ఎగుమతుల్లో కోత పడింది. చమురు దిగుమతి ఆగిపోయింది.

తమ దేశ మనుగడ ఎప్పటికీ ప్రశ్నార్థకంగా మారకూడదని ఉత్తర కొరియా హామీని కూడా కోరుకుంటోంది.

వీడియో క్యాప్షన్,

చూడండి.. కిమ్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన చరిత్రాత్మక ఘట్టం

మాటల యుద్ధం నుంచి.. శాంతి చర్చల వరకు

2016, 2017లో తన అణు, క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూ, మాటల దాడికి దిగిన ఉత్తర కొరియా.. ఇప్పుడు ఇంత దూరం రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.

కానీ దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధమని జనవరిలో కిమ్ సూచించగానే, సయోధ్య ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి

తర్వాత నెలలోనే దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ సంబరాలలో రెండు దేశాలూ కలిసి ఒకే పతాకం కింద కవాతు చేశాయి.

అణు పరీక్షలు ఆపి వేస్తున్నట్టు, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌తో కీలక శిఖరాగ్ర సదస్సు నిర్వహించినట్టు కిమ్ గత నెలలోనే ప్రకటించారు.

తాజాగా తమ పంగ్యే-రీ అణు పరీక్ష ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్టు ఉత్తర కొరియా చెప్పింది. కానీ 2017 సెప్టంబర్‌లో జరిగిన చివరి పరీక్ష తర్వాత ఇది పాక్షికంగా కూలిపోయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)