ట్రంప్.. కిమ్ మధ్యలో చోల్

  • 29 మే 2018
కిమ్ యంగ్ చోల్ Image copyright Reuters

ట్రంప్- కిమ్‌ల భేటీకి ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ఉత్తరకొరియాకు చెందిన అత్యంత సీనియర్ అధికారి ఒకరు న్యూయార్క్‌ బయలుదేరారు.

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ కిమ్ యంగ్ చోల్ ఉత్తర కొరియాలోని అత్యంత సీనియర్ అధికారుల్లో ఒకరు. 18 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ అమెరికాను సందర్శించనున్నారు.

కిమ్ యంగ్ చోల్ తమ దేశానికి వస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ధ్రువీకరించారు. ''అతనితో చర్చించేందుకు ఉన్నత స్థాయి బృందం ఏర్పాటు చేస్తాను'' అని ఆయన తెలిపారు.

ఉత్తర కొరియాతో చర్చల నుంచి తాను వైదొలుగుతున్నట్లు గత వారం ట్రంప్ పేర్కొనడంతో జూన్ 12న సింగపూర్‌లో జరగాల్సిన ట్రంప్-కిమ్‌ల భేటీపై అనుమానాలు నెలకొన్నాయి.

కానీ, ఇరు దేశాల ఉన్నతాధికారులు ప్రతిపాదిత భేటీ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉత్తర కొరియాకు చెందిన ఒక అత్యున్నత అధికారి అమెరికా అధ్యక్షుడిని కలవనుండటం ఇదే తొలిసారి.

ఉత్తర కొరియా చర్చల కోసం జనరల్ కిమ్‌ను పంపడం కీలకమైన చర్య. దీన్ని బట్టి ఆ దేశం అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఉత్తరకొరియా అమెరికా దౌత్య అధికారుల భేటీలోనూ ఈ మాజీ అధికారి పాల్గొన్నారు.

కానీ, బీజింగ్‌కు వెళ్లి చైనా అధికారులతో మాట్లాడిన అనంతరమే జనరల్ కిమ్ అమెరికా వెళుతున్నారని దక్షిణ కొరియా వార్తాసంస్థ యన్హోప్ పేర్కొంది.

Image copyright Reuters

ఎవరీ కిమ్ యంగ్ చోల్?

దక్షిణ కొరియా దృష్టిలో జనరల్ కిమ్(72) అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి. ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చర్చలకు సంధానకర్తగా ఆయన పనిచేశారు.

మిలటరీ ఇంటెలిజెన్స్ ముఖ్యఅధికారిగా ఉన్నప్పుడు దక్షిణకొరియాపై దాడులు చేశారని, టార్పెడోతో దక్షిణకొరియా యుద్ధనౌకను కూల్చి 46 మంది మరణానికి జనరల్ కిమ్ కారకుడయ్యారని ఆరోపణలున్నాయి. 2014లో సోనీ పిక్చర్స్ హ్యాకింగ్‌లోనూ ఆయన ప్రమేయం ఉందని అంటారు.

వీటి ఫలితంగానే అమెరికా అతడిపై 2010 నుంచి 2015 వరకు వ్యక్తిగత ఆంక్షలు విధించింది.

ఇవి కూడా చదవండి: