అంతర్జాతీయ వార్తలు: మావో లాగా మిమిక్రీ చేసిన ఆర్టిస్ట్.. చైనాలో వివాదం

  • 29 మే 2018
మావో లాగా దుస్తులు ధరించిన నటుడు గుయాగ్జియాంగ్ Image copyright WECHAT

చైనాలో బ్లాక్‌చైన్ టెక్నాలజీపై నిర్వహించిన ఓ సదస్సు సందర్భంగా వివాదం చోటుచేసుకుంది. సదస్సులో ఒక నటుడు చైనా కమ్యూనిస్ట్ నేత మావో జెడాంగ్‌ను అనుకరిస్తూ మిమిక్రీ చేయడంతో సోషల్ మీడియాలో జనాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.

చైనాలోని హైనాన్ రాష్ట్రంలో 'బొయావో ఆసియా బ్లాక్‌చైన్ ఫోరం' నిర్వహించిన సదస్సులో గుయాగ్జియాంగ్ అనే నటుడు తన ప్రదర్శన ఇచ్చాడు. ఆయన బూడిద రంగు సూటు వేసుకుని, హ్యునాన్ యాసలో మావో గొంతునూ అనుకరించాడు.

అయితే, చైనా చట్టాల ప్రకారం అక్కడి కమ్యూనిస్టు నేతల పేర్లు కానీ, చిత్రాలు కానీ వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం నిషేధం.

కానీ.. ఈ నటుడు ఏకంగా మావోను అనుకరిస్తూ సదస్సును విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు చెప్పడంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆగ్రహించారు. దీంతో కార్యక్రమ నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక 1970లలో జనం సిగరెట్ లేకుండా కనిపించటం అరుదు.. అటువంటి వారిలో మ్యూజిక్ లెజెండ్ సెర్గీ గైన్స్‌బర్గ్ ఒకరు.. ఇప్పుడు కాలం మారిపోయింది

ఏడాదిలో 10 లక్షల మంది సిగరెట్ మానేశారు

ఫ్రాన్స్‌ ప్రజలు పొగతాగే అలవాటును వీడుతున్నారు. ఒక్క 2016-17లోనే సుమారు 10 లక్షల మంది తమకున్న ఈ అలవాటును మానుకున్నారని ఫ్రాన్స్ ప్రజారోగ్య విభాగం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

2016లో ఫ్రాన్సులో 18 నుంచి 75 ఏళ్ల మధ్య వయస్కుల్లో అంటే 1.32 కోట్ల మంది రోజూ సిగరెట్ తాగేవారు. 2017లో ఆ సంఖ్య 1.22 కోట్లకు తగ్గినట్లు సర్వే తేల్చింది.

అయితే, దీనికి కారణం ప్రజల్లో స్వయంగా వచ్చిన మార్పు కాదని.. సిగరెట్ తాగే అలవాటు మాన్పించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలే కారణమని చెబుతున్నారు.

సిగరెట్ల ధరలు భారీగా పెంచడంతో పాటు పొగతాగే అలవాటు మానుకోవాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టడం వంటివన్నీ ఫలితమిచ్చినట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు.

Image copyright AFP

డీజిల్ ధరలు తగ్గించినా శాంతించని బ్రెజిల్ లారీ డ్రైవర్లు

బ్రెజిల్‌లో వారం రోజులుగా జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్న లారీ డ్రైవర్ల సమ్మె ఇంకా కొనసాగుతోంది. వారి డిమాండ్లకు దిగివచ్చి ప్రభుత్వం డీజిల్ ధరలు తగ్గించినప్పటికీ పలు ట్రక్ డ్రైవర్ల సంఘాలు మాత్రం శాంతించలేదు.

దేశంలోని ప్రధాన రహదారులన్నిటినీ ట్రక్ డ్రైవర్లు దిగ్బంధించడంతో రవాణా స్తంభించిపోయింది.

దక్షిణ బ్రెజిల్‌లోని వందలాది పరిశ్రమలు నిలిచిపోయాయి. ఆహారం రవాణా కాకపోవడంతో 7 కోట్ల కోళ్లు మృతిచెందినట్లు అక్కడి మాంసం ఉత్పత్తిదారుల సంఘాలు వెల్లడించాయి.

సూపర్ మార్కెట్లలో సరకులు ఖాళీ అయిపోవడంతో ప్రజలు నిత్యావసరాల కోసం తిరుగుతున్నారు. భద్రతాదళాల రక్షణ మధ్య పెట్రోలు, డీజిల్ సరఫరా చేస్తున్నప్పటికీ పెట్రోలు బంకుల వద్దా ప్రజలు బారులుతీరక తప్పడం లేదు.

వారం రోజులుగా అక్కడ సమ్మె జరుగుతుండడంతో ప్రభుత్వం దిగొచ్చి డీజిల్ ధర లీటరుపై 46 బ్రెజిలియన్ సెంట్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 8) తగ్గించింది.

2018లో అక్కడ లీటరు ధర 3.36 రియాల్ (సుమారు రూ. 60.68) ఉండగా ఇటీవల అది 3.6 రియాల్‌ (సుమారు రూ. 65)కు చేరడంతో సమ్మెకు దిగారు.

న్యూజెర్సీ బీచ్‌లో మహిళపై పోలీస్ అధికారి దాడి.. వీడియో వైరల్

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఒక పోలీస్ అధికారి ఒక మహిళను అరెస్ట్ చేసే క్రమంలో ఆమెపై పిడిగుద్దులు కురిపించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ దాడి ఘటనపై న్యూజెర్సీ పోలీసులు విచారణ ప్రారంభించారు.

వైల్డ్‌వుడ్ పోలీస్ శాఖకు చెందిన ముగ్గురు పోలీసు సిబ్బంది.. ఎమిలీ వీన్‌మాన్ అనే 20 ఏళ్ల యువతిని అరెస్ట్ చేయటానికి ప్రయత్నిస్తుండటం ఈ వీడియోలో కనిపించింది. దీనిని శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

స్విమ్ సూట్, షార్ట్స్‌లో ఉన్న ఎమిలీ బీచ్‌లో నేలమీద పెనుగులాడుతూ ఉండగా.. ఒక అధికారి ఆమెను పై నుంచి అదిమి పట్టుకోవటం, మరొక అధికారిని ఆమె కాళ్లతో తన్నటం, సదరు అధికారి ఆమె మడిమెలు పట్టుకుని కాళ్లను నేలకు అదమటం కనిపించింది.

అప్పుడు మరో అధికారి ఆమె తల మీద పిడిగుద్దులతో దాడి చేసి.. ఆమె తలను రెండు చేతులతో నేలకు అదిమి పట్టుకున్నారు.

ఈ వీడియోలో కనిపించిన ఇద్దరు అధికారులను పాలనా విధులకు మార్చినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఆమె మీద.. బీచ్‌లో అక్రమంగా మద్యం కలిగి ఉండటం, అరెస్టును ప్రతిఘటించటం ఆరోపణలు నమోదు చేశారు.

ఈ వీడియోను అలెక్సిస్ హెవిట్ అనే 19 ఏళ్ల యువతి చిత్రీకరించారు. న్యూజెర్సీలోని విలయమ్స్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఆమె తన మిత్రులతో కలిసి బీచ్‌కు వచ్చారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు

ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం

ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం: వీటివల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి?

పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా

చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల వల్ల భారత్‌లో ధరలు పెరుగుతాయా?

క్యాన్సర్ చికిత్స పేరుతో యూట్యూబ్ నకిలీ వీడియోలతో సొమ్ము చేసుకుంటోందా?