ఆఫ్రికన్‌ చారిత్రక గాథ: వాంఛ తీర్చుకుని చంపేస్తుంది: కాదు, జాతి పోరాట యోధురాలు

  • మార్కోస్ గోంజాలెంజ్ డియాజ్
  • బీబీసీ ప్రతినిధి
జింగా

ఫొటో సోర్స్, CAROLINA THWAITES (BBC)

ఫొటో క్యాప్షన్,

వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనితగా ఆఫ్రికా ప్రజలు జింగాను కొలుస్తారు.

చరిత్ర పుస్తకాలు ఆమెను తిరుగులేని వీర వనితగా కీర్తిస్తాయి. ఇంకొందరు ఆమెను అధికారం కోసం సోదరుడిని సైతం చంపిన క్రూరురాలిగా వర్ణిస్తారు. శారీరక వాంఛ తీరాక తనతో గడిపిన మగవాళ్లందరినీ ఆమె చంపించేసిందనీ చెబుతారు.

ఆమె పేరు జింగా బాండీ. 17వ శతాబ్దపు అంగోలా దేశపు మహారాణి. వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనితగా ఆఫ్రికా ప్రజలు ఆమెను కొలుస్తారు. ఆ ఖండంలో ఇప్పటికీ ఆమె గురించి కథలుకథలుగా చెప్పుకుంటారు. విగ్రహాలు పెట్టి పూజిస్తారు.

మహిళలు అనేక విషయాల్లో నేటికీ ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు. కానీ ఆఫ్రికా దాటి బయటికొస్తే ఆమె గురించి చాలామందికి తెలీదు.

అక్కడ కూడా జింగా గురించిన వేర్వేరు కథలు వినిపిస్తాయి. కానీ అన్ని కథలూ ఆమె అత్యంత ప్రాచుర్యం పొందిన ఆఫ్రికన్ మహిళ అని చెబుతాయి. తన ప్రజలు యూరోపియన్ సామ్రాజ్యానికి బానిసలు కాకుండా ఉండేందుకు నాలుగు దశాబ్దాల పాటు పోరాడిన యోధురాలిగా అక్కడి ప్రజలు ఆమెను గుర్తుపెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, NEW YORK PUBLIC LIBRARY

ఫొటో క్యాప్షన్,

1583-1663 మధ్య జింగా జీవించారు

ఆఫ్రికాలోని బుండు ప్రజలకు జింగా నాయకురాలు. ఆఫ్రికాలోని డోంగో, మతాంబా రాజ్యాలకు ఆమె మహారాణి. స్థానికులు ఆమెను ‘ఎంగోలా’ అనేవారు. ఆ పేరుతోనే పోర్చుగీసు వాళ్లు ఆ ప్రాంతాన్ని పిలిచేవారు. అదే ఇప్పుడు అంగోలాగా మారింది.

1575 ప్రాంతంలో పోర్చుగల్ సైనికులు డోంగో ప్రాంతంపై దాడి చేశారు. అక్కడి బంగారు, వెండి గనులను ఆక్రమించుకోవాలని చూశారు. కానీ వాళ్లకు ఆ గనులు దొరకలేదు. దాంతో వాళ్లు తమ ప్రణాళికను మార్చుకొని స్థానిక ప్రజలను బ్రెజిల్‌కు బానిసలుగా పంపించడం మొదలుపెట్టారు.

డోంగో ప్రాంతంలో పోర్చుగీస్ ఆక్రమణ మొదలైన ఎనిమిదేళ్ల తరవాత జింగా పుట్టింది. అప్పుడు ఆ ప్రాంతానికి ఆమె తండ్రి బాండీ కిలువాంజీ రాజుగా ఉండేవారు. ఆయన బాటలోనే ఆమె చిన్ననాటి నుంచే పోర్చుగీస్ సైన్యాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టింది.

తండ్రి చనిపోయాక జింగా సోదరుడికి రాజు పదవి దక్కింది. కానీ తండ్రిలో ఉన్న నాయకత్వ లక్షణాలు కానీ జింగాకు ఉన్న తెలివితేటలు కానీ అతడికి రాలేదు. దాంతో తన సొంత మనుషులే జింగా తరఫున పనిచేస్తూ తనపై కుట్ర పన్నే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం అతడికి కలిగింది. అందుకే జింగా కొడుకును చంపేయమని అతడు హుకుం జారీ చేశాడు.

కానీ మరో పక్క యూరోపియన్ల ఆక్రమణను, వారి సైన్యం దాడులను అతడు అడ్డుకోలేకపోయాడు. దాంతో తన మంత్రివర్గం సలహా మేరకు పోర్చుగీస్ వారితో మాట్లాడి సంధి కుదిర్చే బాధ్యతను అతడు సోదరి జింగాకు అప్పగించాడు. జింగా చదువుకున్న, తెలివైన యువతి కావడంతో సోదరుడు ఆమెపై నమ్మకం ఉంచాడు.

ఫొటో సోర్స్, UNESCO

ఫొటో క్యాప్షన్,

ఆఫ్రికా మహిళలపై యునెస్కో ఓకామిక్‌ను విడుదల చేసింది.

పోర్చుగీస్‌ వాళ్లతో మాట్లాడటానికి జింగా లువాండా నగరంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. నల్లజాతీయులు, శ్వేత జాతీయులతో పాటు వివిధ ఇతర జాతులకు చెందిన ప్రజలు అక్కడ పెద్ద సంఖ్యలో కనిపించారు.

నల్లజాతీయులందర్నీ వరుసగా నిల్చోబెట్టి వాళ్లకు వెలకట్టి బానిసలుగా అమ్మేయడాన్నిచూసి ఆమె చలించిపోయింది.

ఆ దృశ్యాన్ని అలానే మనసులో నిలుపుకొని పోర్చుగీస్ గవర్నర్‌తో సంధి గురించి చర్చించడానికి జింగా వెళ్లింది. అప్పుడు జరిగిన ఓ ఘటన ఆఫ్రికా చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయిందని చెబుతారు.

ఫొటో సోర్స్, CAROLINA THWAITES (BBC)

ఫొటో క్యాప్షన్,

పోర్చుగీస్ గవర్నర్‌తో మాట్లాడేందకు జింగా తన అనుచరుడినే ఆసనంగా చేసుకుంది

పోర్చుగీస్ గవర్నర్ దగ్గరకు వెళ్లినప్పుడు అతడు ఎంతో ఠీవిగా కుర్చీపై కూర్చొనున్నాడు. ఆమెకు కూర్చోవడానికి ఎలాంటి ఆసనం వేయలేదు. దాంతో ఆమె ఓ సైగ చేయగానే ఓ అనుచరుడే నేలపై మోకరిల్లి ఆమెకు సింహాసనంలా మారాడు. పోర్చుగీస్ గవర్నర్‌కు సమానమైన ఎత్తులో, ఆ అనుచరుడిపై కూర్చొని జింగా చర్చలను ప్రారంభించింది. తాము ఎవరికంటే తక్కువకాదనే విషయాన్ని ఆమె అప్పుడే ప్రత్యర్థులకు తేల్చిచెప్పింది.

చర్చలు ముగిశాక రెండు వర్గాల వారు ఓ ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం పోర్చుగీస్ వాళ్లు తమ సైన్యాన్ని డోంగో ప్రాంతం నుంచి వెనక్కు రప్పించడానికి ఒప్పుకున్నారు. దాని ప్రతిగా డోంగోలో వ్యాపారం చేసుకోవడానికి వారిని అనుమతించారు.

పోర్చుగల్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు వీలుగా జింగా క్రైస్తవ మతంలోకి మారడానికి కూడా ఒప్పుకుంది. కానీ ఆ సంబంధాలు ఎంతో కాలం కొనసాగలేదు. ఒప్పందం జరిగిన కొన్నాళ్లకే మళ్లీ పోర్చుగీస్ సైన్యం తిరుగుబాటు మొదలైంది.

1624లో జింగా సోదరుడు ఓ దీవిలో చిత్రమైన పరిస్థితుల మధ్య చనిపోయాడు. కొందరు అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబితే, ఇంకొందరు మాత్రం తన కొడుకుని చంపించినందుకు జింగానే అతడికి విషం పెట్టి చంపి, ప్రతీకారం తీర్చుకుందని భావిస్తారు.

ఫొటో సోర్స్, UNESCO

ఫొటో క్యాప్షన్,

40ఏళ్ల పాటు ఆమె పోర్చుగీస్ సైన్యాన్ని ఎదిరించింది

ఏదేమైనా సోదరుడి మరణంతో డోంగో సింహాసనాన్ని జింగా అధిష్టించింది. తన సొంత ప్రజల్లో కొందరితో పాటు పోర్చుగీసు వారికి కూడా ఆమె మహారాణి కావడం ఇష్టం లేదు. అయినాసరే వాళ్లందరికీ ఎదురెళ్లి ఆమె పాలన చేపట్టింది.

జింగా రాజ్య పాలన చేపట్టడం ఆఫ్రికన్ మహిళల చరిత్రలో ఓ కీలక మలుపు. స్త్రీ సమానత్వం, సాధికారత లాంటి మాటలకు ఏమాత్రం విలువ లేని రోజుల్లో ఆమె విజయం ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది.

జింగాకు భయమనేదే ఎరుగని మహిళగా పేరుంది. తన రాజ్య సరిహద్దులో జీవించే ఇంబాంగలా అనే తెగకు చెందిన యోధుల సాయంతో ఆమె శత్రువులను ఎదిరించి తన స్థానాన్ని పదిలపర్చుకుంది. కొన్నాళ్లకు పొరుగు రాజ్యమైన ముతాంబాను జయించి దాని చుట్టుపక్కల ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకుంది.

యుద్ధరంగంతో పాటు ప్రణాళికలు రచించడంలో, రాజకీయం నెరపడంలో తిరుగులేని వనితగా గుర్తింపు సాధించింది. ఓ దశలో పోర్చుగీస్‌ సైన్యంతో యుద్ధం చేసిన ఆమె, ఇతర రాజ్యాలపై యుద్ధాలకు వెళ్లినప్పుడు ఆ పోర్చుగీస్ వాళ్ల సాయమే కోరడం విశేషం.

