MH370: ఆధునిక యుగంలో అంతుబట్టని రహస్యం

  • 29 మే 2018
Image copyright Reuters

అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీ 'ఓషన్ ఇన్ఫినిటీ' హిందూ మహాసముద్రంలో అత్యంత లోతుకు వెళ్లి గాలింపులు చేసింది.

ఇందుకోసం ప్రత్యేకమైన నౌకను కూడా వాడింది. కానీ MH370 విమానం జాడను కనుక్కోలేకపోయింది. గాలింపు చర్యలను మరింత ముందుకు తీసుకుపోవడానికి సదరు కంపెనీ దగ్గర ఎలాంటి ప్రణాళికలూ లేవని మలేసియా ప్రభుత్వం కూడా ప్రకటించింది.

2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తుండగా ఈ విమానం అదృశ్యమైంది. అందులో 239 మంది ప్రయాణికులున్నారు.

2017లో అధికారిక గాలింపుల చర్యలు ముగిశాయి. కానీ విమానం జాడ దొరకలేదు. దీపి గురించి పలు రకాల చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.

కానీ అలా దర్యాప్తు ముగించడం పట్ల గ్రేస్ నాథన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన విమానంలో ఈమె తల్లి కూడా ఒకరు.

''విమానం అదృశ్యమై నాలుగేళ్లు కావస్తున్నా, వీళ్లింకా ఎందుకు గొడవ చేస్తున్నారని అందరూ అనుకోవచ్చు. కానీ ఎమ్‌హెచ్370 అన్నది ఎప్పటికీ చరిత్ర కాదు అన్న విషయం అందరూ గుర్తించుకోవాలి'' అని గార్డియన్ వార్తా పత్రికతో ఆమె అన్నారు.

అసలేం జరిగింది?

2014 మార్చి 8 :మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎమ్‌హెచ్370 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరింది. టేకాఫ్ అయిన గంట లోపే విమానంతో సంబంధాలు తెగిపోయాయి. కానీ విమానంలో సాంకేతిక సమస్యలు కానీ, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనట్లు ఎలాంటి సమాచారం లేదు. ఆ వెంటనే చైనా దక్షిణ భాగంలోని సముద్రంలో ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.

2015 మార్చి 15 :ఎమ్‌హెచ్370 ప్రయాణ మార్గాన్ని దక్షిణ దిక్కుకు మరలించారన్న ఆధారాలు లభించడంతో హిందూ మహాసముద్రంలో గాలింపు చర్యలు మొదలయ్యాయి.

2015 జూలై :మడగాస్కర్‌కు తూర్పు దిక్కున ఉన్న ఓ దీవిలో విమాన అవశేషాలు తీరానికి కొట్టుకొచ్చాయి.

2017 జనవరి :విమానం పడిపోయి ఉంటుందని భావించిన ప్రాంతంలో చేపట్టిన గాలింపులు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో.. గాలింపు చర్యలు నిలిపేస్తున్నట్లు ఆస్ట్రేలియా, మలేసియా, చైనా దేశాలు ప్రకటించాయి.

2018 జనవరి :ప్రయాణికుల బంధువులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా.. ఓషన్ ఇన్ఫినిటీ అనే ప్రైవేటు సంస్థతో మలేసియా ప్రభుత్వం గాలింపుల కోసం ఒప్పందం చేసుకుంది. గాలింపు చర్యలను ప్రారంభించడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని, తాము విమానాన్ని కనుక్కున్న పక్షంలో తమకు 70 మిలియన్ డాలర్ల రివార్డు ఇవ్వాలని ఆ సంస్థ కోరింది.

2018 మే :ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గాలించడం అసాధ్యంగా మారింది. దీంతో గాలింపు చర్యలు ముగించారు. గాలింపు చర్యలను తిరిగి ప్రారంభించే ఆలోచనలు ఆ సంస్థకు లేవని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది.

Image copyright Reuters

ఎమ్‌హెచ్370 ఎందుకు పడిపోయింది?

ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. విమానాన్ని లేదా కీలకమైన విమాన అవశేషాలను కనుగొంటే.. ప్రమాదానికి గల కారణాలను అంచనా వేయొచ్చు. కానీ దర్యాప్తు అధికారుల వద్ద చాలా తక్కువ సమాచారం మాత్రమే ఉంది.

ప్రమాదానికి ముందు విమానం.. పైలట్ అధీనంలో ఉందా లేక అదుపు తప్పి సముద్రంలో పడిపోయిందా? అన్న విషయంలో ఇంతవరకూ నిపుణులు ఓ అంచనాకు రాలేదు.

కానీ.. ఉద్దేశపూర్వకంగానే పైలట్ విమానాన్ని సముద్రంలో దించాడన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

ఆస్ట్రేలియాకు చెందిన దర్యాప్తు అధికారులు ఈ వదంతులను ఖండించారు. చివరి క్షణాల్లో పైలట్ స్పృహ కోల్పోయాడని వారు చెబుతున్నారు. ప్రమాదానికి సాంకేతిక లోపం కూడా ప్రధాన కారణం కావచ్చు.

కానీ.. ప్రమాదానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే వరకూ ఇలాంటి ఊహాగానాలు ఆగవు.

తర్వాత ఏంటి?

విమానం అదృశ్యమవ్వడం గురించి త్వరలోనే ఓ నివేదిక విడుదల చేస్తామని మలేసియా రవాణా శాఖ మంత్రి ఆంథొనీ లోకే అన్నారు. కానీ నివేదిక ఎప్పుడు విడుదల చేసేదీ స్పష్టంగా చెప్పలేదు.

విమానానికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు ఉంటేగానీ గాలింపు చర్యలను తిరిగి ప్రారంభించకూడదని ఆస్ట్రేలియా, మలేసియా, చైనా ప్రభుత్వాలు ఓ అంగీకారానికి వచ్చాయి.

ప్రైవేట్ సంస్థల సాయంతో కూడా దర్యాప్తును కొనసాగించమని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ''గాలింపులు ఇంకా లోతుగా జరగాల్సి ఉంది'' అని మలేసియా భవిష్యత్ ప్రధానిగా భావిస్తున్న అన్వర్ ఇబ్రహీం ఆస్ట్రేలియా వార్తాపత్రికతో అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు