దేశంపై కుందేళ్ల 'దండయాత్ర', కుదేలైన ఆర్థిక వ్యవస్థ

  • 3 జూన్ 2018
కుందేళ్ల గుంపులు Image copyright WIKIMEDIA COMMONS
చిత్రం శీర్షిక ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కుందేళ్లు ఉండేవి.

కుందేళ్లు అంటే చాలా అమాయకమైనవని, సాధుజీవులని అనుకుంటాం. అలాంటి మూగ జీవులు ఒక దేశంపై 'దండయాత్ర' చేయడమేంటి? వాటి వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడం ఏంటి? అని అనుకుంటున్నారు కదూ!

"ఆ పరిస్థితులను మాటల్లో చెప్పలేనేమో. ఎక్కడ చూసినా పెద్దపెద్ద కుందేళ్లు మందలు మందలుగా కనిపించేవి. పంట వేస్తే మొక్కలను వేళ్లతో సహా పీక్కుతింటూ పొలాలను సర్వనాశనం చేసేవి. వాటి వల్ల మా దేశం తీవ్రంగా నష్టపోయింది." ఇవి 20వ శతాబ్దం మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో కుందేళ్ల 'దండయాత్ర' గురించి బిల్ మెక్‌డొనాల్డ్ అనే ఓ రైతు గుర్తుచేసుకున్న విషయాలు.

అప్పట్లో ఆస్ట్రేలియాలో కొన్ని వందల కోట్ల సంఖ్యలో ఉన్న కుందేళ్లు దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. పంట చేలను నాశనం చేసేవి. గడ్డిపోచ కనిపించకుండా తినేసేవి. దాంతో పశుపోషణపై తీవ్ర ప్రభావం పడింది. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడింది.

ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కుందేళ్లపై 'యుద్ధం' ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఉరుగ్వే నుంచి తీసుకొచ్చిన ఓ వైరస్‌ సాయంతో ఆ సంక్షోభాన్ని నివారించే ప్రయత్నం చేశారు.

Image copyright ISTOCK

అదో ఊహించని విపత్తు

19వ శతాబ్దం మధ్య కాలంలో యూరప్ నుంచి ఆస్ట్రేలియాకు కుందేళ్లను తీసుకొచ్చారు. అప్పట్లో ఇతర జంతువులను వేటాడేందుకు కుందేళ్లను ఎరగా వాడేవారు. ఆ కుందేళ్లే మందలు మందలుగా పెరిగిపోయి దేశానికే సవాల్ విసిరే స్థాయికి చేరడానికి ఎంతో కాలం పట్టలేదు.

కొత్త వాతావరణానికి పరాయి జీవజాతులను పరిచయం చేస్తే ఏమవుతుందో ఆస్ట్రేలియా ఎదుర్కొన్న ఆ ఉపద్రవమే ఓ చక్కని ఉదాహరణ. ఆ కుందేళ్ల బెడదను స్వయంగా చూసిన రైతు మెక్‌డొనాల్డ్‌ తాము ఎదుర్కొన్న 'విపత్కర' పరిస్థితులను ఇటీవల బీబీసీ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

1930లో ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌లో జన్మించిన ఆయన కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. కుందేళ్ల వల్ల తాము ఎంతో నష్టపోయామని ఆయన చెప్పారు.

1930 నాటికే అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో కుందేళ్ల సమస్య తీవ్రంగా ఉండేది. చాలామంది రైతులు వాటిని వేటాడి చంపేవారు. పంటలను కాపాడుకునేందుకు చుట్టూ కంచె వేసేవారు. కాపలా ఉండేవారు. అయినా వాటి బెడద తప్పేది కాదు.

రెండో ప్రపంచ యుద్ధం కాలంలో సమస్య మరింత పెరిగింది. యుద్ధంలో పోరాడేందుకు చాలామంది పురుషులు వెళ్లాల్సి వచ్చింది. దాంతో కుందేళ్లను వేటాడేవాళ్లు తగ్గిపోయారు. తనకు పదేళ్ల వయసున్నప్పటి నుంచే తన తల్లితో కలిసి పొలానికి కాపలాగా వెళ్లేవాడినని మెక్‌డొనాల్డ్ గుర్తు చేసుకున్నారు.

Image copyright CSIRO / WIKIMEDIA COMMONS IMAGE
చిత్రం శీర్షిక బోన్లు పెట్టి కుందేళ్లను పట్టుకునేవారు. గడ్డిమీద విషం చల్లి చంపేవారు.

రెండో ప్రపంచ యుద్ధం కాలంలో..

"రెండో ప్రపంచ యుద్ధం జరిగినంత కాలం కుందేళ్ల నియంత్రణ అన్నమాటే లేదు. దాంతో వాటికి అడ్డే లేకుండాపోయింది" అని ఆయన వివరించారు.

భూములన్నీ నాశనమయ్యాయి. పంటలు వేస్తే మొక్కలను ఆ కుందేళ్లు వేళ్లతో సహా పీక్కుని తినేసేవి. భూమి మీద ఆకులు, అలములు, గడ్డి కనిపించకుండా చేసేవి. దాంతో పశుపోషణ కష్టమైంది. రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.

"మేత దొరక్క మా గొర్రెలు బక్కచిక్కిపోయేవి. నాణ్యమైన ఉన్ని ఉత్పత్తి అయ్యేది కాదు" అని మెక్‌డొనాల్డ్ తెలిపారు.

అందుకే ఆస్ట్రేలియా చరిత్రలో వ్యవసాయ రంగం ఎక్కువగా నష్టపోయింది కుందేళ్ల వల్లనే అని చెబుతారు.

Image copyright PIET SPAANS / WIKIMEDIA COMMONS
చిత్రం శీర్షిక 'మిక్సోమా' అనే వైరస్‌ను వ్యాప్తి చేసి 90 శాతం కుందేళ్లను చంపేశారు.

వైరస్‌తో కుందేళ్లపై యుద్ధం

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మనుగడకే ప్రమాదకరంగా మారిన కుందేళ్లను ఎక్కడికక్కడే చంపేయాలని ప్రజలకు ప్రభుత్వం పిలుపిచ్చింది. దాంతో రైతులు గడ్డి మీద విషం చల్లి వాటిని చంపేవారు. అవి ఉండే బొరియలను యంత్రాలతో ధ్వంసం చేసేవారు. వాటిలోకి విషవాయువులను పంపేవారు.

"రోజూ సాయంత్రం విషం చల్లి, ఉదయాన్నే వెళ్లి చూస్తే కొన్ని వందల కుందేళ్లు చనిపోయి ఉండేవి. కొన్నింటిని బోన్లు పెట్టి పట్టుకునేవాణ్ని" అని మెక్ డొనాల్డ్ గుర్తు చేసుకున్నారు.

అన్ని చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ ప్రమాదకర వైరస్‌ను వ్యాప్తి చేసి కుందేళ్లను చంపాలని అధికారులు నిర్ణయించారు.

అందుకోసం ఉరుగ్వే దేశం నుంచి 'మిక్సోమా' అనే వైరస్‌ను తీసుకొచ్చారు. దోమల ద్వారా వ్యాప్తిచెందే ఈ వైరస్ సోకిన కుందేళ్ల చర్మం మీద పెద్దపెద్ద గడ్డలు ఏర్పడతాయి. దవడలు ఉబ్బి మేత తినలేకుండా తయారవుతాయి. ఇతర అవయవాలు దెబ్బతింటాయి.

1950లో కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఆ వైరస్‌ను దేశవ్యాప్తంగా వదిలారు. ఆ ప్రయత్నం మంచి ఫలితాలివ్వడంతో, అదే విధానాన్ని బ్రిటన్, ఐర్లాండ్, ఫ్రాన్స్ తదితర యూరప్ దేశాలు కూడా అనుసరించాయి.

"ఆ వైరస్‌ బారిన పడిన కుందేళ్ల అవయవాలు అన్నీ చెడిపోయేవి. కళ్లు పోయి గుడ్డివిగా మారేవి. మేత తినకపోవడంతో బక్కచిక్కిపోయేవి. మాకు మాత్రం ఆ వైరస్ వల్ల ఎలాంటి సమస్య ఉండేది కాదు" అని మెక్‌డొనాల్డ్ వివరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కుందేళ్ల బెడద వల్ల గొర్రెలకు, పశువులకు గడ్డి దొరికడం కష్టంగా ఉండేది.

కుదుట పడ్డ వ్యవసాయం

ఆస్ట్రేలియాలోని కొన్ని కోట్ల కుందేళ్లు ఆ వైరస్ బారిన పడ్డాయి. వాటిలో దాదాపు 90శాతం మేర చనిపోయాయి.

దాంతో భూములు క్రమంగా కోలుకున్నాయి. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కాస్త కుదుటపడింది.

అయితే, కొన్నాళ్లకు బతికున్న కుందేళ్లలో ఆ వైరస్‌ను తట్టుకునే శక్తి కూడా పెరిగింది. దాంతో 1990ల్లో మరో కొత్త వైరస్‌ను వినియోగించారు. అది కొంత ఫలితాలిచ్చినా.. తర్వాత దాన్ని కూడా తట్టుకునే శక్తి కుందేళ్లలో పెరిగింది.

దాంతో ఇప్పటికీ ఆస్ట్రేలియాలో కుందేళ్లపై పోరాటం కొనసాగుతోంది.

ప్రస్తుతం కూడా తమ ప్రాంతంలో కుందేళ్ల బెడద ఉందని మెక్ డొనాల్డ్ అంటున్నారు. వాటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మళ్లీ గత పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)