ఫొటో సోర్స్, IMDB

ఫొటో క్యాప్షన్,

జింగా కథ ఇతివృత్తంగా ఎన్నో సినిమాలు వచ్చాయి

జింగాలోని ధీరత్వాన్ని పక్కనబెడితే ఆమెలోని మరో క్రూరమైన కోణాన్ని కూడా చరిత్రకారులు ప్రస్తావిస్తారు. తనతో సంభోగించిన మగవాళ్లందరినీ ఆమె చంపించేసేదని చెబుతారు.

తన అంత:పురంలోని కొందరు మగవాళ్లకు బలవంతంగా ఆడవాళ్ల దుస్తులు తొడిగించి జింగా నిత్యం వాళ్లను తన పక్కనే ఉంచుకునేది.

ఆమెకు కోరిక కలిగినప్పుడు ఆ మగవాళ్లు ఒకరితో ఒకరు పోరాడి చివరికి ఒక్కరే మిగలాలి. ఆ మిగిలిన వ్యక్తితో జింగా శృంగారంలో పాల్గొనేది. కానీ ఆ విజేతకు కూడా ఎక్కువ కాలం బతికే అవకాశం లేదు. సంభోగం జరిగిన మరుసటి రోజే జింగా అతడిని చంపించేది.

కానీ ఈ ఘటనలకు సంబంధించిన ప్రస్తావన పోర్చుగీస్ వారు రాసిన చరిత్ర పుస్తకాల్లోనే ఉంది. మానసికంగా ఆఫ్రికన్లను దెబ్బతీసేందుకే వాళ్లు ఇలా రాసుంటారనే అభిప్రాయమూ నెలకొందని అంగోలా జాతీయ లైబ్రెరీ డైరెక్టర్ పెడ్రో లారెంకో అంటారు.

ఫొటో సోర్స్, Imdb

ఫొటో క్యాప్షన్,

జింగా స్వయంగా ఎన్నో సైనిక పోరాటాలకు నాయకత్వం వహించింది

రాజ్యపాలనలో జింగాకు తిరుగులేని చరిత్ర ఉంది. దాదాపు నలభై ఏళ్లపాటు ఆమె పోర్చుగీస్ ఆక్రమణ ప్రయత్నాలు తిప్పికొట్టింది. దానికోసం ఎన్నోసార్లు ఆమె స్వయంగా సైనిక పోరాటాలకు నాయకత్వం వహించింది.

ఆమెను జయించలేమని నిర్ణయించుకున్నాక పోర్చుగీస్ వాళ్లు 1657లో డోంగో వదిలి వెళ్లడానికి ఆమెతో సంధి కుదుర్చుకున్నారు.

1663లో 82ఏళ్ల వయసులో జింగా ప్రశాంతంగా కన్నుమూసింది. ఆమె జీవితంలో సగభాగం డోంగో ప్రాంతాన్ని ఆక్రమించాలనుకున్న పోర్చుగీస్ సేనల్ని తిప్పికొట్టడంలోనే సరిపోయింది.

ఆమె మరణానంతరం పోర్చుగీస్‌ మళ్లీ డోంగోను ఆక్రమించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో చాలా వరకు విజయం సాధించింది.

ఫొటో సోర్స్, MARCOS GONZÁLEZ DÍAZ

ఫొటో క్యాప్షన్,

జింగా పేరు మీద అక్కడెన్నో స్కూళ్లు, వీధులు ఉన్నాయి

నాటి ఆఫ్రికన్ సమాజంలో జింగా చూపిన తెగువను, సాధించిన విజయాలను నేటికీ అంగోలా వాసులు స్ఫూర్తిగా తీసుకుంటారు. అంగోలాలో ఆమె పేరు మీద ఎన్నో వీధులూ, స్కూళ్లూ ఉన్నాయి. అక్కడి కరెన్సీపైనా ఆమె బొమ్మ కనిపిస్తుంది.

ఆమె ప్రేరణతో ఎన్నో పుస్తకాలు, యునెస్కో రచనలు వెలువడ్డాయి. సినిమాలూ వచ్చాయి.

ఆమెలోని క్రూరత్వం గురించి ప్రస్తావిస్తే.. ‘క్రూరత్వం ప్రపంచమంతటా ఉంది. యూరప్‌లోనూ మనుషుల్ని కాల్చి చంపారు. ఆఫ్రికన్లతో పాటు యూరోపియన్లను కూడా వాళ్లు బానిసలుగా మార్చారు. జింగా నిరంకుశ నేతే కావొచ్చు. కానీ స్థానికులను రక్షించేందుకు ఆమె చేసిన పోరాటాలు అనిర్వచనీయం. ఆ మాటకొస్తే నాటి యూరోపియన్ రాజులు మాత్రం నిరంకుశ పాలకులు కాదా?’ అని కొందరు అంగోలియన్లు ప్రశ్నిస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)